పేజీలు

13, మే 2022, శుక్రవారం

పశ్చాత్తాప పడుతున్నావా?

 

విశ్వాసులయిన మనము దేవుని వాక్యము నమ్మినట్లయితే మనలో పాపం ఉన్నదని గుర్తించిన వారిగా ఉన్నాము. తమలో పాపం లేదని ఎవరయినా అంటే గనుక తమను తాము మోసం చేసుకొంటూ, దేవుణ్ణి అబద్ధికునిగా మారుస్తున్నారు మరియు సత్యమును తమ నుండి దూరం చేసుకుంటున్నారు (1 యోహాను 1:8-10). అసలు పాపం అంటే ఏమిటి? దాని నుండి ఎలా మనం తప్పించుకోవచ్చు అనే విషయాలు మనం ఇదివరకు "పాపం చేతిలో ఓడి విసిగి పోతున్నావా?" అనే అంశములో నేర్చుకున్నాము. 

అయితే మనలో చాల మంది ప్రత్యక్షమయిన లేదా భౌతికమయిన పాపం గురించి మాత్రమే దేవుణ్ణి క్షమాపణ అడుగుతాము. నిజానికి మానసిక మయిన పాపముల గురించి మనం పట్టించుకోము. మరియు వాటి విషయంలో పెద్దగా దేవుని దగ్గర క్షమాపణ అడగము అంటే పశ్చాత్తాప పడము. కానీ మన ప్రభువయినా యేసు క్రీస్తు ఆ పాత నిబంధన అనగా ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞలు అనగా భౌతికమయిన ఆజ్ఞలు అన్ని నెరవేర్చి తన ద్వారా మనకు నూతన నిబంధన అనగా కొత్త ఆజ్ఞలు బోధించాడు. అనగా మానసిక మార్పులు పొందుకొని, ఇది వరకు వచ్చే కోపము, గర్వము, కాముకత్వము, అసూయా వంటి ఎన్నో శరీర క్రియలకు స్వస్తి చెప్పాలి. తద్వారా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ, విశ్వాసములో బలపడుతూ ఉండాలి. 

మన ప్రభువయినా క్రీస్తు దేవుని మహిమను మనకు కనపరచటానికి మనుష్య కుమారునిగా భూమి మీద పాపం లేకుండా బ్రతికి తండ్రి అయినా దేవుని చిత్తమును నెరవేర్చాడు, మనకు మార్గదర్శిగా నిలిచాడు (యోహాను 1:14). అయన నీతిని మనం పొందుకోవాలంటే మనం కూడా ఆయనను వెంబడించాలి. అయన చేసిన ప్రతి బోధను మరియు అయన తత్వమును ఖచ్చితంగా పాటించాలి. ఆ క్రమములో మనలో నిత్యము సంభవించే శరీర క్రియలను బట్టి (గలతీయులు 5:19-21)  పశ్చాత్తాప పడుతూ క్రీస్తులో నూతనపరచబడినమని విశ్వసిస్తూ మన ఆత్మీయ జీవితం కొనసాగించాలి. 

అంతే కాకుండా వాటి మీద విజయం కోసం పరిశుద్దాత్మ దేవుణ్ణి ఆశ్రయించాలి.  నిత్యము పశ్చాత్తాప పడటం అంటే అదేపనిగా మనలను మనం కించపరచుకొవటం కాదు గాని, మనలో సంభవించే శరీర క్రియాలను నిత్యమూ దేవుని ముందు ఒప్పుకుంటూ క్రీస్తు రక్తంలో పరిశుద్దులుగా నూతనపరచుకోవటము అనగా మారుమనసు పొందుకోవటం.  ఈ మారుమనసు పొందుకోవటం అనే ప్రక్రియ క్రైస్తవ విశ్వాస జీవితంలో నిత్యమూ జరుగుతూ ఉండాలి. ఉదాహరణకు బయటకు వెళ్ళి రాగానే కాళ్లు, చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్తాము, లేదంటే ఏదయినా తినే ముందు చేతులు కడుక్కోటం కదా? మనకు అంటినా మురికి తొలగిపోయి జబ్బులు రాకుండా ఉంటాయని. 

దినదినము పాపము పట్ల అనగా శరీర క్రియల పట్ల మనలో ఏహ్యభావము పెరుగుతూ సున్నితమయిన ఆత్మ జ్ఞానము అలవరచుకోవాలి. తద్వారా మనము పరిశుద్దాత్మ అధీనములో ఉంటాము. అలాగే నిత్యమూ మన ప్రార్థనలో ప్రతి రోజు మనలో సంభవించె పాప క్రియలను బట్టి పశ్చాత్తాప పడటం ద్వారా వాటిని మనం గుర్తెరిగి పరిశుద్దాత్మ శక్తి ద్వారా వాటి మీద విజయం పొందుకుంటాము. ఆ విధంగా ఒక్కొక్క శరీర క్రియా మీద విజయం పొందుతూ విశ్వాసంలో ఎదగాలి. నిత్యమూ పశ్చత్తాప పడకుండా లేదా మారుమనసు లేని విశ్వాసము ద్వారా ఏ విధమయిన ఫలములు  మనము పొందుకోలేము. 

బాప్తిస్మము ఇచ్చు యోహాను ఆనాడు ప్రజలతో ఏమని సువార్త చెప్పి వారిని పశ్చాత్తాపానికి అనగా  మారు మనసుకు  సిద్దపరిచాడు?

లూకా 3: "8. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రా హామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పు చున్నాను."

ఇక్కడ యోహాను "మారు మనసు పొందిన వారు మాత్రమే ఫలములు పొందుకుంటారు" అంటున్నాడు. అయితే ఆనాటి ప్రజలు ఇంకా మోషే ధర్మ శాస్త్రము ద్వారానే నీతి మంతులుగా తీర్చబడుతాము అని నమ్ముతున్నారు కనుకనే ఆ విశ్వాసం ద్వారా తాము అబ్రాహాము సంతానం అని తమకెందుకు మరల ఈ బాప్తిస్మసం మరియు మారుమనసు అని గర్వపడుతూ యోహానును ప్రశ్నించారు. అప్పుడు యోహాను "అబ్రాహాము సంతానం అయినంత మాత్రాన మీకు మినహాయింపు లేదు! దేవుడు తలచుకుంటే రాళ్ళ ద్వారా కూడా అబ్రాహాముకు సంతానం పుట్టించగలడు" అని గద్దించాడు.  

ఆ ప్రజలు యేసు క్రీస్తు వచ్చింది మోషే ధర్మ శాస్త్రమును నెరవేర్చి తన ద్వారా నీతిని స్థాపించి నూతన నిబంధన చెయ్యబోతున్నాడని ఎరుగరు. కనుకనే యోహాను క్రీస్తును గురించి ముందుగా సాక్ష్యం ఇస్తూ, ఈ సువార్తను చాటుతూ బాప్తీస్మం ఇస్తున్నాడు. ఆనాటి ప్రజల మాదిరి ఈనాటి విశ్వాసులు కూడా తమ సంఘములను బట్టి, బైబిల్ జ్ఞానమును బట్టి తమకు ఉన్న వివిధ రకాల ఆత్మీయ వరములను బట్టి గర్వపడుతూ తమలో పాపం గుర్తించని వారిగా ఉన్నారు. 

మరియు ఎదుటి వారిని దూషిస్తూ, వారికి తీర్పు తీరుస్తూ, శరీర క్రియలను విచ్చలవిడిగా జరిగిస్తూ, దేవుని కృప ఉంది అని పశ్చాత్తాపమును అనగా మారుమనసును నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసు క్రీస్తు చెప్పిన సుంకరి మరియు పరిసయ్యుని ప్రార్థన ఉపమానం గుర్తుందా? (లూకా 18: 9-14)  ఆ ఇద్దరిలో పరిసయ్యుడు తానె నీతిమంతుడనని అనగా తనలో ఏ పాపం లేదని ప్రార్థించి వేషధారిగా మిగిలిపోయాడు, కానీ సుంకరి మాత్రం పాపినని ఒప్పుకొని నీతిమంతునిగా ఫలం పొందుకున్నాడు. 

యేసు క్రీస్తు చెప్పిన లాజరు మరియు ధనవంతుని సంఘటనలో ధనవంతుడు మారు మనసు పొందుకోకపోవటం ద్వారా పాతాళములో నరకయాతన పడుతున్నాడు. కేవలం తానూ అబ్రాహాము సంతానము అని గర్వపడి అనగా తన స్వనీతిని బట్టి నశించి పోయాడు. ఇప్పుడు అబ్రాహాముతో "తన సహోదరులకు సువార్త చెప్పి వారు మారు మనసు పొందులాగా మృతులలో నుండి లేచిన ఒకరు వెళ్ళుట ద్వారా వారు మారు మనసు పొందుదురని లాజరును పంపమని" వేడుకుంటున్నాడు. 

దానికి అబ్రాహాము "మోషే మొదలగు ప్రవక్తలు చెప్పిన నమ్మని వారు మృతులలో నుండి లేచిన వాని మాటలు విని మారు మనసు పొందారని" అన్నాడు (లూకా 16:19-31). మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నామని గుర్తించాలి! పశ్చాత్తాపము, మరియు మారు మనసు గురించి దేవుని వాక్యము ఎన్నో మారులు మనలను హెచ్చరిస్తుంది. వాటిని పాటిస్తూ మన పాపములను గురించి పశ్చాత్తాప పడుతున్నామా? 

చాల మంది విశ్వాసులు దేవుని కృప ఉంది, క్రీస్తు రక్తం పరిశుద్ధ పరుస్తుంది కదా అని, బుద్ది పూర్వకంగా పాపం చేస్తూ క్షమించు ప్రభువా అనుకోవటం పశ్చాత్తాప పడటం మరియు మారు మనసు పొందుకోవటం కాదు. ప్రతి హృదయ తలంపులను ఎరిగిన దేవుడు మన స్థితిని, ఉద్దేశ్యాలను కూడా ఎరిగి ఉన్నాడు. "ఒక్కసారి అనుభవ పూర్వకముగా నీతి మార్గము తెలుసుకొని, తమ రక్షణకు కారణమయిన క్రీస్తు ఆజ్ఞలను మీరటం కంటే, వాటిని తెలుసుకోక పోవటమే మేలు" (2 పేతురు 2:22)  అని దేవుని వాక్యం స్పష్టంగా చెపుతోంది. పశ్చాత్తాప పడటం ద్వారా మనలో పాపం మనకు స్పష్టంగా కనపడుతుంది తద్వారా దేవుని ముందు వేషధారలుగా ఉండకుండా అయన కృపను మరింతగా పొందుకుంటాము. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! బాప్తిస్మము ఇచ్చు యోహాను ద్వారా ప్రజలకు చెప్పబడిన దేవుని రాజ్యము యొక్క సువార్త క్రీస్తు ద్వారా మరింతగా విస్తృత పరచబడింది. కనుక పశ్చాత్తాపము మరియు మారు మనసు అనేది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. యేసయ్య మనలను తన స్వరూపంలోకి మార్చటానికి మనకు ఆజ్ఞలు ఇచ్చి, సహాయంగా పరిశుద్దాత్మ శక్తిని ఇచ్చాడు. కాబట్టి అయన ఆజ్ఞలు పాటిస్తూ, పడిపోతే పశ్చాత్తాప పడుతూ మారు మనసు పొందుకుందాము. 

అపొస్తలుల కార్యములు 17: "30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించు చున్నాడు."

పరిశుద్దాత్మ ద్వారా రాయబడిన ఈ వచనము ఏమని చెపుతుంది? క్రీస్తును  ఎరుగని అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు కానీ ఒక్కసారి క్రీస్తును తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ ఆజ్ఞలు పాటించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. లేదంటే మన విశ్వాసము క్రియలు లేని విశ్వాసముగా మిగిలి ఏ విధమయిన ఫలములు మనం పొందుకోలేము. క్రీస్తులో ఫలించటం అంటే అయన ఆజ్ఞలు అన్ని పాటించటమే కదా! అందులో ముఖ్యమయినది పశ్చాత్తాప పడటం అనగా మారు మనసు పొందుకోవటం. కనుక పాటించి ఫలములు పొందుదాము. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకు దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి