మన ప్రభువయిన యేసు క్రీస్తు చెప్పినట్లుగా "అడుగుడి మీకు ఇవ్వబడును, వేతకుడి మీకు దొరుకును మరియు తట్టుడి తియ్యబడును" అన్న వాక్యమును విశ్వాసించి, మనకు కావలిసిన మేలులను బట్టి ప్రార్థిస్తుంటాము. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవటం మరచిపోతాము! మనం కోరుకుంటున్న ఆ మేలు దేవుని చిత్తమేనా? ఆ మేలు కలుగుట వలన మనం ఆత్మీయంగా మరింతగా ఎదుగుతామా? లేదా దేవునికి దూరంగా లేదా విరోధంగా మారిపోతామా? అన్న భవిష్యత్ ప్రణాళిక మీద దేవుడు మనకు ఆ మేలులు అనుగ్రహిస్తాడు. కొన్ని సార్లు ఆ మేలులు పొందుకోవటం ద్వారా తాత్కలికంగా కలిగే మంచి కన్న శాశ్వతంగా జరిగే చెడు ఎక్కువగా ఉంటె వాటిని పొందుకోక పోవవటమే మనకు మేలు.
మనం కోరుకుంటున్న మేలులు దేవుని చిత్తమును నెరవేర్చేవిగా ఉండాలి! అనగా దేవుని పరిచర్యలో భాగంగా మిళితం కావాలి. ఉదాహరణకు సమూయేలు తల్లి హన్నా ప్రార్థనను గమనించండి!
1 సమూయేలు 1: "11. సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. "
ఇక్కడ హన్నా పిల్లలు లేనిదిగా అవమానము పొందుతోంది. దేవుని సన్నిధికి వచ్చి ఆమె ఏమని మొరపెడుతోంది! మగ బిడ్డను దయచేస్తే అతనిని దేవుని సేవకు వినియోగిస్తానని ప్రమాణం చేస్తోంది. తాను పొందుకొనే మేలును దేవుని పరిచర్యలో మిళితం చేస్తోంది. ఇక్కడ ఆమె స్వార్థం మచ్చుకయిన కనపడదు. కుమారుడు పుట్టిన తర్వాత మరల ఆమెకు పిల్లలు పుడుతారో లేదో కూడా తెలియదు కానీ దేవునికి ముందుగానే ప్రమాణం చేస్తోంది, కలిగిన ఒక్క బిడ్డను దేవుని సేవకు అంకితం చేస్తానని. ఆమె కోరుతున్న ఆశీర్వాదము దేవుని చిత్తములో ఉంది కనుక దేవుడు ఆమె కోరికను నెరవేర్చాడు.
అన్ని సార్లు అలాగే ఉండాలని కాదు, కొన్నిసార్లు దేవుడు మన అవసరాల నిమిత్తం మనకు మేలులు దయచేస్తాడు. కానీ కొన్ని మేలులు మనకు మేలు చెయ్యక పోగా కీడును చేస్తాయి. అంటువంటి సమయంలో దేవుడు ఆ మేలులు మనకు అనుగ్రహించకుండా ఆపివేస్తాడు. ఉదాహరణకు ఒక్క కుర్రాడు బైక్ గురించి తండ్రిని పీడిస్తున్నాడు అనుకుందాం. ఆ కుర్రాడి శక్తి సామర్థ్యాలు పూర్తిగా తండ్రి ఎరిగి ఉన్నాడు కనుక అతనికి బైక్ కొనివ్వటమో, ఇవ్వకపోవటమో చేస్తాడు. తండ్రి తనకు బైక్ కొనివ్వటం లేదు కనుక తండ్రికి తనంటే ఇష్టంలేదు అనుకోవటం ఆ కుర్రాడి తెలివి తక్కువతనం అవుతుంది. దేవుడు మన మేలులు ఆపివేయటం కూడా అటువంటిదే!
బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రాజయిన హిజ్కియాదేవుని చిత్తమును అంగీకరించక పోవటం వలన కలిగిన సంఘటనలు ఒక్కసారి చూద్దాం.
2 రాజులు 20: "1. ఆదినములలో హిజ్కియాకు మరణకరమైన.... రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్త యునైన యెషయా అతనియొద్దకు వచ్చినీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా"
పై వచనంలో దేవుడయినా యెహోవా రాజయిన హిజ్కియాకు ఆయువు తీరిందని సెలవిస్తున్నాడు. అప్పటివరకు ఆ రాజు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని దృష్టికి ఎన్నో మంచి పనులు చేసి ఉన్నాడు. కానీ మరణం వచ్చే సరికి దేవుని చిత్తమునకు విరుద్ధంగా ప్రార్థిస్తున్నాడు.
2 రాజులు 20: "3. యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను."
పై వచనంలో హిజ్కియా ప్రార్థనను చూడవచ్చు. అప్పుడు దేవుడయినా యెహోవా తన యొక్క నిర్ణయమును మార్చుకున్నాడు. అప్పటి వరకు హిజ్కియాకు సంతానం లేదు. దేవుడు తనకు మరో పదిహేనేళ్ళు జీవితకాలం పొడిగించాడు (2 రాజులు 20: 5-6). దాని వలన జరిగిన అనర్థములు కూడా మనం తెలుసుకుందాం. అయుష్షూ పొడిగింపబడిన హిజ్కియా తనను పరామర్శించటానికి బబులోను నుండి వచ్చిన మనుష్యులను ఆహ్వానించి ఎంతో గర్వంగా తన యొద్ద ఉన్న సంపదను ప్రదర్శించాడు. తద్వారా భవిష్యత్తులో బబులోను వారు ఇశ్రాయేలు మీదికి దండెత్తి రావటానికి ప్రేరణ అయ్యాడు. అధేవిదంగా ఆ ఆయుష్షు ద్వారా మనష్షే అనే కుమారుణ్ణి కన్నాడు. అతను ఇశ్రాయేలు రాజులలో అత్యంత హీనుడని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది.
2 రాజులూ 21: "1. మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లిపేరు హెఫ్సిబా. 2. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రా యేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను."
పన్నెండు ఏండ్ల నుండి పాలించటం మొదలు పెట్టిన అతను దేవుని దృష్టికి ఎన్నో దుష్ట కార్యములు చేసి ప్రజలను దేవుని నుండి తిప్పివేశాడు. ఇదంతా ఎలా జరిగిందని ఆలోచిస్తే, ఎం అర్థం అవుతుంది? హిజ్కియా రాజు దేవుని చిత్తమును అంగీకరించక తనకు ఇంకా ఎక్కువ అయుష్షూ కావాలని కోరుకున్నాడు. దేవుని చిత్తమునకు విరుద్ధముగా మరో పదిహేనేళ్ళు జీవితకాలము అనగా మేలులు పొంది ఈ కార్యములన్ని కలుగటానికి పరోక్షంగా కారణం అయ్యాడు.
మనలను నడిపించవలసిన దేవుడు మరి మనకు కీడు చేయబోయే కోరికలను లేదా మేలులను ఎందుకు అనుగ్రహిస్తాడు అని మనం ప్రశ్నించుకోవచ్చు. ఇదివరకు ఎన్నో మారులు మనం చెప్పుకోనట్లు దేవుడు మనకు పూర్తీ స్వేచ్ఛను కూడా అనుగ్రహించాడు. మన క్రియలకు మనమే భాద్యత వహించాలి. ఎలా అంటే! దేవుడు హిజ్కియాకు స్వస్థత అనుగ్రహించాడు మరియు కుమారుణ్ణి దయచేసాడు. కానీ అతను గర్వపడి సంపదను ప్రదర్శించాడు మరియు కుమారునికి దేవుని మహిమను మరియు భక్తి శ్రద్ధలను నేర్పటంలో విఫలం అయ్యాడు. పన్నెండేళ్లకు రాజయిన అతను అంత హీనుడిగా మారటానికి కారణం ఎవరు?
తండ్రిగా హిజ్కియా తన బాధ్యతను నెరవేర్చక పోవటమే అని అవగతమవుతుంది. మన ఉదాహరణలో చెప్పుకుంటే, తండ్రి కుర్రాడికి బైక్ కొనిచ్చాడు, కానీ వాడు దానిని తిన్నగా నడుపకుండా రకరకాల విన్యాసాలు చేసి ప్రమాదంలో పడితే తండ్రిని తప్పు పట్టటానికి లేదు. కనుక తండ్రి మాట విని బైక్ గురించి మంకుపట్టు పట్టకపోతే కొద్ది రోజులకు తండ్రి కారు కొని యిచ్చే వాడేమో కదా!
దేవుడు మన పట్టుదలను బట్టి, కోరికల తీవ్రతను బట్టి మనకు కావలసినది అనుగ్రహిస్తాడు, కానీ మనం ఆత్మీయంగా బలహీనులుగా మారిపోతాము. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు క్రింది వచనంలో చూడండి!
2 కొరింథీయులకు 12: "9. అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందె 10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను."
పౌలు అయనకు ఉన్న అనారోగ్యమును బట్టి దేవుణ్ణి స్వస్థతకై వేడుకుంటున్నాడు. కానీ దేవుని నుండి తనకు వచ్చిన సమాధానం "నా కృప నీకు చాలునని" కనుక తనకు ఉన్న ఆ బలహీనతలోనూ అతను బలవంతుడనని సంతోషిస్తున్నాడు. బలహీనతలో బలం ఎలా కలిగింది! దేవుడు తనకు తోడై ఉన్నాడు, అతను పూర్తిగా దేవుని చిత్తములో నడుస్తున్నాడు. దేవుని నిర్ణయమును అంగీకరించాడు. తానూ కోరుకొనే మేలు అనగా స్వస్థత కన్నా దేవుని కృపలో మిక్కిలి సంతోషించాడు.
కానీ ఇశ్రాయేలు వారు హిజ్కియా వలెనె తమ కోరికలు అణుచుకోలేక బలహీనులుగా మారిపోయారు. దేవుని చిత్తమును కనిపెట్టక తమకు కావలసిన మేలులకై ఆరాటపడి దేవునికి ఆగ్రహం తెప్పించారు.
కీర్తనలు 106: "13. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి. 14. అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి 15. వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను."
పై వచనం చూడండి! దేవుడు మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషిస్తుంటే వారు దానితో తృప్తి పడక, రుచులు మరిగి మాంసం కోసం అల్లాడినారు. అందు నిమిత్తమై తమ నాయకుడయినా మోషేతో వాదించి దేవుణ్ణి చులకనగా మాట్లాడారు. దేవుడు వారు కోరుకున్న మాంసం ఇచ్చాడు కానీ వారి ప్రాణములకు బలహీనత కలుగజేసాడు. పౌలు బలిహీనతలో కూడా బలంగా ఉన్నాడు, ఇక్కడ ఇశ్రాయేలు వారు బలంలో కూడా బల హీనులుగా మారిపోయారు. వారు కోరుకున్న మేలు పనికి రానిది, దేవుని చిత్తములో లేనిది. కనుక వారు బలహీనులుగా మారిపోయారు.
కనుక సహోదరి, సహోదరుడా నువ్వు కోరుకొనే మేలు దేవుని పరిచర్యలో మిళితమయి ఉందా? అది దేవుని చిత్తములో ఉందా? ఒక్కసారి ఆలోచించుకో. గ్రామంలో ఉన్న ఒక్క దైవ సేవకుడు, అంతర్జాతీయంగా సేవ చేయాలనీ కోరుకోవటం తప్పుగా అనిపించక పోవచ్చు కానీ దానికి తగ్గ నైపుణ్యం తనకు ఉందా? దేవుని సేవను అంతటి స్థాయిలో జరిగించగలడా? అలాగే భవిష్యత్తులో గర్వపకుండా దేవుని సేవను నిస్వార్థంగా నడుపగలడా? అని తనను తాను అంచనా వేసుకోవాలి. దేవునికి మనలను దూరం చేసే గుర్తింపు లేదా మేలుల కన్నా గుర్తింపు లేని సాధారణ జీవితమే మనకు మేలు కదా! దేవుని మీద ఆధారపడి మేలులు కోరుకోవాలి. అప్పుడు ప్రభువే మనకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. తగు సమయంలో ఆ మేలులు మనకు దయచేస్తాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి