పేజీలు

19, ఫిబ్రవరి 2022, శనివారం

సమాధానం, సమృద్ధిని కోరుతున్నావా?

 

సమస్యలు లేని జీవితం ఎవరు మాత్రం కోరుకొరు! ప్రతి పనిలో విజయం ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. అన్నింటిలో సమృద్ధిని ఎవరు మాత్రం కాదనుకుంటారు! మరి ముఖ్యంగా జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగిన మనము, అయన మహిమలు చూసి మేలులు పొందిన క్రీస్తు విశ్వాసులుగా మనం చేసె పనులలో విజయం కోరుకుంటాము! ఏ బాదరా బంది లేని జీవితాన్ని ఆశిస్తాము! అందులో తప్పులేదు! ఆయనే కదా చెప్పాడు "సమస్త భారము మోయు వారలారా నా యొద్దకు రండి" అని. మరీ ఎందుకనో ప్రతి దాంట్లో సమస్య, చిన్న చిన్న విషయాల దగ్గర సమాధానం లేకపోవటం, ఎంతో వస్తుందనుకున్న దగ్గర అరకొరగా రావటం, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్న చాలి చాలని జీవితం! దేనికి ఇదంతా జరుగుతోంది? 

అసలు దేవుడు ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నాడు? తనను నమ్ముకున్న ప్రజలను ఇలా సమృద్ధి, సమాధానం లేని వారిగానే ఉంచుతాడా? సహోదరి, సహోదరుడా! ఒక్కసారి నీ జీవితం పరికించి చూసుకో. నీ దినచర్యను పరిశీలించి చూడు. నీ దిన చర్యలో దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? దేవుని మందిరమయిన నీ దేహాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటున్నావు? 

హగ్గయి  1: "2.  సమయమింక రాలేదు, యెహోవా మందిర మును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే. 3. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయిద్వారా సెలవిచ్చినదేమనగా 4.  ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నిసించుటకు ఇది సమయమా?" 

ఈ వచనములలో దేవుడు ఏమంటున్నాడు! ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరానికి  ప్రాముఖ్యత ఇవ్వకుండా తమ ఇండ్లను బాగు చేసుకోవటానికి శ్రద్ద చూపిస్తున్నారు. దేవుని మందిరం బాగు చేయటానికి చాల సమయం ఉందనుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంటే దేవునికి ప్రథమ స్థానం  ఇవ్వకుండా తమ సొంత విషయాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. 

హగ్గయి ప్రవక్త ద్వారా ఆనాడు ఇశ్రాయేలు తో మాట్లాడిన దేవుడు నేడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మిగతా విషయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నావా? మనలో చాల మంది కూడా అప్పుడే ఏమిటి అంత భక్తి? ఎదో వారం వారం చర్చ్ కు వెళితే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ దేవుడు ప్రత్యేక పరచుకున్న మనం అయనకు ఇష్టమయిన వారీగా జీవించాలని విస్మరిస్తున్నాము. మనకు ఇంకా చాల సమయం ఉంది అనుకుంటూ దేవునికి సమయం ఇవ్వటమే మానేసాం కదా! 

యవ్వనస్తులు, కొంతమంది పెద్దవారు సైతం  క్రికెట్ మ్యాచ్ వస్తుంటే ఎన్ని గంటలయినా విసుగు రాకుండా చూస్తారు, కానీ చర్చ్ లో పాస్టర్ ఒక్క అరగంట వాక్యం ఎక్కువ చెపితే, గడియారాల వైపు చూస్తారు.  ఆడవారు, యవ్వన సహోదరిలు సమయం చిక్కితే సంఘంలో జరిగే అన్ని విషయాల గురించి చర్చిస్తూ ముచ్చట్లు పెడుతూ సమయం వృధా చేసుకుంటారు తప్ప, దేవుని వాక్యం చదవటానికి మాత్రం ఆసక్తి చూపించారు. దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేవుని కా లేక లోకానికా? 

మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాము, దశమ భాగం క్రమం తప్పకుండ ఇస్తాము ఇంకేం కావాలి అనుకుంటున్నారా? ఇది కేవలం నామమాత్రపు విశ్వాసము మాత్రమే. దీని వలన దేవుణ్ణి మేము నమ్ముకున్నాము అని చెప్పగలరే కానీ, మేము దేవుని మీద ఆధారపడ్డాము అని చెప్పుకోలేరు. రెండింటికి తేడా ఏమిటి? నమ్ముకోవటము అన్నది దేవుడు కేవలం సమస్యలు తీర్చటానికే అన్న భావన సూచిస్తుంది. కానీ ఆధారపడటం అన్నది, అన్నింటిలో ఆయనను వెతకటాన్ని సూచిస్తుంది. సంతోషమయిన, దుఃఖమయిన అయన యందు నిరీక్షణతో ముందుకు సాగే స్థితిని సూచిస్తుంది.  

దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి కదా? సర్వ శక్తిమంతుడయినా దేవుణ్ణి ఎక్కడో మూలకు నెట్టేస్తావా? కేవలం ఆదివారం కొంత సేపు సమయం వెచ్చించే స్థితిలో  ఉన్నాడా దేవుడు నీ జీవితంలో? కేవలం క్యాలెండర్ లో వచనం చదివి దేవుని వాక్యం చదివేసాను అనే స్థితిలో ఉందా నీ ఆత్మీయత? కనీసం రోజుకు ఒక్కసారయినా ప్రార్థించనంత సమయం లేని స్థితిలో ఉందా నీ జీవితం? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు! 

హగ్గయి 1: "5. కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి. 6. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. 7. కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి." 

ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వని ఇశ్రాయేలును దేవుడు ఎలా హెచ్చరిస్తున్నాడు ఈ వచనములలో చూడవచ్చు. వారు ఎంత కష్టపడినా సరయిన ఫలితములు పొందుకోలేక పోతున్నారు. నీ జీవితంలో కూడా ఇవీ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికయినా గుర్తెరిగి దేవునికి మొఱ్ఱ పెట్టుమని ప్రభువు పేరిట మిమల్ని  బ్రతిమాలు కొనుచున్నాము. మనకు అయన నుండి శ్రేష్ఠమయిన ఈవులు కావాలి కానీ ఆయనకు మాత్రం శ్రేష్ఠమయినవి ఇవ్వలేక పోతున్నాము. కనుకనే దేవుని వాగ్దానాలు నీలో ఫలించటం లేదు, కనుకనే నీ సమస్యల సమయంలో నీ ప్రార్థనలు సమాధానం పొందుకోవటం లేదు! సమృద్ధిని, సమాధానాన్ని కోరుకుంటున్నావా? 

అయితే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు. దేవుని మందిరమును అనగా  దేహాన్ని పాడు చేసే ఆ లోక రీతులకు ఈనాడే స్వస్తి చెప్పు.  దేవుని మందిరమును కట్టుకోవటానికి అనగా మన దేహమును కట్టడిగా పవిత్రముగా ఉంచడానికి దేవుని శక్తిని అడుగు. ఆయనే నీకు శక్తిని దయచేస్తాడు. ఆయనే ఆత్మీయ సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అన్నింటిలో అయన నీతిని వెదుకు! నువ్వు కోరుకుంటున్న వన్నీ నిన్ను చేరుకుంటాయి. 

మత్తయి 6: "33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును. 34.  రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును."

కొండమీద ప్రసంగంలో యేసయ్య చెపుతున్న ఈ మాటలు చూడండి. ముందుగా మనం దేవుని రాజ్యమును, అయన నీతిని వెతకాలి అప్పుడు సమస్తం మనకు ఆయనే అనుగ్రహిస్తాడు. యేసయ్య మాటలలో స్పష్టంగా చెపుతున్న  విషయాలు మనం దేవుని మీద ఆధారపడుతూ  ఈ లోకంలో  ఉన్న ఆరాటాలు, సమస్యలు వదిలిపెట్టమని. ఆలా అని దేవుడు మనకు ఇచ్చిన జీవనాధారమును నిర్లక్ష్యం చేయమని కాదు. అన్నింటికి అయన మీద ఆధారపడుతూ అన్నింటికన్న మనం దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ  అయన పనికి మొదటి స్థానం ఇవ్వాలి.  

ఎందుకంటే సమస్యలు అన్నవి ఏనాటికి పూర్తిగా తీరిపోలేవు అంటే సమస్య తరువాత సమస్య. ఎంత  చెట్టుకు  అంత గాలి అన్నట్లుగా వారి వారి స్థాయిని బట్టి సమస్యలు ఉంటాయి. వాటి మూలంగా చింతపడుతూ ఉంటె, సర్వ శక్తిమంతుడయినా దేవుణ్ణి అవమానించటం కదా? విశ్వాసంతో ఆయనకు ప్రథమ స్థానం ఇస్తూ దేవునిలో ఎదగటానికి ఆసక్తి చూపించండి. తగు సమయంలో మన సమస్యలు ఆయనే తీరుస్తాడు, మనకు అవసరమయిన సమృద్ధిని, సమస్యలలో సమాధానాన్ని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాము! అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి