పేజీలు

12, ఆగస్టు 2022, శుక్రవారం

దేవుడు ఇచ్చే శిక్షణ!

దేవుడు మనకు తండ్రిగా తల్లిగా ఉండి మనలను నిత్యము తన ప్రేమ చొప్పున కాపాడుతూ ఉంటాడు. ఎందుకు పనికి రాని వారమయిన మనలను, ఏ అర్హత లేని మనలను ఎన్నుకొని తన కృపల చొప్పున నిత్యము మన అవసరాలు, అక్కరలు తీరుస్తుంటాడు. "సృష్టి కారకుడయినా పరలోకపు తండ్రి మనలను నిత్యము పోషిస్తాడు, మరియు మనకు ఎంతో శ్రేష్ఠమయిన ఈవులను ఇవ్వాలని ఆశపడుతున్నాడు" అని దేవుని వాక్యం సెలవిస్తోంది (మత్తయి 7:11). "అడుగుడి మీకు ఇవ్వబడును, వేతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తియ్యబడును" అని యేసయ్య చేసిన బోధను బట్టి (మత్తయి 7:7) విశ్వాసులయిన మనము ఎంతో గొప్ప విశ్వాసం చూపుతూ ప్రార్థిస్తాము. ఎందుకంటే, తండ్రి అయినా దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడటం అత్యంత సహజం. 

అయితే మనం ఎంత గొప్ప విశ్వాసంతో ప్రార్థించిన కూడా, దేవుని చిత్తమును బట్టే మనకు అయన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. మనకు ఆశీర్వాదాలు ఇవ్వటం దేవునికి ఇష్టం ఉండదా? దేవుడు మన భవిష్యత్తును పూర్తిగా ఎరిగి ఉన్నాడు, ఫలానా ఆశీర్వాదం పొందుకుంటే మన ప్రవర్తన ఎలా ఉండబోతోంది, అదీ పొందుకోవటం ద్వారా మనం ఆయనకు దూరంగా వెళ్ళిపోతామా? దానివలన దీర్ఘకాలికంగా మనకు ఏదయినా కీడు జరుగబోతోందా? మొదలగు విషయాలన్నీ దేవుడు పరిగణలోకి తీసుకోని మనకు ఆశీర్వాదాలు దయచేస్తాడు. మనలను అయన ఏర్పరచుకున్న ఉద్దేశ్యాలకు, మన ఆత్మీయ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కొద్దీ కాలం మనలను  కష్టకాలం నుండి నడిపిస్తాడు. తద్వారా మనకు అవసరమయిన జీవిత పాఠాలు నేర్పిస్తాడు. 

ఆనాడు దావీదు గొఱ్ఱెల కాపరిగా ఉన్నప్పుడు, కాబోయే రాజయిన తనకు దేవుడు యుద్ధ విద్యలు ఎలా నేర్పించాడు? (1 సమూయేలు 17:34-37) గొల్యాతును చంపబోయే ముందు తనకు ఒక అవకాశం ఇమ్మని రాజయిన సౌలును అడుగుతూ దావీదు, "తన మీద అనుమానపడనవసరం లేదని, గొఱ్ఱెలను కాపాడటానికి తానూ ఎలుగుబంటి, సింహము వంటి బలమయిన జంతువులతో తలపడి, వాటిని చంపి తన గొఱ్ఱెలను కాపాడినట్లు" చెప్పాడు కదా? ఆనాడు దావీదు ఇటువంటి క్రూర జంతువులను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు, నేను ఎంతో విశ్వాసంతో ప్రార్థించాను కదా? అనుకుంటే, కేవలం గొఱ్ఱెల కాపరిగానే మిగిలిపోయి ఉండేవాడు. దేవుని చిత్తమును అంగీకరించాడు కాబట్టే, దైర్యముగా "యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నేను బ్రతుకు దినములన్ని కృప క్షేమములు నా వెంట వచ్చును" అని కీర్తన రాశాడు. 

దేవుడు మనలను గొప్ప ఉద్దేశ్యాలకు సిద్దపరుస్తున్నాడు అని సంపూర్ణంగా విశ్వసించాలి. కనుకనే మన జీవితంలో మనకు నచ్చని పరిస్థితులను అనుమతిస్తున్నాడు. మాములు గొఱ్ఱెల కాపరి, సింహమును జయించటం సాధ్యపడుతుందా? దాని అరుపు వినగానే భయపడి పారిపోవటం ఖాయం. కానీ దావీదుకు అంతటి ధైర్యం, బలం ఎలా వచ్చాయి. దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. నేడు నీకు కూడా తండ్రి హస్తం తోడుగా ఉండి, నిత్యమూ నిన్ను నడిపిస్తూ ఉంది, పరిశుద్ధాత్మతో అయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకు పిరికిగల ఆత్మను ఇవ్వలేదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది (2 తిమోతికి 1:7) . పరీక్ష కఠినంగా ఉంది అని రాయకుండా పారిపోతే పై తరగతికి వెళుతామా? దేవుడే ఆ పరీక్షను నీతో రాయిస్తున్నాడు, కేవలం అయన మీద ఆధారపడి, నీ చిత్తము నెరవేర్చు తండ్రి అనుకంటే, ఆయనే నిన్ను గెలిపిస్తాడు. 

కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసమును కూడా పరిక్షిస్తాడు, ఆయన మీద మన ప్రేమ నిజమయినదా? మనం ఆత్మీయంగా ఎటువంటి స్థితిలో ఉన్నాము అని మనకు బయలు పరుస్తాడు. అంత సక్రమంగా సాగిపోతుంటే, నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఎంతో విశ్వాసంతో ఉన్నాము, మనకు చాల భక్తి, దేవుడంటే విపరీతమయిన ప్రేమ అనుకుంటాము. కానీ కష్ట కాలంలో అసలు రంగు బయటపడుతుంది. తద్వారా మనలను మనం సరి చేసుకొని, విశ్వాసంలో నూతన పరచబడుతాము. కలిగే కష్టాల ద్వారా, మనలో ఉన్న ఆత్మీయ గర్వము, సొంత శక్తి మీద ఆధారపడే తత్వము తగ్గిపోతాయి. దేవుడు దావీదును ఎంతగా కష్టాల గుండా నడిపిన కూడా, ఎక్కడ కూడా ఆయాసపడలేదు, దేవుని మీద ఆధారపడి మాత్రమే జీవించాడు. సులభంగా రాజయిన సౌలు మాత్రం, గర్వపడి దేవుని మాటలను కూడా ధిక్కరించాడు. కనుకనే దేవుని కృపను కోల్పోయాడు. 

సులభముగా దొరికే దానికి విలువ తక్కువ, లేదా అది మనలను గర్వపడేలా చేస్తుంది. కనుకనే దేవుడు మనకు తగ్గింపును నేర్పటానికి, కొన్ని మనకు త్వరగా అందించాడు. అయన శక్తిని, మహిమను మనం పూర్తిగా గుర్తిస్తాము అనుకున్న సమయం దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. అనాడు ఇశ్రాయేలీయులు, సముద్రం దాటి తమను విడిపించింది, తాము తయారు చేసిన ఒక దూడ ప్రతిమ అని పూజించారు. కొద్దిపాటి దాహానికి, ఆకలికి దేవుని మీద సణుగుకొని దేవుని ఆగ్రహానికి లోనయ్యారు. తమ ముందు ఉన్న కష్టాలను, అనగా బలవంతులయిన కాననీయులను  చూసి అవిశ్వాసముగా మాట్లాడి దేవుని కృపను కోల్పోయారు. మన ముందు ఉన్న కష్టాలను బట్టి అధైర్యపడుతూ విశ్వాసం కోల్పోవటం దేవునికి ఇష్టం లేని ప్రవర్తన. 

ద్వితీయోపదేశకాండము 8: "3. ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను."

పై వచనములో ఇశ్రాయేలు వారితో మోషే ఎం అంటున్నాడు చూడండి. ఆహారము వలన గాక దేవుని మాట ద్వారా నరులు బ్రదుకుదురు అని వారికి తెలియటానికి దేవుడు వారిని ఆకలికి అప్పగించాడు. తర్వాత మన్నాతో పోషించాడు. మన జీవితంలో కూడా, ఏది ముఖ్యమయినది అనుకుంటున్నామో, అది లేకుండా కూడా దేవుడు మన జీవితం సాఫీగా సాగిపోయేలా చేయగల సమర్థుడిగా ఉన్నాడు. తద్వారా మన విశ్వాసమును బలపరుస్తూ, గొప్ప సాక్ష్యం మనకు దయచేసి ఇతరులకు మనలను దీవెనకరంగా మార్చబోతున్నాడు. నలుపది సంవత్సరాలు అరణ్యంలో నడిచిన కూడా ఇశ్రాయేలీయుల బట్ట చిరిగి పోలేదు, వారి కాలి చెప్పులు అరిగిపోలేదు, వారి కాళ్ళు కూడా వాయలేదు. ఇది ఎలా సాధ్యం అయింది? 

సామెతలు 3: "11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. 12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! నీ జీవితంలో ఎదో లేదని వెలితిగా ఉన్నావా? దేవుడు నీ జీవితంలో సమృద్ధిని ఇవ్వటం లేదని సణుగుతున్నావా? ప్రతిది ఆయనకు సాధ్యమే. కానీ దేవుడు నీకు విశ్వాసము నేర్పిస్తున్నాడు. అయన మీద ఆధారపడి జీవించటం నేర్పిస్తున్నాడు. నువ్వు, నీ జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉండులాగున  నీకు శిక్షణ ఇస్తున్నాడు. నీ రక్షణ ప్రయాణంలో పై తరగతికి నిన్ను చేర్చాలని ఆశపడుతున్నాడు. అయన నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయనకు మరింత దగ్గరగా ఉండాలని, నిన్ను ఆయనకు దూరం చేసే వాటిని నీకు దూరంగా ఉంచుతున్నాడు. అలాగని నిన్ను ఇతరుల ముందు చేయి చాపనివ్వడు, రోషం కలిగిన దేవుడు, తన బిడ్డలను పోషించకుండా వదిలి పెట్టాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసు కుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి