పేజీలు

5, ఆగస్టు 2022, శుక్రవారం

దైవ సేవకులను దూషిస్తున్నావా?

దేవుడు ఒకనాడు అనగా క్రీస్తు రాకడకు ముందు కొంతమంది ప్రవక్తలను ఏర్పరచుకొని తన ప్రజలయిన ఇశ్రాయేలు జనముతో మాట్లాడి, వారు తన మార్గములో నడవటానికి, మరియు తన చిత్తమును నెరవేర్చటానికి ప్రవక్తలకు  తన యొక్క ప్రవచనములు బయలు పరచేవాడు. అదే విధముగా నేడు కూడా కొంతమంది దైవ సేవకులను తన సేవకు పిలుచుకొని వారికి తన పరిశుద్దాత్మ ద్వారా జ్ఞానమును అనుగ్రహిస్తూ, విశ్వాసులను దేవునిలో బలపరచటానికి వాడుకుంటున్నాడు. వీరిలో కొందరు తమ తమ సంఘముల నేపథ్యమును బట్టి కొన్ని మతపరమయిన సిద్దాంతాలు పాటిస్తూ ఉంటారు. వీరు క్రీస్తూనే నమ్ముతుంటారు, కానీ కొన్ని ఉపదేశాలు విశేషముగా విశ్వాసులకు బోధిస్తూ ఉంటారు. 

ఇవ్వని కూడా  దేవుని వాక్యమును అర్థం చేసుకొనే విధానము వలన కలిగే సిద్దంతాలు లేదా ఉపదేశాలు. క్రీస్తును రక్షకునిగా, దేవునిగా అంగీకరించని బోధను వ్యతిరేకించమని దేవుని వాక్యం సెలవిస్తోంది (2 యోహాను 1:10) కానీ సిద్ధాంతా పరమయిన అవగాహన లోపాలను  ప్రేమ పూర్వకంగా హెచ్చరించాలి, వాక్యము చేత ఖండించాలి. పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో చెప్పినట్లుగా, వివాదాలకు, వ్యర్థమయిన వాదనలకు వెళ్ళి, మన హృదయములలో  గర్వమునకు చోటిచ్చి, దేవుడు మనకు ఇచ్చిన భక్తిని తప్పి పోరాదు. కొంతమంది దైవ సేవకులు దేవుని పిలుపు లేకపోయినా కూడ, కేవలం ప్రజలను ఆకర్షించి పేరు ప్రఖ్యాతులు పొందటానికి  మరియు ధనం సంపాదించటానికి సంఘములు నడుపుతుంటారు. 

వీరిని బట్టి సంఘమును హెచ్చరించటం చేయాలి, మరియు ఆ సంఘములో విశ్వాసులకు అర్థం అయ్యే రీతిగా అతని తప్పుడు బోధలను వాక్యముతో ఖండించాలి. ఆ దైవ సేవకుడు చేసేది వాక్యాను సారమయిన బోధ కాదని తెలిసి కూడా, అతణ్ణి అనుసరిస్తు అతని బోధలు పాటిస్తే కనుక, ఆ విశ్వాసులను, వారి ఆత్మీయ స్థితిని దేవుని చిత్తమునకు వదిలేయాలి. మానవ శక్తితో, జ్ఞానముతో ఏ ఒక్కరిని కూడా మనం మార్చలేము, ప్రభువులోకి నడిపించలేము. కేవలము, ప్రభువు సువార్తను మాత్రమే మనం ప్రకటించగలము. తప్పుడు బోధలు చేసే వారిని మరియు వారి పక్షమున నిలిచే వారిని,  దేవుని తీర్పుకు వదిలి వేసినట్లుగా రాశారు పౌలు గారు (2 తిమోతికి 4:14-16)

మనలో కొంతమంది అదేపనిగా దైవ సేవకులను విమర్శించటం చేస్తుంటారు. వారికి ఉన్న విలాసవంతమయిన సౌకర్యలను బట్టి వారిని దూషిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, వారికి ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు వారిని తప్పకుండా లెక్క అడుగుతాడు. ఆ పనిని మనం చేసి దేవుని తీర్పుకు లోనుకావద్దు. ఇటువంటి సేవకులు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రజలు ఇచ్చిన ధనం వాడుకుంటున్నారు అని నిలదీయటం విశ్వాసులయిన మనకు తగదు. సర్వము దేవుని అధీనములో ఉంది, అయన చిత్తము ప్రతి వ్యక్తి విషయంలో, సంఘము విషయంలో నెరవేరుతుంది.  అమాయకులయిన విశ్వాసులకు అవగాహన పెంచే ప్రయత్నం చేయండి, కానీ ఆ దైవ సేవకులను దుయ్యపట్టి మన ఆత్మీయతకు చేటు చేసుకోవద్దు. 

సంఖ్యాకాండము 16: "3. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా"

ఆనాడు దైవ సేవకుడయినా మోషేను, అహరోనులను దూషిస్తూ కోరహు "మీరు మాత్రమే ఎందుకు ఇంతటి ఘనత పొందుతున్నారు. ఇక్కడ అందరు పరిశుద్ధులే, మేము కూడా అటువంటి ఘనతకు అర్హులమే" అని వారికి వ్యతిరేకంగా సమాజమును రెచ్చగొట్టారు. అంటువంటి  వారి విషయంలో దేవుని తీర్పు ఎలా నెరవేరింది? భూమి చీల్చబడి వారిని సజీవంగా మింగి వేసింది. ఇప్పటి దైవ సేవకులు మోషే వంటి వారు కాకపోవచ్చు గాక! కానీ ఆ దేవుడు ఒక్కడే, అయన తీర్పులు ఎప్పుడు ఒక్కలాగే ఉంటాయి. ఆ దైవసేవకులను, వారిని గుడ్డిగా అనుసరిస్తున్న విశ్వాసులను బట్టి  భారంతో ప్రార్థించండి. వారిని దేవుడే మారుస్తాడు లేదా ఆ విశ్వాసులను కాపాడుకుంటాడు. అంతే కానీ కోరహు వలె నోరు జారి దేవుని తీర్పుకు గురి కావద్దు. 

కొందరు దైవ సేవకులు డబ్బు మీద వ్యామోహంతో అదేపనిగా కానుకలు ఇవ్వాలని సంఘమును ప్రేరేపిస్తూ ఉంటారు! తమ సొంత ఘనత కోసం సంఘమును వాడుకుంటూ ఉంటారు. మరి అటువంటి వారి సేవను కూడా దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. ఎందుకిలా జరుగుతుంది? దేవుడు ఎందుకు వీరిని కూడా వాడుకుంటున్నాడు, అని చాలామంది భాధ పడుతూ ఉంటారు. ఆనాడు ఇశ్రాయేలీయులు నీటి కోసం వాదించినప్పుడు మోషే ఆయాస పడి, "ఇప్పుడు మీ కోసం మేము ఈ రాతి నుండి నీటిని తెప్పించాలా?" అని ఆవేశంగా అరచి, దేవుడు రాతితో మాట్లాడమంటే దాన్ని కొట్టి తప్పు చేశాడు. అయినప్పటికి దేవుడు రాతి నుండి నీటిని రప్పించటం ఆపలేదు. ఇక్కడ మోషే తప్పు కన్న కూడా, ప్రజల దాహం తీర్చటం దేవుని ప్రేమలో ప్రాముఖ్యమయినది. 

ఇటువంటి దైవ సేవకులు ఎన్ని వందల తప్పులు చేసిన తన ప్రజలను కాపాడు కోవటం, వారిని రక్షించుకోవటం దేవుని అనంత ప్రేమలో ప్రాముఖ్యం కలిగి ఉన్న విషయం. అందుకనే ఇటువంటి దైవ సేవకులను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఆనాడు డబ్బుకై ఆశపడిన బిలామును సైతం, ఇశ్రాయేలు ప్రజలను దీవించటానికి దేవుడు వాడుకున్నాడు కదా? వీరు కూడా అటువంటి వారేనని, దేవుని తీర్పుకు వారిని వదిలేయటమే మన ఆత్మీయతకు శ్రేయస్కరము. లేదంటే మోషేను దూషించిన మిరియాము కుష్ఠును పొందుకున్నట్లుగా, ఆత్మీయంగా మనం కూడా స్పర్శను కోల్పోయిన, అనగా పాపం విషయంలో సున్నితత్వము కోల్పోయిన వారి వలే మారిపోతాము. 

1 తిమోతికి 6: "2. విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము."

ప్రియమయిన సహోదరి, సహోదరులారా! ప్రభువు సేవ కోసం, తమ జీవితాలను అర్పిస్తూ, గొప్ప సాక్ష్యం కలిగి ఉన్న దైవ సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా, ప్రభువు పేరిట మిమల్ని హెచ్చరిస్తున్నాము. ప్రభువు వారికి నిత్యము తోడుగా ఉండి నడిపిస్తుంటాడు. వారు మీతో ప్రేమగా, ఓర్పుగా ఉంటున్నారు కదా అని వారికి మీ  వంటి భావోద్వేగాలు ఉండవని తలంచకండి. వారిని మరింతగా గౌరవిస్తూ, మరి ఎక్కువగా ప్రేమించండి. సాక్ష్యం చూడకుండా, వారు బోధించే విషయాలను వాక్యంతో పరిశీలించకుండా, ఎవరిని పడితే వారిని నెత్తిన పెట్టుకొమ్మని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. కానీ నిజమయిన ప్రభువు సేవకులను ఆదరించండి, అది ప్రభువు ఎన్నటికీ మరచిపోకుండా మీకు ప్రతిఫలం దయచేస్తాడు. "తన శిష్యులయిన వారికి, ఎండా దినము చల్లని మంచి నీటిని ఇచ్చిన వారికి కూడా నేను ప్రతిఫలం ఇస్తానని" యేసయ్య చెప్పాడు కదా (మత్తయి 10:42)

కానీ ఆ దైవ సేవకులు మనం కోరుకున్నది చెయ్యలేదనో, లేక ఎదో విషయంలో ప్రాముఖ్యం ఇవ్వలేదనో, వారిని అవమానించటం, చులకనగా చూడటం చేయకండి. మిమల్ని వారు  అవమానిస్తే అది దేవుడు చూసుకుంటాడు, మీకు  రావలసిన ప్రాముఖ్యత ఆయనే ఇస్తాడు. ప్రతికారము యెహోవాదే కానీ మనది కాదు, దాన్ని మనం తీర్చుకుంటే దేవుడు మన మీద తీర్చుకుంటాడు. ఎలీషాను అవమానించిన యువకుల గతి ఏమైంది? అడవి నుండి రెండు ఏలుగు బంట్లు వచ్చి నలభై రెండు మందిని చీల్చి వేశాయి (2 రాజులు 2:24). మనకు ఇప్పుడు కృప ఉంది కదా అని, గర్వపడుతూ, ఇష్టానికి ప్రవర్తిస్తూ దేవుని కృపకు దూరం కావద్దు. దైవ సేవకులను గౌరవించండి, కానీ ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువుకు మాత్రమే అర్పించండి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి