పరిశుద్దాత్మ మనకు అనుగ్రహించే అనేక తలాంతులలో ప్రసిద్ధి చెందినది పాటలు రాసే తలాంతు! ఎంతో మంది భక్తులు దేవుడు తమ జీవితంలో చేసిన అద్భుత కార్యములను కొనియాడుతూ స్తుతిగీతములు పాడినట్లుగా బైబిల్ లో మనం చూడవచ్చు. బైబిల్ లో కీర్తనలు అన్ని కూడా భక్తులు దేవునికి తమ కృతజ్ఞతలు చెపుతూనో లేదా తమ ఆవేధన తెలుపుకుంటూనో రాసినవే! ఏ విధమయిన చదువు సంధ్యలు లేకపోయిన కూడా గొర్రెలు కాచుకొనే దావీదు ఎంతో మధురముగా సంగీతం వాయించేవాడు అని బైబిల్ చెపుతుంది. మరియు కీర్తనల గ్రంథం సింహభాగం అయన రాసిన పాటలే!
ఆత్మీయ పరమయిన పాటలు రాయటానికి పెద్దగా చదువు, గొప్ప భాష జ్ఞానం ఉండవలసిన అవసరం లేదు! దేవుని పట్ల అమితమైన ప్రేమ, ఆరాధన భావం ఉంటే చాలు, తన చిత్తము చొప్పున పరిశుద్దాత్మ దేవుడు అయన నామ ఘనతార్ధం పాటలు రాసే తలాంతును మనకు అనుగ్రహిస్తాడు. ఎన్నో గొప్ప ప్రసంగాలు కలిగించగలిగిన ఆదరణ పరిశుద్దాత్మ ప్రేరితముగా రాసిన ఒక పాట కలిగిస్తుంది. సంగీతానికి మనసును ఆహ్లాదపరచే గుణం ఉంది! సౌలు మీదికి దురాత్మ వచ్చినప్పుడు దావీదు సంగీతం వాయించుట ద్వారా సౌలు ఆదరణ పొందేవాడు అని బైబిల్ చదివితే మనకు అర్థం అవుతుంది (1 సమూయేలు 16:23).
ఇశ్రాయేలు జనము ఎర్ర సముద్రం దాటగానే మోషే మొదలగు వారు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తన పాడారు మరియు మిరియాము మొదలగువారు కూడా నాట్యమాడుతూ కీర్తన పాడారు (నిర్గమకాండము 15). అంతే కాకుండా దేవుడు తమ జీవితాలలో అద్భుతాలు చేసిన ప్రతిసారి భక్తులు ఆయనను కీర్తిస్తూ పాటలు పాడారు అని బైబిల్ గ్రంథం చెపుతుంది. ఈ పాటలను గమనిస్తే, ఎక్కడ కూడా దేవుడు చేయని వాటిని, లేదా వారి జీవితంలో జరగని వాటిని, వారి ఇష్టానుసారం కవితాత్మక ధోరణిలో పాడలేదు. ఖచ్చితముగా దేవుని గొప్పతనమును, వారి జీవిత సాక్ష్యములను, దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడు అన్న వాస్తవాలు మాత్రమే పాటలుగా పాడినట్లు మనం గమనించవచ్చు.
పాటలు దేవుని గొప్పతనమును చాటేవిగా ఉండవచ్చు, లేదా దేవుడు వారి జీవితాలలో చేసిన అద్భుత కార్యాలను తెలుపుతూ ఉండవచ్చు. కొన్ని సార్లు దేవునికి మొరపెడుతూ, తమ నిస్సహాయతను చాటుతూ, ఇతరులను ఆదరించేవిగా కూడా ఉండవచ్చు. కొన్ని పాటలు మనలను ప్రశ్నిస్తూ, మన విశ్వాస జీవితమును మెరుగు పరచుకోవటానికి ఉపయోగపడుతాయి. మన రక్షకుడయినా క్రీస్తు సిలువలో చేసిన త్యాగమును తెలుపుతూ అయన ప్రేమను గుర్తు చేసి మనం మరల పశ్చాత్తాప పడేలా చేస్తాయి. పాట ఎటువంటిదయినా దాని అంతిమ ఉద్దేశ్యం విశ్వాసులను బలపరిచేదిగా ఉండాలి.
పరిశుద్దాత్మ దేవుడు సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చే ఈ తలాంతు ఎంతో ఉన్నతమయినది. మన ప్రభువయినా యేసు క్రీస్తు కూడా తన శిష్యులతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడాడు (మత్తయి 26:30) అని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. కనుక పాటలు రాసే తలాంతు ఉన్న వారు, దేవుని వాక్యముతో ఆ పాటలు సరిచూసుకుని బయటకు తేవాలి. కొన్ని సార్లు సంపూర్ణముగా వాక్యము తెలియని అన్యులు ఎవరయినా వింటే వాక్యానుసారమయిన మాటలు ఉన్న కూడా ఆ పాట దేవుని నామానికి అవమానం కలిగిస్తుందా అని, అన్ని కోణాలలో ఆలోచించ బద్దులుగా ఉన్నారు. వాక్యాను సారం కానీ వర్ణనలు, ఆత్మీయత లోతు లేని పాటలు విశ్వాసులకు ఎంత మాత్రము మేలుచేయవు! వారు ముందుకు వెళ్ళకుండా అడ్డుగా మారే అవకాశం ఉంది.
పౌలు, సిలను కొట్టి చెరసాలలో వేసి బంధించినప్పుడు వారు పాటలు పాడుతుంటే అక్కడ ఉన్న ఖైదీలందరు వారి పాటలు విన్నారు, తర్వాత దేవుడు అద్భుత రీతిగా భూకంపం తెప్పించి, వారందరి సంకెళ్లు విడిపోయేలా చేసాడు. ఆ జైలు అధికారి మరియు అతని ఇంటి వారందరు కూడా మారుమనసు పొంది రక్షణ పొందుకున్నారు (అపొస్తలుల కార్యములు 16:25-34). విశ్వాసముతో మనం పాడే పాటలు కూడా దేవుని కార్యములు జరిగిస్తాయి. సాటి వారికి ఆయన ప్రేమను, శక్తిని తెలిపి వారిని రక్షణలోకి నడిపిస్తాయి. కనుక పాట ఎవరు రాసారు, దాన్ని ఎవరు రూపొందించారు అని కాకుండా, ఎంత వాక్యాను సారముగా ఉంది, ఎటువంటి లోతును కలిగి ఉంది అని వాక్యముతో సరిచూసి పాటలు వినండి మరియు పాడండి.
ఎఫెసీయులకు 5: "19: ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు,"
పౌలు గారు సంఘములకు తానూ రాసిన పత్రికలలో కూడా ఎన్నో మారులు కూడా సంఘములో విశ్వాసులు ఒకరినొకరు పాటల ద్వారా హెచ్చరించుకోవాలని, ప్రోత్సహించుకోవాలని మరియు పాటల ద్వారా దేవుణ్ణి కీర్తించాలని పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా తెలియజేసారు. అనగా ఈ పాటలు పాడుట ద్వారా ఇతరుల విశ్వాసమును మనము బలపరిచే వారిగా ఉన్నాము. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా, సంగీతం హృదయములను ఆహ్లాదపరుస్తుంది మరియు ఆత్మీయత నిండిన పాటలు విశ్వాసులను ఎంతగానో ఆదరిస్తాయి. తద్వారా వారు విశ్వాసములో ఎదుగుతూ దేవుని కృపను పొందుకుంటారు. అంతే కాకుండా దేవుని వాక్యానుసారమయిన పాటలు వినుట ద్వారా ఎంతోమంది అన్యులు సైతం దేవుని ప్రేమను తెలుసుకొనే అవకాశం ఉంది.
కొలొస్సయులకు 3: "16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి."
పౌలు గారు కొలొస్సయులకు రాసిన పత్రికలో ఈ వచనము మనకు ఏమని చెపుతుంది? పాటలు పాడటం అనేది కేవలం నామమాత్రముగా చేసేది కాదు మరియు మన ఇష్టానుసారముగా నిర్ణయించేది కాదు గాని ఒక ఆజ్ఞవలె పాటించాలని మనకు అర్థమవుతుంది. ఆత్మ సంభంధమయిన కీర్తనలు పాడుట ద్వారా దేవుని వాక్యము బోధించబడాలి తద్వారా సంఘములో ఒకరి నొకరు హెచ్చరించుకోవాలి! అయితే ఈ పాటలు ఇతరులను విమర్శించినట్లు కాకుండా కృప సహితముగా ఉంటూ క్రీస్తు వాక్యము మన హృదయాలలో నిండిపోయేలా రాయబడాలి. పాట ద్వారా చెప్పిన వాక్యము సులువుగా అర్థం అవుతుంది మరియు ఎన్నో రోజులు గుర్తుంటుంది.
అయితే ఈ మధ్య కాలంలో ఆత్మీయత మరియు ఆదరణ కలిగించే పాటలు కరువయి పోయాయి. కేవలం లౌకిక పాటలకు ధీటుగా ఉండాలని హంగు ఆర్బాటల మోజులో పడిపోతున్నారు. విశ్వాసులను బలపరుస్తు సంఘమును కట్టవలసిన పాటలు, ఏ విధమయిన వాక్యము లోతు లేకుండా, సంగీతము, దృశ్యముకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంఘమునకు ఉపయోగం లేకుండా మారుతున్నాయి. కేవలము పాటను ఎంతమంది చూశారు, ఎంతగా పాపులర్ అయింది అనేది ప్రమాణంగా అయిపొయింది.
చెవులకు ఇంపుగా ఉన్నాయి కదా అని లేదా కంటికి అందంగా ఉన్నాయి కదా అని ఆత్మీయత లోపించిన పాటలు విని మీ విశ్వాసపు యాత్రలో చల్లారిపోకండి. ఉదాహరణకు పదవ తరగతి పాస్ అయినా విద్యార్ధి తిరిగి ఏడవ తరగతి చదివితే అతని జ్ఞానం పెరుగుతుందా? కొద్దీ రోజులకు అతను పదవ తరగతి పాఠాలు మరచిపోయి, చివరకు ఏడవ తరగతి పాఠాలకు అలవాటు పడిపోయి అందులోనే కొనసాగుతాడు. విశ్వాస జీవితం కూడా అటువంటిదే, వాక్యపు లోతు లేని, వాక్యాను సారం కానీ, ఆత్మీయ అభివృద్ధి కనపరచని పాటలు వినుట ద్వారా మీ ఆత్మీయ ఎదుగుదలను మీరే అడ్డుకుంటున్నారు.
ప్రియమయిన సహోదరి, సహోదరుడా! పాటలు రాయటం, పాడటం దేవుడు మనకు ఇచ్చిన ఆత్మీయ వరములు, వాటిని చులకనగా చూడవద్దు. దేవుని పాటలు పాడే నోటితో అన్యమయిన పాటలు పాడి విశ్వాసంలో వెనుకపడి పోవద్దు. ఏ పాటయినా మిమల్ని ఆదరిస్తుంటే లేదా మిమల్ని ఆత్మీయంగా బలపరుస్తుంటే దానిలో ప్రతి పదము విశ్వాసించి పాడండి. ఎందుకంటే ఆ పాట ద్వారా పరిశుద్దాత్మ దేవుడు మిమల్ని నడిపిస్తున్నాడు. పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తూ దూతలు పాటలు పాడుతున్నారు అని చాల సందర్భాలలో బైబిల్ లో రాయబడింది. రేపు మనం పరలోకం వెళ్ళిన తర్వాత యుగయుగములు మనం చేయవసింది కూడా ఆయనను ఆరాధించటమే!
అయితే పాటలు దేవుని వాక్యమునకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. దేవుడి వాక్యమునకు ముందు గాని తర్వాత గాని పాటలు పాడుకోవచ్చు లేదా వినవచ్చు కానీ దేవుని వాక్యమునకు బదులు పాటలు పాడటం వినటం చేయరాదు. ఎవరయినా సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడండి మరియు దుఃఖముగా ఉన్నపుడు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం చెపుతుంది (యాకోబు 5:13). కనుక పాటలు పాడటం అనేది ప్రార్థనకు కూడా ప్రత్యామ్నాయం కాదు. దేవుడు పాటల ద్వారా అద్భుత కార్యములు చేసాడు, చేస్తాడు, కానీ వాక్యము చదవాలని, మరియు ఆయనను ప్రార్థించాలని, ఆరాధించాలని కూడా అయన కోరుకుంటున్నాడు.
దేవుని చిత్తమయితే వచ్చేవారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి