పేజీలు

29, జనవరి 2022, శనివారం

ప్రభువు రాకడకు సిద్దపడుతున్నావా?

 

ప్రభువు నందు విశ్వాసముతో మారు మనసు పొందిన మీరు, నూతనముగా జన్మించి, ప్రభువయినా యేసు క్రీస్తును హృదయములలో నిలుపుకుని, అయన ప్రేమను ప్రతిఫలింపఁజేయ ప్రయత్నం చేస్తున్నారా? అయన రాకడకు సిద్దపడుతున్నారా? ప్రస్తుతం లోకములో జరుగుతున్నా పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉంటున్నాయి. యేసు ప్రభువు తన రెండవ రాకడను బట్టి అయన బోధలలో ప్రవచించిన విషయములవలే గోచరిస్తున్నాయి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అన్న మాటలు చూడండి ఈ వచనంలో:

ఎఫెసీయులకు 5: "15. దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, 16.  అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి."


దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగము చెసుకొమ్మని, అజ్ఞానుల వలే కాక జ్ఞానులవలె నడచుకోవాలని హెచ్చరిస్తున్నారు పౌలు గారు. ప్రతి వేళలో దైవ చింతన కలిగి ఉండుట మన ఆత్మీయతకు క్షేమకరము. ప్రస్తుతం మన చుట్టూ ఎన్నో శోధించే విషయాలు ఉన్నాయి. స్వల్పకాలం లోనే మనలను దేవునికి దూరం చేసి మన ఆత్మీయ మరణానికి కారణం కాగలవు. కనుక కాస్సేపే కదా అని వాటి జోలికి వెళ్లకుండా ప్రార్థనలో సమయం గడుపుతునో, దేవుని మాటలు ధ్యానిస్తునో లేదా దేవుని పాటలు వింటూనో కాలక్షేపం చెయ్యండి. 

పేతురు గారు తన మొదటి పత్రికలో సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడని రాశారు. సాతాను కుయుక్తులకు పడిపోకుండా, చుట్టూ ఉన్న శోధనలకు లొంగి పోకుండా, విశ్వాసంలోకి వచ్చిన కొత్తలో ఉన్నంత ఆరాటం, దేవుడి మీద ప్రేమ చూపించాలి. ఆత్మీయతలో నీవు ఎదిగే కొద్దీ ఆ ప్రేమ పెరుగుతూ రావాలి. కానీ చాల మందిలో అది తగ్గిపోతూ ఉంటుంది. రాను రాను మునుపటి స్థితికి కూడా వెళ్ళిపోతారు. తేడా ఒక్కటే ఏమిటంటే, అప్పుడు అన్యులుగా ఉన్నారు, ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. 

ఎందుకిలా జరుగుతుంది? దేవుడి అనంత ప్రేమను వారు తెలుసుకున్నారు. ఏం చేసిన క్షమిస్తాడులే, మరోసారి "క్షమించు ప్రభువా" అని రొట్టె, ద్రాక్షరసం తీసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు.  మనలను మనం మోసం చేసుకోవచ్చు కానీ, దేవుణ్ణి మోసం చేయలేము. ప్రతి హృదయపు తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు. వాటిని బట్టే మనకు తీర్పు తీర్చబోతున్నాడు. నువ్వు నిజంగా మారాలని ఆరాటపడుతున్నావా! నీ శరీరంతో పోరాటం చేస్తూ ఓడిపోతున్నావా? లేక పరిశుద్దాత్మ గద్దింపును లెక్కచేయక బుద్ధిపూర్వకంగా పడిపోతున్నావా? అయన అన్ని సంగతులు ఎరిగి ఉన్నాడు. ఒకవేళ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తుంటే, నీ ప్రయాణం ప్రభువు రాకడ వైపు సాగటం లేదు. 

సహోదరి, సహోదరుడా కొన్ని నిమిషాల సుఖం కోసం దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను  తప్పిపోకండి. నిన్ను జగతు పునాది వేయక ముందే అయన ఏర్పరచుకున్నాడు. నువ్వు ఏ కాలంలో, ఏ కుటుంబంలో పుడితే నీకు రక్షణ పట్ల ఆసక్తి కలుగుతుందో ఆయనకు తెలుసు. కనుకనే నీకు విశ్వాసం ఇచ్చి, నిన్ను బలపరచటానికి ఎన్నో మేలులు చేశాడు, తన దగ్గర చేర్చుకోవటానికి ఎన్నో పరిస్థితులు, ఇబ్బందులు అనుమతించాడు, నువ్వు తట్టుకోలేని శోధనలు ఇవ్వకుండా, చంటి బిడ్డను సాకినట్లుగా విశ్వాసంలో పెంచుతూ వచ్చాడు. మరి నువ్వు ఇప్పుడు అ  గొప్ప రక్షణ మార్గంలోనే సాగుతున్నావా? లేక శరీర సౌఖ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నావా? వేయిమంది భార్యలు, సర్వ సౌఖ్యాలు అనుభవించిన సొలొమోను ఏమని రాస్తున్నాడు ప్రసంగిలో ఒక్కసారి చూడండి!

ప్రసంగి 12: "1. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, 2.  తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము."

సొలొమోను గారు అన్ని సుఖాలు అనుభవించిన తర్వాత వాటిలో ఏ సంతోషం లేదని ముసలి ప్రాయంలో ఈ విషయాలు రాస్తున్నారు. అయన విషయంలో ఆలస్యం జరిగిపోయింది. కనుకనే మనలను హెచ్చరించే ఈ మాటలు దేవుడు తన గ్రంథంలో అనుమతించాడు. బాల్యమునందే దేవుణ్ణి తెలుసుకొని నడుచుకొనుట, ఆయనను స్మరించుట మేలయినదని తెలుపుతున్నాడు. మనకు ఇంకా సమయం ఉంది అనుకోని వ్యర్థమయిన, అశాశ్వతమయిన వాటికై అణగారిపోకండి. ప్రభువు రాకడ  ఎప్పుడో ఎవరికీ తెలియదు!

2 పేతురు  3: "10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదన 11.  ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు, 12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను."

ప్రభువు దినము దొంగవలే వస్తుందని పేతురు గారు రాస్తున్నారు. యేసు క్రీస్తును శిష్యులు ఆ దినము గురించి అడిగినప్పుడు తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు అని చెప్పారు. కనుకనే ఆ దినము చెప్పకుండా, దొంగవలే వస్తుందని పరిశుద్దాత్మ పలుమార్లు రాయించాడు. దొంగను ఎదురుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? గట్టిగా తలుపులు బిగించి తాళలు వేసేసి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా  మనం కూడా ఆత్మీయంగా పరిశుద్దమయిన ప్రవర్తనతో, భక్తితో జాగ్రత్తగా ఉంటూ ప్రభువు రాకడకై నిరీక్షించాలని  పేతురు గారు రాస్తున్నారు. 

1 థెస్సలొనీకయులకు  5: "4. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు. 5.  మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము. 6.  కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము."

పరిశుద్దాత్మ దేవుడు మరోసారి కూడా పౌలు గారిని ప్రేరేపించి ఈ వచనం  రాయించాడు. దొంగ వలే వచ్చు ఆ దినమునకు భయపడటానికి మనం చీకటిలో ఉండువారం కాదు. దొంగ ఎప్పుడు చీకటిలోనే వస్తాడు కనుక చీకటిలో ఉన్నవారు మాత్రమే ఆ దినమును గురించి భయపడతారు.  కానీ మనము క్రీస్తు ద్వారా  నిత్యమూ వెలుగులో కొనసాగువారము. మనకు  వెలుగు దేవుని వాక్యము మరియు  ప్రభువయినా యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. చీకటిలో ఉన్నవారు ఆత్మలో నిద్రపోతారు. లోకరీతులకు ఆకర్షితులయి, దుర్నీతిని అనుసరిస్తూ సాతాను సంబంధులుగా ఉంటారు. కానీ వెలుగులో ఉన్న మనము మెలుకువగా ఉంటూ అనగా మన రక్షణధారమయిన విశ్వాసమును అభ్యాసం చేస్తూ ప్రభువు రాకడకై ఎదురు చూడాలని పౌలుగారు మనలను ప్రోత్సహిస్తున్నారు. విశ్వాసమును ఎలా అభ్యాసం చెయ్యాలి? 

1 థెస్సలొనీకయులకు  5: "15. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. 16. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; 17. యెడతెగక ప్రార్థనచేయుడి; 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. 19. ఆత్మను ఆర్పకుడి. 20.  ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. 21.  సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. 22.  ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి." 

ఈ వచనములలో చెప్పిన విషయాలు కష్టతరంగా తోయటం సహజమే. కానీ అసాధ్యమయిన విషయాలు మాత్రం కావు. పరిశుద్దాత్మ శక్తి ద్వారా పాటించగల వాటినే దేవుడు రాయించాడు.  కీడుకు ప్రతి కీడు చేయక పోవటం, మనుష్యులందరికి మేలు చేయటం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం. అదేవిధంగా ఎడతెగక ప్రార్థన చేయటం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం చెయ్యాలి. ఎందుకంటే దేవుడు మన మేలు కొరకే దేనినయినా అనుమతిస్తాడు గాని మనకు కీడు చేయుటకు మాత్రం కాదు. 

ఆత్మను మండే స్థితిలో ఉంచుకోవటం, అంటే పరిశుద్దాత్మ గద్దింపును అనుసరించటం ప్రాముఖ్యమయినది. ఆలాగుననే దేవుడు రాయించిన ప్రవచనములు నిర్లక్ష్యం చేయక పోవటం. అలాగని ప్రతివారు తెలిపే ప్రతి ప్రవచనమును  నమ్మకుండా దేవుని వాక్యముతో సరిచూసుకోవాలి. అన్నింటిని వాక్యముతో పరీక్షించి  మేలయినది పాటించాలి. మన ఆత్మీయతను దెబ్బతీసే సమస్తమయిన కీడుకు దూరంగా ఉండాలి. 

వీటన్నింటికి కట్టుబడి ఉండటానికి సిద్ధపాటు చూపిన నాడు, పరిశుద్దాత్మ దేవుడు మనలను నడపటానికి తోడుగా ఉంటాడు. మనలను పిలుచుకున్న దేవుడు నమ్మకమయినవాడు. ప్రభువయినా యేసుక్రీస్తును ప్రేమించిన దేవుడు మనలను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. విశ్వాసములో కొనసాగటమే మనం చేయవలసింది. అనగా క్రియలు కలిగిన విశ్వాసమును పాటించాలి. 

1 థెస్సలొనీకయులకు  5: "9. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు."

ఈ వచనము ఎంత ధైర్యం నింపుతుంది చూడండి. దేవుడు మనలను ఏర్పరచుకున్నది ప్రభువయినా యేసుక్రీస్తు ద్వారా రక్షించటానికే గాని మన పాపముల నిమిత్తం శిక్షించటానికి మాత్రం కాదు. జగతు పునాది వేయక ముందే నిన్ను ఏర్పరచుకొని, పిలుచుకున్న దేవుడు తలపెట్టిన కార్యములు పూర్తీ చేయకుండా వదిలిపెడుతాడా? నిన్ను రక్షించటానికే కదా విశ్వాసం ఇచ్చింది! అయన మార్గములు అనుసరిస్తే చాలు నిన్ను మార్చుకోవటం ఆయనకు అసాధ్యమా? కనుక సహోదరి, సహోదరుడా - ప్రభువు రాకడకై సిద్ధపాటులో  అలక్ష్యం వలదు! రక్షణ విషయంలో నిర్లక్ష్యం కూడదు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో మీ ముందుకు వస్తాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి