యెహోషువ 10: "12. యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా. 13. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు. 14. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను."
యెహోషువను నాయకుడిగా చేసినప్పుడు దేవుడు ఆయనకు ఇచ్చిన వాగ్దానము ఏమిటంటే అయన ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలువలేడని! కానీ ఆ రోజు గడిచి పోతున్నను వారికి విజయం లభించటం లేదు. ఆ సమయంలో యెహోషువ నిరుత్సాహపడలేదు, దేవుని వాగ్దానాలు పని చేయటం లేదని సణుగుకొలేదు. ఎంతో ధైర్యముగా దేవుణ్ణి ప్రార్థిస్తు, సూర్య చంద్రులను నిలిచిపొమ్మని అడుగుతున్నాడు. మానవ మాత్రుడయినా వ్యక్తికి ప్రకృతిని శాసించటం సాధ్యమా? అతని ప్రార్థనలో సాధ్యసాధ్యాల ప్రస్తావన లేదు. హేతుబద్దమయిన ఆలోచనకు తావు లేదు. సృష్టి కారుడయినా దేవునికి అన్ని సాధ్యమే అన్న విశ్వాసమే కనపడుతుంది. అందుకే తన ప్రార్థన ఫలించింది. ఆ రోజు దేవుడు నరుని మాట విని సూర్య చంద్రుల్ని నిలిపి వేసి వారి తరపున యుద్ధం చేసి వారిని గెలిపించాడు.
చాల సార్లు చిన్న పిల్లలు తమ తల్లి తండ్రుల స్థితిని, పరిస్థితిని గమనించుకోకుండా అమాయకంగా తమకు అది కావాలి ఇది కావాలి మారం చేస్తారు. తల్లితండ్రులకు అది సాధ్యమా కాదా అని ఆలోచించారు. ఎందుకంటే హేతుబద్దమయిన ఆలోచన చేసే శక్తి వారిలో ఇంకా రాలేదు. కనుకనే తల్లి తండ్రుల మీద వారికి అంతటి విశ్వాసం. వారు ఎదగటం మొదలు పెట్టిన తర్వాత హేతు బద్దమయిన ఆలోచనలు పెరిగి తమ కోరికలను అదుపులో ఉంచుకుంటారు. విశ్వాసంలో ఎదిగే కొద్ది మనలో హేతుబద్దమయిన ఆలోచనలు తగ్గుతూ రావాలి. దేవునికి సమస్తము సాధ్యమే. అయన చిత్తానుసారముగా నా మేలు కొరకే అన్ని జరిగించగలడు అని విశ్వాసించాలి. కానీ మనమెమో ఆత్మీయంగా ఎదిగిన కూడా ఈ హేతుబద్దమైన ఆలోచనలు పాటిస్తూ మన ప్రార్థన విన్నపాలు నియంత్రించుకుంటాము. తద్వారా మన విశ్వాసమును చిన్నబుచ్చుకుంటూ దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళికలు చేజార్చుకుంటాము.
కానీ మన పరలోకపు తండ్రికి సజీవమయిన దేవుడు! సర్వ శక్తి మంతుడు, సర్వాధికారి, కేవలం నోటి మాట చేత సకలము సృష్టించిన దేవుడు. అయన మన నుండి కోరుకుంటున్నది మన స్వబుద్ధి ప్రకారం కాకుండా అనగా పరిస్థితులను బట్టి, సాధ్యమా కాదా అని అలోచించకుండా పూర్ణ హృదయముతో అయన యందు విశ్వాసము ఉంచటము మరియు మన ప్రవర్తన అంతటి యందు అయన అధికారమును ఒప్పుకోవటం అనగా ఆయన ఆజ్ఞలు పాటించటం, అప్పుడు ఆయనే మన త్రోవలను సరళం చేస్తాడు. అటువంటి అమాయకత్వము, పరాధీనత మరియు విశ్వాసము చిన్న పిల్లల్లోనే సాధ్యము. ఇలాగ నమ్మటం ఎంతవరకు సురక్షితము అన్న సందేహము వలదు. క్రింది వచనంలో యేసయ్య ఏమని బోధిస్తున్నాడు చూడండి!
పాపులము, చెడ్డ వారమయిన మనమే మన పిల్లలకు ఉన్నతమయిన జీవితం ఇవ్వాలని ఆరాటపడుతూ ఉంటాము కదా! మరి పరిశుద్ధుడు, ఏ తప్పు ఎరుగని సృష్టి కారుడయినా దేవుడు మన కోసం ఎంత గొప్పదయినా జీవితం దాచి ఉంటాడు. కేవలం అయన మీద విశ్వాసంతో ముందుకు సాగటమే మనం చేయవలసింది. బైబిల్ లో ఎక్కడ కూడా సాధ్యాసాధ్యాలు చూడమని చెప్పలేదు, కేవలం విశ్వాసం మాత్రమే చూపుమని చెప్పబడింది. పరిస్థితులు ఎంత ప్రతికూలమయిన నీకెందుకు! నాలో మీరు ఉండి, నా మాటలు మీలో ఉంటె నా నామములో మీరు ఏదడిగినా ఇస్తాను అని చెప్పింది అయన! అవన్నీ ఆయనే చూసుకుంటాడు. నువ్వు చేయవలసింది విశ్వాస పూరితమయిన ప్రార్థన! నీ సర్వము ఆయనకు అప్పగించటమే నీ ముందున్నా కర్తవ్యం.
ఒక తండ్రి తన కుమారునితో నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నీకు సైకిల్ కొనిపెడుతాను అన్నాడనుకుందాం. ఇక ఆ పిల్లాడు రాత్రి పగలు చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు. వాడి దృష్టి బహుమానంగా వచ్చే సైకిల్ మీదే ఉంటుంది తప్ప తండ్రికి సైకిల్ కొనటం ఆసమయంలో సాధ్యమా కాదా అని వాడికి పట్టదు. కానీ నీ పరలోకపు తండ్రికి అసాధ్యం ఏమి లేదు. ఆ పిల్లాడు కష్టపడి చదివినట్లుగా, విశ్వాసంతో అయన ఆజ్ఞలు పాటిస్తూ పార్థిస్తే ఆయన చెయ్యలేని కార్యం ఉందా? నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకుంటే నీ ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేయటానికి అయన ఎదురుచూస్తున్నాడో నీకు తెలుసా!
యేసు క్రీస్తు చేసిన అద్భుతాలలో ప్రాముఖ్యమయినది అయిదు రొట్టెలు, రెండు చేపలతో అయిదు వేల మందికి భోజనం పెట్టటం. ఇది ఏలా సాధ్యం అయింది? ఒక్క చిన్నవాడు నిస్వార్థంగా తన దగ్గర ఉన్న సమస్తమును అనగా అయిదు రొట్టెలు, రెండు చేపలు అప్పగించటం ద్వారా. యేసయ్య కార్యం చేసింది దానివాళ్లనే అని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఒక్క చిన్నవాడు దేవుని కార్యం కోసం తన గురించి ఆలోచించకుండా కేవలం యేసయ్య మీది విశ్వాసంతో ఎంతో పెద్దమనసుతో ప్రవర్తిస్తే, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసాడో చూడండి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి