ఇదివరకు మనం చాల సార్లు దేవుడు మన జీవితాలలో శోధనలకు అనుమతినిచ్చి మనలను విశ్వాసములో బలపరుస్తాడు అని తెలుసుకున్నాము కదా! అంతే కాకుండా మన పట్ల తన ఉద్దేశ్యాలు నెరవేర్చుకునేలా ఆ పరిస్థితులను ఉపయోగించుకొని మనలను అటు వైపుగా నడిపిస్తాడని కూడా తెలుసుకున్నాము! అయితే దేవుడు మన ఆత్మీయ స్థితిని ఎరిగి ఉన్నాడు, అందును బట్టి మనకు తగిన శోధనలు అనుమతిస్తాడు. అనగా శోధనలు అనేవి పరీక్ష పత్రాలు అనుకుంటే, దేవుడు విశ్వాసములో మన తరగతిని బట్టి ఆ పరీక్షను రాయటానికి మనకు అనుమతిస్తాడు. అంతే కాకుండా శోధనలు జయించటానికి మార్గమును కూడా అనుగ్రహిస్తాడు.
1 కొరింథీయులకు 10:"13. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింప బడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును."
ఈ వచనములో పౌలు గారు కొరింథీ సంఘమును ఏమని ఆదరిస్తున్నారు చూడండి. మనము సహింప లేని ఎటువంటి శోధనను దేవుడు మన మీద అనుమతించాడు, మరియు సహింపటానికి, దాని నుండి తప్పించుకోవటానికి మార్గమును కూడా కలుగ జేస్తాడు. అయితే మనము కలిగే శోధనలను బట్టి, దేవుడు మన మీద ప్రేమలేని వాడిగా, మన పాపములను బట్టి మనలను శిక్షిస్తున్నాడు అనుకుంటూ ఉంటాము. మన పాపములను బట్టి దేవుడు శిక్షిస్తూ పొతే, మనం ఒక క్షణం కూడా నెమ్మదయినా జీవితం గడపటానికి అర్హులం కాము.
దేవుడు ప్రేమలేని వాడయితే, మనకు విశ్వాసం ఇచ్చి, క్రీస్తు నీతిని మనకు ఆపాదించి, నిత్య జీవితానికి సిద్ధపరచే వాడు కాదు కదా! ఎన్ని సార్లు అయన ప్రేమ చొప్పున సాధ్యం కావు అనుకున్న పనులను సాధ్యపరచి, మన అవసరాలు తీర్చాడో మళ్ళి గుర్తు చేసుకుందామా? రెప్పపాటులో కలిగే ప్రాణాంతకమయిన ప్రమాదాలు ఏలా తప్పించి సజీవుల లెక్కలో ఉంచాడో మరచిపోకుండా ఉందామా? దేవుని సార్వభౌమాధికారాన్ని బట్టి మనలను ఎన్నుకొన్నాడు, మన చేత జరిగించవలసిన కార్యములను బట్టి మనలను ఈ పరిస్థితుల వెంబడి నడిపిస్తున్నాడు. అయన బిడ్డలము అయినా మన జీవితాలలో ప్రతి సంఘటన అయన చిత్తము లేకుండా జరగటం లేదు.
యోబు 1: "10. నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది."
ఈ వచనంలో సాతాను దేవునితో అంటున్న మాటలు వినండి! "యోబుకు దేవుడంటే అంతగా భయభక్తులు కలిగి ఉండటానికి కారణం, దేవుడు తన చుట్టూ, తన కుటుంబము చుట్టూ మరియు అతని సమస్త సంపద చుట్టూ కంచె వేసి రక్షిస్తున్నాడు, కనుకనే యోబు దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నాడు" అని అంటున్నాడు. మనం కూడా దేవుని దృష్టిలో యోబు వంటి వారమే, మన చుట్టూ కూడా దేవుడు తన కంచెను ఉంచి కాపాడుతున్నాడు. కానీ అది గ్రహించని మనము ఏదయినా ఇబ్బంది రాగానే, ఎక్కడయినా ఆస్తి నష్టం, ధన నష్టం కలుగగానే దేవుడు మనతో లేడు, లేదంటే దేవుడు మన మీద కోపంగా ఉన్నాడు అనుకుంటాము. తద్వారా దేవుని మీద విశ్వాసం కోల్పోయి అయన మన మీద అనుమతిస్తున్నా శోధనలు మనకు తగినవి కావని చెప్పుట ద్వారా దేవుడు మన మీద పెట్టుకున్న ఆశలను చిన్న బుచ్చుతున్నాము.
సాతాను మన మీదికి శోధనలు తేవటం ద్వారా మనలను విశ్వాసములో నశింప చేయాలనీ ప్రయత్నిస్తుంటాడు. కానీ దేవుడు సాతాను శక్తిని కూడా నియంత్రించే సర్వ శక్తిమంతుడు, కనుక మన మీద సాతాను ఎటువంటి శోధనను, ఎంత మోతాదులో ఇవ్వాలి అని సాతానుకు అనుమతిని ఇస్తున్నాడు (యోబు 1:12). తద్వారా మనలను ఆత్మీయతలో, విశ్వాసములో బలపరుస్తూ మనలను మరింతగా తనకు దగ్గర చేసుకుంటున్నాడు. ఈ సాతాను శోధనలు తాటాకు శబ్దము వంటివి మాత్రమే, ఇవ్వని దేవుని చిత్తములో లేకుండా జరగటం లేదు. ఏ తండ్రి అయినా బిడ్డలు నశించిపోయేలా కష్టపెడుతాడా? మన కోసం ఘోరమయిన సిలువ మరణం పొందిన, ఈ తండ్రి మీద నమ్మకం లేదా? నాకే ఎందుకు ఈ కష్టాలు అని చిన్నబుచ్చుకొని అలిగిపోతావా?
2 రాజులు 6: "17. యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను."
ప్రవక్త అయినా ఎలీషాను బందించాలని సిరియా రాజు సైన్యం పంపిన వేళ, ఎలీషా సేవకుడు భయపడుతుంటే, ఎలీషా అతనికి ధైర్యం చెప్పి, ఆ సేవకుని కండ్లు తెరవమని దేవునికి ప్రార్థించగానే, ఆ సేవకునికి అదృశ్యముగా ఉన్న పరలోక సైన్యము కనపడింది. నీ చుట్టు కూడా సమస్యలు తప్ప మరేమి కనపడటం లేదేమో! ఏ విధమయిన పరిష్కారం నీకు దొరకటం లేదేమో. కానీ దేవుని సైన్యం నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడుతోంది, అవిశ్వాసముతో నీకు కలిగే ఆందోళన, భయం నిజం కావు. మన కన్నా ముందే మన దేవుడు నడుస్తున్నాడు (ద్వితీయోపదేశకాండము 31:8) అన్న విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి.
ఇక్కడ ఎలీషా అదే విశ్వాసముతో ఉన్నాడు, కనుకనే ఎదురుగా ఎంత గొప్ప సైన్యం ఉన్న కూడా భయపడకుండా, ఆందోళన పడకుండా ఉన్నాడు. కానీ అతని సేవకుడు, కేవలం ఎదురుగా ఉన్న సైన్యమును మాత్రమే చూసి, అవిశ్వాసముతో భయపడ్డాడు. దేవుడు మనలను ఏర్పరచిన దినము నుండే మనలను కాపాడటానికి కొందరు రక్షకభటుల వంటి దేవ దూతలను మన చుట్టూ ఉంచుతున్నాడు (మత్తయి 18:10, హెబ్రీయులకు 1:14), అయన అనుమతి లేకుండా ప్రమాదము, నష్టము మనకు సంభవించదు. మనకు కనపడని సైన్యం మనలను నిత్యము కాపాడుతోంది, కాబట్టి అవిశ్వాసముతో విసుగుకొని దేవుణ్ణి చిన్నబుచ్చ వద్దు.
రోమీయులకు 8: "17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము. 18. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను."
దేవుని పిల్లలయిన మనలను దేవుడు తన కుమారుడయినా క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులను చేయుట ద్వారా తన మహిమకు వారసులుగా మారుస్తున్నాడు. ఈ శ్రమల ద్వారా మన పాప శరీరము యొక్క చిత్తమును, క్రియలను నశింపచేస్తున్నాడు. దేవుని మీద విశ్వాసమును పెంపొందించుట ద్వారా పరలోకములో మన స్వాస్థ్యమును పెంచుతూ, నిత్యత్వములో మనం నిలవటానికి అర్హులుగా రూపాంతరం చేస్తున్నాడు. ఇప్పుడు కలిగే ఈ శ్రమలు ఆ మహిమ ముందు, ఆ నిత్యత్వము ముందు ఎంత మాత్రము ఎన్నతగినవి కావు.
ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుని అనుమతిని బట్టి సాతాను చేత పీడించబడుతున్న యోబుతో అతని భార్య "ఇంకా ఎందుకు ఈ విశ్వాసము? దేవుణ్ణి దూషించి నువ్వు కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపో" అన్నప్పుడు యోబు ఏమన్నాడు? "మూర్ఖురాలిగా మాట్లాడకు, దేవుని నుండి మేలులు మాత్రమే పొందుకోవాలా? కీడు పొందుకోకూడదా?" అని చెప్పి దేవుణ్ణి ఎంత మాత్రము దూషించలేదు, పాపం చేయలేదు (యోబు 2:9-10). మన నుండి కూడా దేవుడు అటువంటి విశ్వాసమును, సాక్ష్యమును కోరుకుంటున్నాడు. ఆయనకు తెలియని మన కష్టాల? అయన మన మీద అనుమతించని పరిస్థితులా? నీ విశ్వాసం వదులుకొని, ఆ తండ్రిని చిన్నబుచ్చ వద్దు, నిత్యత్వము పరుగులో వెనుకపడి పోవద్దు.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి