పేజీలు

26, నవంబర్ 2023, ఆదివారం

చూస్తున్న దేవుడు (ఎల్రోయి)!


సామెతలు 15: "3. యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును."

దేవుని కన్నులు నిత్యమూ ప్రతి స్థలము మీద ఉండి, చెడ్డ వారిని మరియు మంచి వారిని చూస్తున్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనం చేసే ప్రతి క్రియ అయన ఎరిగి ఉన్నాడు, ప్రతి ఆలోచన చెడ్డదా మంచిదా ఆయనకు అవగతమై ఉన్నది. కనుక విశ్వాసులయిన మనము దేవుణ్ణి సంతోష పెట్టెలాగా జీవించాలి. చాల సార్లు మనం మన జీవితములో వివిధ రకాల పరిస్థితుల గుండా వెళ్తుంటాము. ఎన్నో సార్లు భయపెట్టె పరిస్థితులను ఎదురుకొంటాము. అటువంటి సమయంలో మన విశ్వాసం కాస్త సన్నగిల్లే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితిని దేవుడు మన మీదికి అనుమతించాడు అని సమస్తము అయన అధీనములో నడుస్తున్నాయని మనము పూర్తిగా విశ్వాసం చూపాలి. 

విశ్వాసులయిన మనలను ఓడించటానికి సాతాను దేవుని నుండి అనుమతి పొందుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనం ఎంత గొప్ప విశ్వాసం చూపితే అంత గొప్పగా సాతాను మన మీదికి శోధనలు తీసుకువస్తాడు. అయితే ఆ శోధన కూడా మనం తట్టుకునేది గానే ఉంటుంది తప్ప, మన శక్తికి మించినదిగా ఉండదు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక ఇటువంటి భయపెట్టే పరిస్థితులను ఎదుర్కోవటం దేవుని శక్తి ద్వారానే సాధ్యం అవుతుంది. నిత్యమూ ప్రార్థనలో దేవునికి మన మొరలు చెప్పుకోవటం ద్వారా దేవుని నుండి ఆదరణ పొందుకుంటాము, తద్వారా ఆ శోధనలు గెలుస్తాము. 

కొంతమంది దేవుడు మనలను పట్టించుకోడు, కేవలం పూజలు చేసి వేడుకుంటేనే మనకు కావలసిన అవసరాలు తీరుస్తాడు అని నమ్ముతారు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు.  మనలను మిక్కిలిగా ప్రేమించే దేవుడు, మనం ఎటువంటి స్థితిలో ఉన్న, ఆయనకు ఎంత దూరంగా ఉన్న మనలను చూస్తున్నాడు, మన గురించే ఆలోచిస్తున్నాడు. మనలను ఏ విధంగా రక్షించు కోవాలా? ఏ విధంగా ఆయనకు దగ్గరగా ఉంచుకోవాలా? ఏ విధముగా ఆయనను ప్రేమించే వారిగా మనలను మార్చుకోవాలా? అని ఆరాటపడుతున్నాడు. యేసయ్య చెప్పిన తప్పిన పోయిన కుమారుని ఉపమానం గుర్తుందా? కొడుకు తనను కాదని దూర దేశం వెళ్ళిన కూడా తండ్రి, అతని రాక కోసం ఎదురుచుశాడు. దూరాన ఉన్న కొడుకును గుర్తుపట్టి, పరుగున వెళ్ళి ముద్దాడి, నూతన వస్త్రాలు ధరింప జెసి, విందు చేశాడు. మన గురించి కూడా దేవుడు ఆలాగే ఎదురు చూస్తున్నాడు. 

కొన్ని సార్లు సాతాను పెట్టె శోధనలకు ఓడిపోయి, కొంతమంది విశ్వాసులు దేవునికి దూరంగా వెళ్ళి పోవాలనుకుంటారు. కానీ అప్పుడు కూడా దేవుడు వారిని చూస్తున్నాడు అన్న విషయం మరచిపోతారు. ప్రభువయినా యేసు క్రీస్తు సిలువలో చేసిన త్యాగాన్ని నిర్లక్ష్యం చేసి, వారిని బట్టి సాతాను దేవుని ముందు నిత్యము పిర్యాధులు చేయటానికి వారు కారణం అవుతున్నారు (ప్రకటన 12:10). అటువంటి వారికి ఘోరమయిన తీర్పు వేచి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తోంది (హెబ్రీయులకు 10:29). తల్లి గర్బంలో మనలను రూపించినప్పుడే దేవుడు మన పట్ల కొన్ని ఉద్దేశ్యాలు కలిగి ఉన్నాడు మరియు మనం ఎలా బ్రతకాలో నిర్ణయించాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. 

కీర్తనలు 139: "16. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను. 17. దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది."

దావీదు తానూ రాసిన కీర్తనలో తానూ పిండముగా ఉన్నప్పుడే తానూ బ్రతక వలసిన దినములన్ని దేవుని గ్రంథములో రాయబడ్డాయని చెపుతున్నాడు. అంతే కాకుండా దేవునికి తన పట్ల ఉన్న తలంపులు లెక్కించటం అసాధ్యం అని చెపుతున్నాడు. ఎందుకు పనికి రాని, ఏ మంచి లేని మన గురించి దేవుడు ఇంతగా ఆలోచిస్తాడా? అని అనుమానం వద్దు. సృష్టి కారకుడయినా యేసు క్రీస్తు, మన కోసం మనిషిగా పుట్టి, పాపం లేకుండా జీవించి, సిలువలో మన కోసం తన ప్రాణం పెట్టి, తిరిగి సజీవుడయినది ఎంత నిజమో, మన కోసం అయన నిత్యం ఆలోచిస్తున్నాడు, మనలను చూస్తున్నాడు అన్నది కూడా అంతే నిజము. ఇకనయినా దేవుని వైపు తిరిగి, విశ్వాసములో బలపడుతూ సాతానుకు సవాలుగా నిలుద్దాము, దేవునికి గొప్ప సాక్ష్యులుగా సాగుదాము. 

చూస్తున్న దేవుడు లేదా ఎల్రోయి అన్న ఈ మాటను మొదట ఉపయోగించింది అన్యురాలయినా హాగరు. ఈమె అబ్రాహాము భార్య అయినా శారా దగ్గర దాసిగా ఉండేది. శారా దేవుడు ఇచ్చిన వాగ్దానమును పూర్తిగా విశ్వసించకుండా, కుమారుణ్ణి కనటానికి తన భర్త అయినా అబ్రాహామును దాసితో కలువుమని చెప్పింది. విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రాహాము శారాను గద్దించటం మాని ఆమె చెప్పినట్లు చేశాడు. గర్భవతి అయినా హాగరు, శారను చిన్న చూపు చూడటంతో, అబ్రాహాము అనుమతితో శారా హాగరును హింసించటం మొదలు పెట్టింది. తట్టుకోలేని హాగరు అరణ్యంలోకి పారిపోయింది. అటు పైన యెహోవా దూత ఆమె సంతానం గురించి దేవుని వాగ్దానాలు వివరించి, ఆమె కుమారుడయిన ఇస్మాయేలు గురించి ప్రవచనాలు చెప్పటం జరుగుతుంది.

ఆదికాండము 16: "12. అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా  13. అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను."

హాగరు దేవునికి ఇష్టం లేకుండా కుమారుణ్ణి కనటానికి వాడుకోబడింది. ఇది శారా, అబ్రాహాముల తొందరపాటు వలన కలిగిన పొరపాటు. కనుక దేవుడు హాగరును కనికరించాడు. ఆమె ఎటు వెళ్తుంది కనిపెట్టడానికి, ఆమెకు ధైర్యం చెప్పటానికి దేవుడు తన దూతను పంపాడు. తిరిగి తన యజమానురాలయిన శారా వద్ద వినయంగా ఉండి కుమారుని కనుమని హితవు చెప్పించాడు. లెక్కింప శక్యం కానీ సంతానమును ఆమెకు వాగ్దనము చేశాడు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! అన్యురాలు మరియు దేవునికి  ఇష్టం లేని సంతానం మోస్తున్న ఒక దాసిని దేవుడు ఇంతగా చూస్తున్నాడు, ఆమె పట్ల అంతటి కనికరం కలిగి ఉన్నాడు. మనకు విశ్వాసం ఇచ్చి, తన రక్తం ద్వారా మనలను పరిశుద్దులుగా చేసుకొని, తన బిడ్డలుగా పిలుచుకున్న మనలను చూడకుండా ఉంటాడా? ఇక్కడ ఇస్మాయేలును గురించిన వాగ్దానాలు ప్రోత్సాహకరంగా లేకపోయినా హాగరు ఎక్కడ కూడా బాధపడలేదు. ఎందుకంటే ఐగుప్తు దాసీగా ఉన్న తనకు దేవుని వాగ్దానాల ద్వారా గొప్ప స్థానం లభించింది. మరియు దేవుడు చేసిన వాగ్దానాలు ఖచ్చితముగా నెరవేరుస్తాడని విశ్వాసం. మరియు తన కుమారుని సంతానం లెక్కలేని రేట్లు విస్తరిస్తుందని  సంతోషం. అంతే కాకుండా దేవుని తోడులో  తనకు, తన కుమారునికి రక్షణ దొరుకుతుందని నిశ్చయత ఆమెకు కలిగాయి. 

అందుకని "నన్ను చూసిన దేవుణ్ణి నేను ఇక్కడ చూశాను" అనుకొని దేవునికి "చూస్తున్న దేవుడు" అని పేరు పెట్టింది. మనం కూడా శోధన ఎదురయినప్పుడు, వేదన కలిగినప్పుడు "చూస్తున్న దేవుడు" అని గుర్తుచేసుకుని ధైర్యం పొందుకుందామా?  అలాగే చుట్టూ ఎవరు లేరు కదా అని పాపం చేస్తున్నపుడు, "చూస్తున్న దేవుడు" అని గుర్తెరిగి భయపడుదామా? దేవుని ప్రణాళికలు, అయన ఉద్దేశ్యములు మనకు అంతుపట్టవు. అబ్రాహాము, శారా దేవుడు చేసిన ఆలస్యముకు కారణాలు తెలియకుండా, తొందరపడ్డారు. స్త్రీ ధర్మము నిలిచిపోయిన  శారా గర్భమును తెరిచి ఇస్సాకును ఇవ్వటం ద్వారా దేవుడు మహిమ పొందగొరుతున్నాడు అని గుర్తించలేకపోయారు (ఆదికాండము 18:11). మనం కూడా ఆలస్యానికి అలసిపోయి, లేదా కలిగే శోధనలకు అధైర్యపడి విశ్వాసం కోల్పోకుండా వాటిని ధైర్యంగా ఎదురుకుందాము, విశ్వాసములో బలపడుదాము. సాతానుకు లొంగిపోయి మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశ్యాలు తప్పిపోకుండా ఉందాము.  అయన చూస్తున్న దేవుడు, నిత్యమూ మనలను కాస్తున్న దేవుడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసు కుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి