పేజీలు

19, మే 2022, గురువారం

దేవునికి నమ్మకముగా ఉంటున్నావా?

 

దేవుడు మానవులను ఏర్పరచుకున్నది వారితో వ్యక్తిగతంగా సంభందం కలిగిఉండటానికి అని ఇదివరకు మనం నేర్చుకున్నాం కదా! ఎంత వ్యక్తిగతం అంటే, అయన ఆఖరికి మనకు అంత విలువయినవి కానీ మన తల వెంట్రుకలు సైతం లెక్కించి ఉన్నాడు. మరియు తానూ చేసిన సృష్టిలో మనుష్యులను అత్యంత శ్రేష్ఠమయిన వారిగా పరిగణించాడు (లూకా 12:7). తనను ప్రేమించినవారికి సమస్తము సమకూర్చి వారికి మేలు చేయాలనీ ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడు (రోమియులకు 8:28). ఆయనను ప్రేమించటం ఆంటే ఏమిటి? "మన సొంత చిత్తమును వదిలి, అన్నింటికి అయన మీద ఆధారపడాలి. మరియు ప్రతి విషయంలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి అనగా ప్రతి నిర్ణయము దేవుని అనుమతితో  తీసుకోవాలి"

ఇటువంటి సాన్నిహిత్యము అయన మన నుండి కోరుకుంటున్నాడు. దేవుడు మనకు స్వచిత్తమును అనుగ్రహించాడు కదా! మరి ఎందుకని ఇంతగా మన జీవితంలో తన ఆధిపత్యం కోరుకుంటున్నాడు? ప్రతి మనిషిని దేవుడు ఒక ఉద్దేశ్యముతో సృష్టించాడు, కనుక అయన ఉద్దేశ్యాలు నెరవేర్చాలని దేవుడు మనలను తన విశ్వాసులుగా ఏర్పరచుకుని, ఎంతో విలువయిన రక్షణను మనకు ఇఛ్చి, మనలను తన ఉద్దేశ్యాలు నెరవేర్చులాగున నడిపించాలని ఆశపడుతున్నాడు. కానీ మనము కేవలం రక్షణ పొందుకుంటే చాలు, ఏ కష్టాలు రాకుంటే చాలు, అన్ని అవసరాలు ఎప్పటికప్పుడు తీరిపోతే చాలు అని కుచించిన లేదా స్వార్థ పూరిత  మనస్తత్వంతో ఆలోచిస్తున్నాము. 

దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకమును త్రోసి పుచ్చి, ప్రతి చిన్న, పెద్ద విషయంలో మన స్వార్థంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ దేవుణ్ణి ఎంతగానో భాధిస్తున్నాము, అయన మన మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేక పోతున్నాము. ఉదాహరణకు మనకు ఆకలి లేకపోయినా ఏదయినా తినాలని అనిపిస్తే వెంటనే వెళ్ళి కొనుక్కుని తినేస్తాము! మరియు పెద్దగా అవసరం లేకపోయినా, ఏదయినా ఖరీదయిన వస్తువు కొనాలి అనిపిస్తే డబ్బులు ఉన్నాయి కదా అని వెంటనే వెళ్ళి కొనేస్తాం. ఎందుకంటే మన ఉద్దేశ్యంలో మనం ఎవరిని మోసం చేయటం  లేదు, పైగా అది మన డబ్బు, అంత మన ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకుంటాము అని ఆలోచిస్తాము.  

కానీ దేవుణ్ణి నమ్మిన విశ్వాసులుగా మనము గుర్తించవలసిన విషయము ఏమిటంటే, సృష్టిలో ప్రతిది దేవునికి సంబంధించినదే. మనకు ఉన్న జీవిత కాలం, ఆరోగ్యము, ఆత్మీయ వరములు, సంతానము ఆఖరికి మనకు ఉన్న డబ్బు కూడా ఆయనదే. దానిని అయన మనకు ఎందుకు ఇచ్చాడో, ఏవిధంగా మన ద్వారా వాడలనుకుంటుంన్నాడో మనకు తెలియదు. కేవలం దశమ భాగం ఇచ్చేశాము కదా, ఇదంతా మనదే అన్న ఆలోచన కూడదు. ఆలా అని మనకు ఉన్నదంతా దైవ జనులకు ఇచ్చేయమని కాదు కానీ, దేవుడు ఇచ్చిన ఆ ధనమును నమ్మకంగా ఖర్చు చేయాలి. ప్రతి నిర్ణయానికి ముందు అయన చిత్తమును కనిపెట్టాలి. 

నలుపది దినముల ఉపవాసం తర్వాత, రాళ్ళను రొట్టెలుగా చేసే శక్తి ఉన్నప్పటికి యేసయ్య ఎందుకు తన ఆకలి తీర్చుకోలేదు? తండ్రి చిత్త ప్రకారంగా మనుష్యుడు కేవలం రొట్టె ద్వారా కాకుండా దేవుని నోటి నుండి వచ్చే  ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు అని సాతాను ముందు నిరూపించాడు (మత్తయి 4:4). తద్వారా దేవుడు తనకు ఇచ్చిన అద్భుతాల వరమును తన కోసం ఉపయోగించకుండా, దేవుని మహిమార్థమై వాడుతూ, మనకు పాఠంగా తనను తాను ఉపేక్షించుకున్నాడు. 

అలాగే స్వస్థతలు చేసే విషయంలో కూడా క్రీస్తు దేవుని చిత్తమును పాటించాడు అని చెప్పవచ్చు, ఎందుకంటే బేతెస్థ కొలను దగ్గర ఎంతోమంది రోగులు పడి ఉండగా అయన ఒక్కరిని మాత్రమే స్వస్థపరిచాడు. తన ఇష్ట ప్రకారమే అయితే అక్కడున్న అందరిని స్వస్థ పరచి తన గొప్పను చాటుకునే వాడు. కానీ ప్రతి చిన్న విషయంలో అయన పరిశుద్ధాత్మకు లోబడి నడుచుకున్నాడు కనుకనే దేవునికి నమ్మకంగా ఉంటూ ఆయనను సంతోష పెట్టాడు. దేవుడు తనను భూమి మీదికి  పంపిన ఉద్దేశ్యమును చివరి వరకు నెరవేర్చాడు.  

దేవుడు మనకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం విషయంలో ఆయనకు నమ్మకంగా ఉండాలి. అయన మనకు ఇస్తున్న ఆయుష్షు కాలము ఎంతవరకు నమ్మకంగా వెచ్చిస్తున్నాము! మనకు ఇచ్చిన సంతానము ఎంతవరకు ఆయనకు దగ్గరగా చెరుస్తూ వారి విషయంలో నమ్మకంగా ఉన్నాము? ప్రతి ఆత్మీయ వరమును ఎంతవరకు అయన నామ ఘనార్థమై వాడుతూ నమ్మకంగా ఉన్నాము. మనకు అయన ఇచ్చిన ఆరోగ్యము ఎంతవరకు నమ్మకంగా అయన కోసం వాడాలని తపన పడుతున్నాము? విశ్వాసం చూపి రక్షణ పొందుకోవటం అనేది ప్రాథమికమయిన విషయము, దాన్ని దాటి ప్రతి విషయంలో నమ్మకముగా జీవించే ప్రయత్నం చేయాలి. 

మత్తయి సువార్త 25: "21. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను."

ఈ వచనము యేసు క్రీస్తు చెప్పిన పరదేశం వెళ్ళే యజమాని మరియు తలాంతులు పొందిన ముగ్గురు దాసుల ఉపమానంలో చెప్పబడిన సందర్భము. ఇక్కడ మొదటి దాసుడు అయిదు తలాంతులు పొంది మరో అయిదు తలాంతులు సంపాదించెను! మరియు రెండవ వాడు రెండు తలాంతులు పొంది మరో రెండు తలాంతులు సంపాదించెను! అయితే మూడవ వాడు శ్రమించే తత్వం లేక, తన ఇష్టానికి సమయం గడిపి, ఎటువంటి  నమ్మకత్వము చూపకుండా, తానూ పొందిన ఒక్క తలాంతును భూమిలో పాతి పెట్టెను. 

తిరిగి వచ్చిన యజమాని మొదటి దాసుడు సంపాదించిన తలాంతులను బట్టి మెచ్చుకొని "భళా నమ్మకమైన దాసుడా! కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక, నీవు సంపాదించిన తలాంతులు నీవే ఉంచుకొనుము, నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా నియమించెదను" అని చెప్పెను. అదే విధంగా రెండవ దాసునితో కూడా చెప్పేను. మూడవ దాసుణ్ణి అడుగగా వాడు, "నీవు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చు కఠినుడవని ఎరిగి, భయపడి భూమిలో పాతి పెట్టితిని" అనెను. అందుకు యజమాని ఆగ్రహించి "సోమరి అయినా చెడ్డ దాసుడా, నేను కఠినుడనా? నువ్వు నమ్మినట్లే నీకు అవును గాక" అని వాడిని శిక్షించి, పది తలాంతులు ఉన్న మొదటి వాడికి ఆ ఒక్క తలాంతును కూడా ఇచ్చెను. 

మరి మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము? మొదటి ఇద్దరు దాసులా మాదిరి దేవునికి నమ్మకముగా ఉన్నామా? అయన ఇచ్చిన ప్రతి దీవెనను బట్టి మనం లెక్క అప్పగించాలి అని ఎరిగి ప్రవర్తిస్తున్నామా? కొంచెములో నమ్మకముగా ఉంటేనే దేవుడు మరి కొన్ని ఆశీర్వాదాలు, భాద్యతలు మనకు అప్పగిస్తాడు. ఉదాహరణకు ఒక ఆత్మీయ వరము పొందిన విశ్వాసి నమ్మకముగా, దేవుని నామ ఘనతార్థమై వాడితే, మరొక ఆత్మీయ  వరమును దేవుడు ఆ విశ్వాసికి  అనుగ్రహిస్తాడు. అదే విధంగా, పాతిక వేయిలు సంపాదించే ఉద్యోగం మనకు ఉండి, దాన్ని నమ్మకంగా, అయన చిత్తాను సారముగా ఖర్చు చేస్తే, నలుపది వేయిలు సంపాదించే ఉద్యోగం ఇస్తాడు. 

కానీ మూడవ దాసుని మాదిరి, సోమరిగా ఉంటూ, దేవుడు ఇచ్చిన తలాంతులను పాతి పెట్టటమో లేదా దేవుడు అప్పగించిన భాద్యతలను నెరవేర్చకుండా సమయం వృధా చేస్తూ ఇచ్చిన కొంచెములో నమ్మకత్వం చూపించలేని వారిగా ఉన్నామా? ఆశీర్వాదాలు కలగటం లేదు అని బాధపడే విశ్వాసి, నీకు ఉన్న ఆశీర్వాదాలను ఏలా నమ్మకముగా నిర్వహిస్తున్నావు? 

దేవుడు మనకు ఇచ్చిన రక్షణ కూడా అయన నుండి మనం పొందిన గొప్ప ఆశీర్వాదమే. దానిని ఏ విధముగా నమ్మకముగా నిలుపుకుంటున్నాము అనేది ప్రాముఖ్యతను కలిగి ఉంది. సంఘము అనే వధువు కోసం క్రీస్తు పెండ్లి కుమారునిగా వస్తాడని ఇదివరకు మనం తెలుసుకున్నాము కదా! విశ్వాసులందరు కూడా పెండ్లి కూమార్తెలుగా పరిగణింపబడుతారు. క్రీస్తు చెప్పిన బుద్ధిగల కన్యలు, మరియు బుద్ధిలేని కన్యల ఉపమానము మనకు ఏమి నేర్పుతుంది? బుద్ది గల కన్యలు తమ దీపాలలో తగినంత నూనె ఉండేలా చూసుకున్నారు. కానీ బుద్ధిలేని కన్యలు మధ్యలో నిద్రపోయి, తమ దీపాలలో తగినంత నూనె ఉండేలా చూసుకోలేక పోయారు. కనుక పెండ్లి కుమారుడి చేత "మీరెవరో నేను ఎరుగను" అని తృణీకరింపబడ్డారు (మత్తయి 25:1-12)

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! ఇక్కడ దీపాలలో నూనె పవిత్రతకు, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. మనకు దేవుడు ఇచ్చిన ఉచితమయిన ఆశీర్వాదం రక్షణ. మొదట అందరం బాగానే ప్రారంభం అవుతాము, కాలం గడుస్తున్న కొలది నిర్లక్యం చోటు చేసుకుంటుంది. దేవుడు ఇచ్చిన రక్షణ, ఆశీర్వాదాలు, దీవెనలు విలువ లేనివిగా లేదా అతి సాధారమయినవిగా మారిపోతాయి. అటువంటి స్థితిలో మనము ఉన్నామా? ఇప్పటికి ఆలస్యం జరుగలేదు! కొంచెములో నమ్మకముగా ఉందాము. దేవుడు ఇచ్చిన ప్రతి దీవెన, బాధ్యత మరియు  రక్షణ ఎంతో విలువయినవిగా పరిగణించి, మన పట్ల అయన చిత్తమును నెరవేరుద్దాము! రేపు అయన లెక్క అడిగితె సమాధానం చెప్పలి కదా!

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి