పేజీలు

27, జనవరి 2024, శనివారం

దేవునితో లావాదేవీలు!



చాల మంది క్రైస్తవ విశ్వాసులు పూర్వపు ధర్మము యొక్క అలవాట్లను, ఆచారాలను బట్టి దేవునికి మొక్కులు వాగ్దనాలు చేస్తారు. ఇతర ధర్మాలలో చెప్పబడుతున్న మాటలు ఏమిటంటే, "దేవుడా! నీవు ఫలానా మేలు చేస్తే, నేను ఫలానా మొక్కు నీకు తీర్చుకుంటాను" అని వాగ్దానాలు చేయటం. కానీ భూమ్యాకాశములకు అధిపతి, సర్వ సృష్టి కారకుడయినా మన దేవుడు, మన నుండి ఎటువంటి మేలులు, మొక్కు బడులు ఆశించటం లేదు. సర్వము సృష్టించిన దేవునికి, చివరకు మనలను కూడా సృష్టించిన ఆయనకు మన మొక్కు బడులు ఏపాటివి? మనం ఏదయినా యిస్తే గాని మనకు  మేలులు చేయలేని స్వభావం దేవునికి ఉంటుందా? తల్లి తండ్రులుగా మన పిల్లలు మనకు మేలు చేస్తేనే వారికి మంచి చేస్తామా? లేక వారికి నిత్యము మేలులు చేసేవారిగా ఉంటామా? 

మన దేవుడు చెపుతున్న మాట ఏమిటంటే, "నీతి మంతుడి మీద మరియు అనీతి మంతుడి మీద సమానంగా వర్షం కురిపిస్తానని, సమానముగా వారి అవసరాలు తీరుస్తానని" (మత్తయి 5:45).  అసలు దేవుని యొక్క  లక్షణమే అది. అన్యాయము చేయని వాడు, నిత్యమూ నీతిని జరిగించు వాడు. కానీ కొందరు స్వార్థ పూరిత ఆలోచనలతో, తమ బ్రతుకు తెరువు కోసం, దేవునికి ఇవ్వండి, మీకు రెండతలుగా, పదింతలుగా తిరిగి ఇస్తాడు అని మభ్యపెడుతూ, ప్రజలను దోచుకుంటున్నారు. దేవుణ్ణి చేతకాని వానిగా, మనం ఇస్తేగాని అవసరాలు తీర్చుకోలేని వాడిగా ప్రదర్శిస్తున్నారు. తన కార్యములు జరిగించటానికి  అన్యులను సైతం దేవుడు వాడుకున్నాడు అని బైబిల్ నందు ఎన్నో సంఘటనలు మనం చూడవచ్చు. 

పాత నిబంధన ప్రకారం, ఆనాటి ప్రజలు, తమ పాపముల పరిహార్థం బలులు అర్పించే వారు. మరియు, దేవునికి  మొక్కుబడులు చెల్లించే వారు. ఆ ప్రకారం కొన్ని సార్లు ప్రజలు దేవుని సన్నిధి యందు, మొక్కు బడులు వాగ్దానం చేసేవారు. ఉదాహరణకు సమూయేలు తల్లి అయిన, హన్నా సంతానం లేక అవమానాలు పడుతూ, దేవుని సన్నిధిలో ఎంతో దినముగా ప్రార్థించి, తనకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే, అతణ్ణి అయన సేవకు అర్పిస్తానని మొక్కుకుంది. దేవుడు ఆమెకు గొప్ప ప్రవక్త అయిన సమూయేలను మగ బిడ్డను అనుగ్రహించాడు (1 సమూయేలు 1:11). ఇక్కడ దేవుడు ఆమెకు సంతానం అనుగ్రహించింది, ఆమె తన బిడ్డను సేవకు సమర్పిస్తుందని మాత్రం కాదు. ఆమె పడుతున్న అవమానాలు దేవుడు చూశాడు. కనుక దేవుడు ఆమెకు సంతానం అనుగ్రహించాడు. 

ఆదికాండము 29: "31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను."

యాకోబు మామ అయిన లాబాను, అతణ్ణి మోసం చేసి జబ్బు కండ్లు గల లేయాను కట్టబెట్టాడు. కానీ యాకోబు రాహేలును ప్రేమిస్తూ లేయాను ద్వేషించాడు. అప్పుడు దేవుడు లేయా యొక్క గర్భం తెరిచి, ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆవిధముగా యాకోబు ఆమెను ప్రేమిస్తాడని. ఇక్కడ లేయా ఎటువంటి మొక్కులు దేవునికి వాగ్దానం చేయలేదు. కేవలము ఆమె దినమయిన స్థితిని ఎరిగి, దేవుడు ఆమెను దీవించాడు. అలాగే బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు, ఎందుకు విడిపించాడు? వారి కష్టాలను తొలగించాలని. వారి పితరులకు చేసిన వాగ్దానాలు నిలబెట్టు కోవాలని. తనకు వారేదో మొక్కుబడులు చేస్తారని కాదు. అలాగే దేవుడు యాకోబును కాపాడింది, అతను మొక్కుబడులు చేస్తాడని కాదు గాని తనకు అయన పట్ల ఉన్న విశ్వాసమును బట్టి భయభక్తులను బట్టి మాత్రమే (ఆదికాండము 28:20). 

ప్రసంగి 5: "4. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము;బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు. 5. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! జ్ఞానవంతుడయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథములో మాటలు అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిలో మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రీస్తు భోధలలో చెప్పినట్లుగా మనం అవునంటే, అవునని! కాదంటే కాదన్నట్లుగా మన మాటలు ఉండాలి. కేవలము బుద్ది హీనులు మాత్రమే ఇష్ట రీతిగా మాటలు మారుస్తారు. దేవునికి వారి యందు ఇష్టం లేదు. దేవునికి  మన మొక్కుబడుల యందు, బలుల యందు సంతోషం లేదు (హెబ్రీయులకు 10:6). మనుష్యులను పాపం నుండి దూరంగా ఉంచడానికి  మాత్రమే ఇటువంటి నిబంధనలు దేవుడు చేశాడు. ఈ బలుల ద్వారా మనుస్యుల నుండి విధేయతను, తన పట్ల ప్రేమను ఆశించాడు మరియు తాత్కాలిక క్షమాపణను దేవుడు వారికి అనుగ్రహించాడు. పశ్చాత్తాపం లేకుండా వారు చేసే ప్రాయశ్చిత్త బలులు దేవునికి సువాసన ఇవ్వలేవు. 

వారి హృదయములో కలిగిన దీనత్వము మరియు పాపమూను బట్టి వారికి కలిగిన విచారమును బట్టి దేవుడు సంతోషిస్తాడు (కీర్తనలు 51:16-17) అని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడు మనకు ఉచితముగా ఇచ్చిన రక్షణ మనం ఎదో  ఆయనను ప్రేమిస్తామని కాదు, నీతిమంతులుగా ఉంటామని కాదు. ముందుగా అయన మనలను ప్రేమించాడు కాబట్టి, అప్పుడప్పుడు మనం అయనను ప్రేమిస్తున్నాము. పరిశుద్దాత్మ శక్తి ద్వారా కొన్ని సందర్భాల్లో నీతిగా ప్రవరిస్తున్నాము. దేవుడు మన నుండి ఎదో ఆశించి మనలను దీవించడు, మనం నీతిగా లేమని మనలను తోసివేయడు. అధికమయిన మాటలతో ప్రార్థిస్తేనే దేవుడు మన ప్రార్థనలు వింటాడు అని చాల మంది భావిస్తారు. అది ముమ్మాటికి తప్పుడు భావన (మత్తయి 6:7) అని దేవుని వాక్యం చెపుతోంది. దేవుని తో గడపాలని ఆశ ఉన్నప్పుడు, గంటల కొద్దీ ప్రార్థనలో గడప వచ్చు కానీ కేవలము దీవెనల కోసం మాత్రం కాదు. 

అటువంటి భావన దేవునితో వ్యాపార లావాదేవీలు చేయటం లాంటిది. దేవుడు మన నుండి కోరుకుంటున్నది, సజీవ యాగముగా మన శరీరాలను అర్పించాలని. పాపముకు మరణించి, మారుమనసు అనే బలి పీఠం మీద,  పరిశుద్దాత్మ శక్తితో మన జీవితం మండాలి. అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. కేవలము మేలుల కోసమే అయితే, ఏ విధమయిన లావాదేవీలు దేవునికి అవసరం లేదు. మనం చెల్లించ వలసిన మొక్కుబడి  పశ్చాత్తాపము, పాపము లేని జీవితము మాత్రమే. దాన్ని ఆలస్యం చేయకుండా దేవుని సమర్పిద్దాము, ఆయనను సంతోష పెడుదాము. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసు కుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి