పేజీలు

12, ఫిబ్రవరి 2022, శనివారం

పరిచర్యలో దీనత్వం ఉందా?

 

ప్రభువయిన యేసు క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించకున్న తర్వాత, ప్రతి విశ్వాసి ఆశపడేది! అయన సేవలో వాడబడాలని. ఎందుకంటే దేవుడు పౌలు భక్తుని ద్వారా స్పష్టంగా  రాయించిన సత్యాలు ప్రతి విశ్వాసి లో  అటువంటి ఆలోచనలు,  ఆశలు కలగటానికి ప్రేరేపిస్తాయి.  పవిత్ర  గ్రంధమయిన  బైబిల్ లో చూసినట్లయితే అపొస్తలుడయిన పౌలు గారు కొరింథీయులకు  రాసిన మొదటి  పత్రికలో చాల విషయాలతో పాటు 12 వ అధ్యాయంలో ఆత్మసంబంధమైన వరములను గురించి చాల వివరంగా రాశారు. 

1 కొరింథీయులకు 12: "10. మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. 11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు."

ఈ వచనములలో స్పష్టంగా చెప్పబడుతున్న సంగతులు, క్రీస్తుసంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకై ప్రభువు తనను విశ్వసించిన వారికి తన చిత్తమును చొప్పున వారి వారి విశ్వాసమును బట్టి కృపావరములు అనుగ్రహిస్తున్నాడు. అందులో ఎన్నో ఆత్మీయ వరములు తెలుపబడి ఉన్నాయి. పౌలు గారు ఈ పత్రికలో కొరింథీ సంఘములో, ఆ సమయంలో జరుగుతున్న అపార్థములను వివరించారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం కూడా ఎన్నో సంఘములలో అంటువంటి అపార్థములు జరుగుతున్నాయి. సంఘమును నడిపే వారు సంఘము యొక్క క్షేమాభివృద్ధి  కొరకు కాకుండా తమను తాము ఘన పరచు కోవటానికి, ప్రజలను ఆకర్షించటానికి, ఈ కృప వరములను దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా లేని స్వస్థత వరములను ప్రదర్శిస్తూ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశ్యములయిన మారు మనసు, పాప విమోచన మరియు  నిత్య జీవము అనే గొప్ప బహుమతులకు ప్రాముఖ్యం లేకుండా చేస్తున్నారు. 

దేవుడు స్వస్థతలను ఇస్తాడు, మరియు తనను నమ్ముకున్న వారికి క్షేమాభివృద్ధిని  కలిగిస్తాడు. కానీ అవి మాత్రమే పొందుకోవటానికి దేవుణ్ణి విశ్వసిస్తే, డబ్బు  సంచిని ఆశించి యేసయ్యను వెంబడించిన ఇస్కరియోతు  యూదాకు, మనకు  ఏవిధమయిన తేడా లేదు. దేవుడు ఎప్పుడయినా అల్పులను మరియు అభాగ్యులను హెచ్చించి తన పనిలో పాత్రలుగా వాడుకున్నాడు. ఎందుకంటే వారిలో ఉన్న బలహీనతను బట్టి  దీనత్వముతో పూర్తిగా దేవుని పైన ఆధారపడ్డారు. దేవుడు  ప్రతి విశ్వాసిని క్రీస్తు దేహమయిన సంఘములో ఒక అవయవముగా చేసుకొని ఉన్నాడని పౌలు గారు స్పష్టంగా వివరిస్తున్నారు. సంఘము లో అభివృద్ధి జరగటానికి ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పగించి ఉన్నాడు. ఆ బాధ్యతల ఫలితమే ఈ  కృపావరములు లేదా తలాంతులు అని ప్రతి ఒక్కరం గ్రహించుకొని, వాటిని దేవుని నామ ఘనతార్థమై మాత్రమే ఉపయోగించాలి.  

దేవుడు జంతువులలో  ఎంతో అల్పమయిన గాడిదను మరియు పక్షులలో ఎంతో అల్పమయిన కాకిని సైతం తన పనిలో వాడుకున్నాడు. చెడిపోయిన ప్రవక్త బిలామును హెచ్చరించటానికి గాడిదకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు. అంతే కాకుండా యేసు క్రీస్తు ప్రభువుల వారు బెత్లెహేము నుండి యెరూషలేముకు వస్తున్న సమయంలో గాడిదను ఎక్కి వచ్చారు. అదేవిధంగా జల ప్రళయం తర్వాత నొహవు బయటకు పంపితే మాంసమునకు ఆశపడి  శవములను తింటూ  వెనుకకు రాని కాకిని తన ప్రవక్త అయిన ఎలియా ఆకలి తీర్చటానికి వాడుకున్నాడు.  

మనం చెప్పుకుంటున్న ఈ సంఘటనలలో గాడిద ఎంత అల్పమయినది అయినప్పటికి దేవుడు దానికి మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆ ప్రవక్తను హెచ్చరించటానికి. ఆ విధంగా తన పనిని ఆ గాడిద ద్వారా జరుపుకున్నాడు. అదేవిధంగా మొదట మాంసానికి  కక్కుర్తి పడి వెనుకకు రాకుండా  తనకు ఇచ్చిన బాధ్యతను  నెరవేర్చని కాకిని సైతం దేవుడు వాడుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమయిన మాంసమును తినకుండా ప్రవక్త కడుపు నింపే ఆ బుద్దిని దేవుడే కాకికి ఇచ్చాడు అనటంలో ఏ సందేహం లేదు.  అటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు ప్రతి విశ్వాసికి ఇస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా చెపుతోంది. కానీ దేవుడు తన సంఘము పనిలో మనలను బాగస్తులుగా చేసుకోవటానికి ఇచ్చిన ఈ ప్రతిభ, సామర్థ్యం మన గొప్పే అనుకోవటం, గర్వపడటం మన ఆత్మీయ జీవితానికి మేలు చేస్తుందా? 

విశ్వసంలో మనం శిశువులుగా ఉన్నపుడు ఉండే తగ్గింపు, కాస్త అనుభవం రాగానే నెమ్మదిగా మనలో తగ్గిపోవటం మొదలవుతుంది.  ఒక వేళ దేవుని శక్తి మూలంగా  మాట్లాడే సామర్థ్యం  పొందిన గాడిద దేవుడు చెప్పమన్న  మాటలు పలుకకుండా తన ఇష్టానుసారంగా పలకటం సబబేనా! అన్ని జంతువుల కన్నా తాను ఎంతో గొప్పదని తలిస్తే! ఎంత ముర్కత్వం? అదే గాడిద యేసు క్రీస్తు తనను అధిరోహించినప్పుడు ప్రజలంతా తన  ముందు నాట్యమాడుతూ, తమ వస్త్రములు పరుస్తున్నారని, తనను వారు ఆరాధిస్తున్నారనుకుని విర్ర విగితే ఎలా? ఆ గాడిద గుర్తించ వలసిన విషయం ఏమిటంటే దేవుని పలుకులు పలికినంత వరకే తనకు మాట్లాడే సామర్థ్యం, యేసు క్రీస్తును తాను మోసినంత వరకే తన ముందు ప్రజలు నాట్యమాడేది, హర్ష ధ్వనాలు చేసేది.

ఒక్కసారి మనలో దీనత్వం దూరం అయితే మన  ప్రతిభ, సామర్థ్యం ఎంత మాత్రం ఆశీర్వదింప బడలేవు. ఏవో వాణిజ్య ప్రకటనలు ఉపయోగించి ప్రజలను మభ్య పెట్టవచ్చు గాక! కానీ మనం  చేసే పనులు దేవునికి ఇష్టం ఉండదు, సంఘ అభివృద్ధికి ఎంత మాత్రం ఉపయోగపడవు. దేవుని పాత్రగా వాడబడాలని ఆశపడే సహోదరి, సహోదరుడా మన  సామర్థ్యం దేవుడు తన పని కోసం ఇచ్చినదే కానీ, మనలను మనం  ఘనపరచు కోవటానికి,  గర్వపడటానికి కాదని తెలుసుకోవాలి. అయన హస్తం మన మీద ఉన్నంత వరకె మనం ఏం చెప్పిన, ఏం పాడిన  విశ్వాసులకు కోకిల స్వరంల వినపడుతుంది లేదంటే కాకి అరుపులుగా మిగిలి పోతుంది. 

యాకోబు 4:6 "....అందుచేతదేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును అని లేఖనము చెప్పుచున్నది."

దేవుని వాక్యం ఎన్నో సార్లు చాల స్పష్టంగా చెపుతున్న మాట గర్విష్ఠులను దేవుడు ఏమాత్రం అంగీకరించడని. నాశనమునకు ముందు గర్వం వస్తుందని. యాకోబు గారు రాసిన పత్రికలో ఈ  వచనము చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. దేవుడు ఇచ్చిన తలాంతులు అయన ఘనత కోసం వాడండి, దీనత్వాన్ని వదిలి పెట్టకుండా, గర్వ పడకుండా  ప్రభువు చిత్తమును నెరవేర్చండి. సంఘము క్షేమాభివృద్ధికై పాటు పడండి. మనం కాకపోతే మరొకరిని దేవుడు లేపుతాడు తన కార్యములు జరుపుకుంటాడు. గర్వపడి, దీనత్వమును విడచి  గొప్ప దేవునికి మీ పట్ల  ఉన్న  ఉద్దేశ్యమును కోల్పోకండి. 

దేవుని చిత్తమయితే వచ్చే  వారం  మరొక వాక్య భాగం  మీ ముందుకు తీసుకొస్తాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి