పేజీలు

5, మార్చి 2022, శనివారం

ఇతరుల మెప్పుకై ఆశిస్తున్నావా?

 

మనలో ప్రతి ఒక్కరం ఇతరుల ముందు ఘనత పొందాలని ఆశపడుతూ ఉంటాము. మనకున్న ప్రత్యేకతలను బట్టి, ఇతరుల కంటే మనం అన్ని  విషయాలలో నైపుణ్యం ఉన్నవారిగా గుర్తింపు పొందటానికి ఆరాటపడుతూ ఉంటాము. ఎవరయినా మన ప్రతిభ గురించి పది మందిలో పొగడాలని ఎదురు చూస్తూ ఉంటాము. అందును బట్టి కొందరు ఇతరులను కాకా పట్టడం, వారు కోరుకున్నవి ఇవ్వటం చేస్తూ ఉంటారు. పూర్వ కాలం భట్రాజులు అనే వారిని పిలిపించుకొనేవారు, వారు దానం ఇచ్చిన వారిని అదే పనిగా పొగుడుతూనే ఉండెవారు. దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, కేవలం ఆ దానం చేసిన వారి అహం చల్లార్చుకోవటానికి తప్ప. అదేవిధముగా కొంతమంది క్రైస్తవ సహోదరులలో, సహోదరిలలో ఎవరయినా మన ప్రార్థన గురించి గాని, మనం పాడే పాట  గురించిగాని ఇతరులు పొగడాలని ఎదురు చూస్తూ ఉంటారు. అంతే కాకుండా ఫలానా వ్యక్తి ఇంత దశమ భాగం ఇచ్చారు, అంత కానుక ఇచ్చారు అని సంఘములలో మైకు పెట్టి మరీ చెప్పించుకుంటారు. అంతే కాకుండా తమ ఆత్మీయ జీవితము ఎంతో ఉన్నతమయినదని, వారు ఎంతో గొప్పగా దేవునిలో  ఎదుగుతున్నామని నిరూపించుకోవాలని చూస్తూ ఉంటారు. యేసు క్రీస్తు తన ఘనతను పక్కన పెట్టి, తండ్రి అయినా దేవుని నామముకు ఘనత రావటానికి, లోకమునకు తండ్రి ఉద్దేశ్యములు తెలపటానికి మాత్రమే ఆరాట పడ్డాడు. పొగడ్తలకై ఎదురు చూడలేదు, ఎవరు తిట్టినా పట్టించు కోలేదు. మత్తయి సువార్తలో యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్పిన విషయాలు గమనించండి!

మత్తయి 6: "1. మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు. 2. కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరముల లోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. "

ఈ అధ్యాయంలో చూసినట్లయితే మనుష్యుల మెప్పు కోసము నీతి కార్యములు చేయటం, వారి ముందు ఘనత పొందటానికి దాన ధర్మములు చేయటం దేవునికి ఇష్టం లేని కార్యములు. వారు దేవుని నుండి ఎటువంటి ఘనతను పొందలేరని దేవుని వాక్యము సెలవిస్తోంది. అంతే కాకుండా లేని ఆత్మీయ జీవితమును నటించటము వేషధారణగా దేవుడు  పరిగణిస్తాడు. వేషధారులయిన పరిసయ్యులను, శాస్త్రులను యేసు క్రీస్తు సున్నం కొట్టిన సమాధులతో పోల్చాడు. అంటువంటి వారిని అయన ఎన్నడూ అంగీకరించలేదు. కాబట్టి నా ప్రియా సోదరి సోదరులారా మీ ఆత్మీయ జీవితాన్ని ఇతరుల ముందు నిరూపించుకోవాలనే ఆరాటం వలదు. దేవుడు మీ జీవితం లో చేసిన మార్పులు చెప్పే తరుణంలో మీకు ఎక్కడయినా ఘనత కలుగుతుందేమో అలోచించి మీ సాక్ష్యములు పంచుకోండి.  మనలో ఏ ఒక్కరం కూడా మన విశ్వాసమును బట్టి అతిశయ పడటానికి వీలు లేదు, ఏలయనగా మనకున్న విశ్వాసము అనాది కాలములో దేవుడి ఏర్పాటు చొప్పున కలిగినదే. 

"సోదరుడా నువ్వు ఆత్మీయంగా బాగా ఎదుగుతున్నావ్" అని ఎవరయినా అంటే గర్వపడకండి కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం ఇతరుల ముందు ఎక్కువ ఆత్మీయంగా ఉంటున్నామా? నిజానికి సంఘములో కాకుండా మనం ఇంటిలో కూడా అంతే ఆత్మీయంగా ఉంటున్నామా? ఒంటరిగా ఉన్నప్పుడు మన తలంపులు దేవుని చుట్టే ఉంటున్నాయా? ఒక వేళ మన ఆత్మ సాక్షి లేదని చెపితే మాత్రం ఖచ్చితంగా మనం వేషధారణ వైపు పరుగు పెడుతున్నాము గాని ఆత్మీయత వైపు కాదు. 

మనుష్యులు మనలను ఘనత చేయాలని ఎదురు చూడటం, దేవుడి నుండి పొందే ఫలమును నిర్లక్ష్యం చేయటమే అవుతుంది.  మన గురించి సాక్ష్యములు దేవుడు చెప్పాలి గాని, మనలాంటి మనుష్యులు కాదని ఎలా వేళల గుర్తుంచు కోవాలి. యోబు గురించి సాతాను ముందు దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు తెలుసుగా! అంటువంటి సాక్ష్యం దేవుడు నీ  గురించి కూడా చెప్పాలని ఆశపడుతున్నావా? అయితే మనుష్యుల పొగడ్తలకు దూరంగా ఉండు, ఎలా వేళల నీతిని జరిగిస్తూ, దేవుని యందు భయ భక్తులు కలిగిఉండు, తగిన సమయంలో దేవుడు నీ సాక్ష్యమును బయలు పరుస్తాడు. తగిన ఘనతను, ఆశీర్వాదాలను నీ జీవితంలో కురిపిస్తాడు. 

మన రక్షకుడయినా యేసయ్య జీవితంలో జరిగిన ఈ సంఘటనను ఒక్కసారి చూద్దాం, మనం దేవుని చిత్తమును జరిగించినప్పుడు ఎలాగా మనకు ఘనతను తెస్తాడో తెలుస్తుంది

మత్తయి 3: "13. ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. 14. అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని 15.  యేసుఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. "

ఇక్కడ ప్రజలకు  యోహాను నీళ్ళతో బాప్తీస్మం ఇస్తున్నాడు, ఆ సమయంలో వారు  తమ పాపములు ఒప్పుకొని, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందుతున్నారు. ఏ పాపం లేని యేసయ్య వారిలాగే వరుస క్రమములో నిలబడి బాప్తీస్మం పొందటానికి వెనుకాడలేదు. ఈ జనమంతా తన గురించి ఏమనుకుంటారు, తనను కూడా పాపి కింద జమకడుతారెమో అని ఆలోచించలేదు. ప్రవచనములు నెరవేరడానికి, దేవుని చిత్తము జరిగించటానికి తన యొక్క సొంత ప్రతిష్టను లెక్క చెయ్యలేదు. ఇక్కడ అయన ఆలోచన విధానం ఇతరుల అభిప్రాయం పట్ల భయం లేదు, వారి పొగడ్తలకు, లేదా వారి తిట్లను లెక్క చేయని స్వభావం కనబడుతోంది. అయన ఆనాడు తన గురించి ఆలోచించుకొలేదు గనుకనే ఈనాడు మన రక్షణ అనుభవంలో ఎంతో ప్రాముఖ్యమయిన బాప్తీస్మం ప్రవేశ పెట్టబడింది. సంఘము క్షేమము కోసం మనం అటువంటి త్యాగము చేయటానికి సిద్ధమా? నాకు వాక్యం చెప్పే అవకాశం ఇవ్వలేదని ఒక్కరూ, పాడేటప్పుడు మైకు ఇవ్వలేదని మరోకరు, అన్నింటా నేనే ఉండాలి, అన్ని నా నుండే జరగాలి అని ఆత్మనూన్యతతో బాధపడుతూ సంఘమును ఎదగనివ్వని సంఘ పెద్దలు కొందరు. కానీ ఒక్క విషయం మరచి పోతున్నారు, దేవుని చిత్తమును జరిగిస్తే, సంఘము అభివృద్ధికి పాటుపడితే దేవుడే మన ఘనతను ఇతరుల ముందు చాటుతాడు, మన సాక్ష్యమును పెంచి ఇతరులకు ఆదర్శంగా నిలుపుతాడు. యేసయ్య బాప్తీస్మం పొందిన తర్వాత జరిగిన గొప్ప సంగతులు చూడండి. 
 
"16.  యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. 17.  మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను." 

దేవుని గ్రంథమయిన బైబిల్ ప్రకారం యేసయ్య అప్పటివరకు ఎటువంటి అద్భుతాలు చెయ్యలేదు, ఎంటువంటి ప్రసంగాలు చెయ్యలేదు, ఎటువంటి పాటలు రాయలేదు, పాడలేదు, ఎటువంటి అన్య భాషలు మాట్లాడలేదు. కానీ దేవుడు అయన యందు ఆనందించుచున్నాడు! ఏలా సాధ్యం అయింది. దేవుని ఆత్మ ఆకాశం నుండి సాక్ష్యం ఇస్తోంది. దేనిని బట్టి? ఆయనలో వేషధారణ లేదు. ఇతరుల మెప్పుకోసం ఆరాటం లేదు, తన ఘనత కోసం పాకులాడటం లేదు. కేవలం దేవుని చిత్తమును జరిగించటం, సంఘము క్షేమాభివృద్ధిని కాంక్షించటం మాత్రమే ఉన్నాయి. అందుకే దేవుడు ఆయనయందు ఆనందించుచున్నాడు. అంతే కానీ యోహాను ఆయనను పొగిడినందుకు కాదు, అయన చెప్పులు ఎత్తటానికి కూడా నేను సరిపోను అని యేసయ్యను గురించి  సాక్ష్యం ఇచ్చినందుకు కాదు. 

మత్తయి 6: "5. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 6. నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును."

పై వచనములలో మనకు తెలుస్తున్న సంగతులు ఏమిటీ? మన ఆత్మీయతను ఇతరుల ముందు ప్రదర్శించటం వాక్యానుసారం కాదు. దానిని బట్టి దేవుడు మన ప్రార్థనలు అంగీకరింపడు. ఇవిధంగా ప్రదర్శించటం వలన మనం వారి పొగడ్తల కోసం ఎదురు చూసినట్లే. పొగడ్తల కోసం ఎదురు చూసేవారు, దేవుని చిత్తము కన్న కూడా మనుష్యులకు ఏది ఇష్టమో అది చేయటానికి ఇష్టపడుతారు. మరియు మన హృదయమును దేవుని ముందు చూపించుకోవటానికి అవకాశం ఉండదు తద్వారా మనలో ఆత్మీయ ఎదుగుదల కుంటుపడుతుంది. కనుక అంటువంటి ఆత్మీయ జీవితం ఎన్నటికి దేవుణ్ణి సంతోషపెట్టదు, అది  వేషధారణను పెంచి పోషిస్తుంది. ఇతరుల మెప్పును కోరటం ఆపివేయండి, దేవుని చిత్తమును చెయ్యండి. దేవుడే తగిన సమయంలో మన సాక్ష్యమును బయలు పరచి సంఘములో మనుష్యుల ముందు ఘన పరుస్తాడు.  దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి