ఇదివరకు దేవుడు మన జీవితాలలో కష్టాలూ అనుమతించి, మనలను విశ్వాసములో ఎదిగిస్తాడు అని తెలుసుకున్నాము కదా! అయితే కొన్ని సార్లు పరిస్థితులను మాత్రమే కాకుండా, మన చుట్టూ ఉన్న జనులను మనకు వ్యతిరేకముగా లేపి, వారిని మనకు ఇబ్బందులు కలిగించే లాగున అనుమతిస్తాడు. వారు అవిశ్వాసులు అయినా వారు కూడా కావచ్చు. ఆ విధమయిన భక్తి హినులను దేవుడు ఎందుకని మన మీద ఆధిపత్యం చేసేవారిగా నిలబెడుతున్నాడు లేదా మన కన్న ఎక్కువ అశీర్వదిస్తున్నాడు అని మనలో చాల మంది విశ్వాసులు భాధపడుతుంటారు. చాల సార్లు ఆ ఆశీర్వాదాలు, ధనముకు సంబంధించినవిగా, మరియు లోకములో ఘనతను పొందుకొనేవిగా ఉంటాయి. వీటిని పొందుకోవటం ద్వారా జనులు దేవుని ఉనికిని ప్రశ్నిస్తూ, సాతాను చేతిలో చిక్కుకొని నాశనమునకు దగ్గరవుతున్నారు.
ఆనాడు సాతాను యేసయ్యను, నాకు నమస్కారం చేసి నన్ను ఆరాదించు నీకు లోకములో అన్ని ఘనతలు ఇస్తాను అని ఆశ పెట్టాడు కదా? ధనము, ఘనత అన్ని కూడా సాతాను అధీనములో ఉన్నాయి. కనుకనే, వాటిని వాడు భక్తి హీనులకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు నిత్యమూ గర్వపడుతూ, జీవము కలిగిన దేవునికి దూరముగా ఉండులాగున ఏర్పాటు చేస్తున్నాడు సాతాను. అటువంటి వారిని బట్టి ఆయాసపడుతూ, సమయానుకూలముగా నీకు సహాయం చేస్తున్న దేవుణ్ణి అవమానించటం ఎంతవరకు సమంజసం? అయ్యో వారి వలె నాకు అది లేదు ఇది లేదు అనుకోవటం, మన దేవునికి అవమానం కదా? మన పిల్లలు ఇతర పిల్లలను చూసి, వారికి అది ఉంది ఇది ఉంది అని మన మీద విసుగుకుంటే ఎంత బాధపడుతాము?
కానీ దేవుడు మనకు ఇచ్చిన ఎంతో ఉన్నతమయిన విశ్వాసము తద్వారా మనకు ఇచ్చిన రక్షణ, నిరీక్షణను గుర్తించకకుండా ఆ భక్తి హీనులను బట్టి బాధపడటం మనకు తగిన ప్రవర్తనేనా? చాల సార్లు దేవుడు మనలను భక్తి హీనులకు అప్పగించి, మన ద్వారా తనకు మహిమను, ఘనతను తెచ్చుకుంటాడు. అయన మహిమను చాటించె పాత్రగా ఉండుట కన్న శ్రేష్ఠమయినదా? ఆ పెద్ద కారులో ప్రయాణించటం? అయన సన్నిధిని నిత్యం అనుభవించటం కన్న ఉన్నతమయినదా! ఆ ఖరీదయిన బంగ్లాలో జీవితం? ప్రతి పూట, ప్రతి అవసరం అయన నుండి, ఆయన చిత్తముగా పొందుకోవటం కన్న ధన్యత! విచ్చలవిడిగా ధనం ఖర్చు చేయటం? షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోల ఉద్ధంతం గుర్తుందా? దేవుడు భక్తి హీనుడయినా రాజు నెబుకద్నెజరుకు వారిని ఎందుకు అప్పగించాడు? దేవుడు తలచుకుంటే వారిని ఎలాగయినా తప్పించవచ్చు కదా?
అటువంటి స్థితిలో వారిని ఉండకుండా చేయవచ్చు కదా! అని వారు అనుకోలేదు. ధైర్యముగా దేవుని కోసం నిలబడ్డారు. కనుకనే దేవుడు వారిని కాపాడుకున్నాడు, తద్వారా వారి దేవుడే నిజమయిన దేవుడు అని ఆ భక్తి హీనుడయినా రాజు చేత ప్రకటింపబడి, కీర్తించబడ్డాడు (దానియేలు 3: 20-30). మరియు షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోలను బబులోను సామ్రాజ్యంలో హెచ్చించేలా చేశాడు దేవుడు. ఇటువంటి అదృష్టం మనకు వస్తే కాదని, పారిపోతామా? ఎప్పుడు ఎవరు మనలను కొడుతారా? ఏ ఆపదలో పడిపోవాలా? అని ఎదురు చూడమని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు, కానీ దేవుని మహిమను చాటించటానికి అవకాశం ఉంటే, కాస్త కష్టానికి ఓర్చుకోలేమా? మనలను బాధించే వారికి క్రీస్తు ప్రేమను చూపుట ద్వారా, వారిని సిగ్గుపడేలాగా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తోంది (1 పేతురు 3:16). తద్వారా వారు క్రీస్తు క్షమా గుణం మన ద్వారా రుచి చూచి దేవుని చిత్తములో ఉంటె రక్షణ పొందుకొనే అవకాశం ఉంది కదా!
అయితే కొన్ని సార్లు దేవుడు తన మార్గంలో మనలను నడపటానికి భక్తి హీనులకు మనలను అప్పగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను బబులోను వారికి ఎందుకు అప్పగించాడు? ఎందరో ప్రవక్తలు వారి విగ్రహరాధనను ఖండిస్తున్న కూడా లెక్క చేయలేదు. యిర్మియా ప్రవక్త ద్వారా ఎంతగా హెచ్చరించిన కూడా వారు అబద్ద ప్రవక్తలను నమ్మి దేవుని మాటలు పెడచెవిన పెట్టారు. కనుకనే దేవుడు బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వారిని నడిపించాడు. అక్కడ దానియేలు మరియు పైన చెప్పుకున్న షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోలను లేపి వారి ద్వారా తన మీద విశ్వాసము పెంపొందేలా చేసుకున్నాడు. తద్వారా తరువాతి తరము వారు, విగ్రహారాధనను పూర్తిగా మర్చిపోయేలా చేసాడు. మనలో ఉన్న అవలక్షణాలు పోవటానికి దేవుడు మనలను కూడా అటువంటి స్థితిలోకి నడిపిస్తాడు. అటువంటప్పుడు మనలను మనం మార్చుకుంటూ దేవునికి మరింతగా దగ్గర కావాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి