విశ్వాసులు అయినా మనము చాల సార్లు మనకు ఉన్న అవసరాలను బట్టి, దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలు ఎత్తి పడుతూ ఆయనను ప్రార్థిస్తూ ఉంటాము. కానీ మనలో చాల మంది తాము ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న జ్ఞానమును బట్టి అవిశ్వాసములో పడిపోతూ ఉంటారు. ఎందుకంటే చాల సార్లు మనము దేవుడు నుండి ఆలస్యముగా సమాధానము పొందుకుంటాము. కానీ దేవుడు పాటించే సమయము, అయన ప్రణాళికలు అన్ని కూడా మనకు మేలు చేయటానికే తప్ప కీడు చేయటానికి కాదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది (యిర్మియా 29:11). అధె విధముగా మన తెలివిని బట్టి కాకుండా, మన పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకము ఉంచి, మన ప్రవర్తన అంతటి యందు అయన అధికారమును ఒప్పుకోవటం ద్వారా అయన మన త్రోవలు సరళం చేస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తోంది (సామెతలు 3:5-6).
వాగ్దానము ఇచ్చి మరచి పోనీ దేవుడు ఖఛ్చితముగా మనకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు బోధలో చెప్పినట్లుగా, పాపములము అయినా మనమే మన బిడ్డలకు ఎన్నో గొప్ప ఈవులు ఇవ్వాలని ఆశపడుతుంటే, నీతి మంతుడయినా పరలోకపు తండ్రి ఇంకా ఎన్నో గొప్ప దీవెనలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయన రొట్టె అడిగిన వారికి రాతిని, చేప అడిగిన వారికి పామును ఇవ్వని దయ కలిగిన తండ్రిగా ఉన్నాడు. కానీ ఈ సమృద్ధి చాల సార్లు మనలను గర్విష్టులుగా మారుస్తుంది. మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశ్యాలను మనం తప్పిపోయేలా చేస్తుంది.
దేవుని వాక్యంలో నుండి మనం ఇప్పుడు అటువంటి వారిని గురించి ఇప్పుడు ధ్యానించుకుందాము.
నిర్గమకాండము 11: "2. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము. 3. యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను."
ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం లో నుండి విడిపించే చివరి సమయంలో దేవుడు మోషే ద్వారా, ఐగుప్తీయుల నుండి వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకోవాలని చెపుతున్నాడు. ఐగుప్తీయులకు బానిసలయినా ఇశ్రాయేలు వారి మీద దేవుడు కరుణ కలిగించాడు. అంతే కాకుండా దేవుడు మోషే ద్వారా చేసిన అద్భుత కార్యములను బట్టి వారికి మోషే పట్ల కూడా ఎంతో గౌరవం ఏర్పడింది. బానిసలూ అయినా వారికి జీత భత్యాలు ఉండవు, పెట్టినది తినీ చెప్పిన పని చెయ్యటమే వారి పరిస్థితి. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సమృద్ధిగా దీవించి బయటకు తీసుకురావాలనుకున్నాడు. వారు అంతకాలం చేసిన వెట్టి చాకిరికి జీతం ఇప్పించాడు.
ఫరో ఒక్కసారి మోషేతో "మీ పశువులను ఇక్కడే ఉంచి మీ దేవుణ్ణి ఆరాదించటానికి వెళ్ళండి" అన్నప్పుడు, మోషే "మా దేవునికి మేము బలులు అర్పించాలి, ఎన్ని పశువులు అవసరం అవుతాయో మాకు తెలియదు, కనుక మా పశువులన్ని మాతో రావాల్సిందే" అంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు వారికి లభించిన బంగారం కూడా దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోకుండా, దేవుడు వారికి ఆ సమృద్ధిని ఎందుకు ఇచ్చాడో ఎదురు చూడకుండా, సమృద్ధి ఉంది కదా అని వారు చేసిన పని ఏమిటి? మోషే దేవుని ధర్మశాస్త్రం కోసం వెళ్ళి నలుపది దినాలు కొండ దిగి కిందికి రాలేదని, దేవునికి వ్యతిరేకంగా బంగారు దూడను చేసుకొని దాన్ని పూజించటం మొదలు పెట్టారు, దేవుని ఆగ్రహానికి గురయినారు.
2 దినవృత్తాంతములు 9: "13 . గంధవర్గములు అమ్ము వర్తకులును ఇతర వర్తకులును కొని వచ్చు బంగారముగాక సొలొమోనునకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగులయెత్తు."
దావీదు కుమారుడు అయినా సొలొమోను దేవుని చేత ఎంతో గొప్పగా దీవించబడ్డాడు. పై వచనం చూస్తే ప్రతి యేడు ఆయనకు కలిగే సంపద మనకు తెలుస్తుంది. అయన సంపద గురించి తెలియాలంటే తొమ్మిదవ అధ్యాయం పూర్తిగా చదువుమని కోరుకుంటున్నాను. అయితే సంపద కారణముగా సొలొమోను తన హృదయమునకు తోచిన ప్రతి కోరికను నెరవేర్చుకున్నాడు. ప్రసంగి గ్రంథంలో అయన రాసినట్లుగా, ఎన్నో అందమయిన భవనాలు, ఉద్యానవనాలు, ద్రాక్ష తోటలు నిర్మించుకున్నాడు. ఎందరో భార్యలను కలిగి ఉండి, నిత్యము కామాతురతతో బ్రతికాడు అని దేవుని వాక్యం చెపుతుంది.
1 రాజులు 11 : "6. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు."
ఈ వచనంలో సొలొమోను దేవునికి ఇష్టం లేని జీవితాన్ని కొనసాగించాడు అని తెలుస్తుంది. దేవుడు ఇచ్చిన సమృద్ధిని తన సొంత గొప్ప కోసం వాడుకొని, దేవునికి తన పట్ల ఉన్న ఉద్దేశ్యాలను పూర్తిగా కోల్పోయాడు. భర్యలను అనుసరించి అన్య దేవతలకు ఎన్నో గొప్ప బలి పీఠములు కట్టించాడు. దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించిన కూడా పేడ చెవిన పెట్టాడు. కేవలం దావీదు కు దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఆయనను రాజుగా కొనసాగించాడు.
ఎజ్రా 1: "6. మరియు వారి చుట్టు నున్న వారందరును స్వేచ్ఛగా అర్పించినవి గాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తు వులను ఇచ్చి వారికి సహాయము చేసిరి."
బబులోనుకు బానిసలుగా వెళ్లిన ఇశ్రాయేలు వారిని తిరిగి దేవుడు తన మందిర నిర్మాణానికి రప్పించాలనుకున్నప్పుడు, రాజయిన కోరెషు మనసును ప్రేరేపించినాడు. ఆ సందర్భంలో అక్కడ ఉన్న ఇతర ప్రజలకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు వెండి, బంగారం, పశువులను, మరియు ఎంతో విలువయిన వస్తువులను ఇవ్వటానికి దేవుడు ప్రేరేపించాడు. అధిక ధనవంతుడయినా సొలొమోను కట్టిన మందిరము వలే లేకపోయినప్పటికీ, బానిసలుగా బ్రతికి, ఏ సంపద లేకుండా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరమును కట్టటం సామాన్యమయిన విషయం కాదు. కానీ దేవుడు వారికి ఇచ్చిన సమృద్ధిని వారు దేవుని చిత్తమునకు ఉపయోగించారు. అందును బట్టి తిరిగి దేవునిలో బలపడ్డారు, తప్పిపోయిన ప్రజలను నిలబెట్టారు.
అపొస్తలుల కార్యములు 24: "26. తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను."
అపొస్తలుడయినా పౌలు ధనిక కుటుంబముకు చెందిన వాడని బైబిల్ లో స్పష్టంగా లేకపోయినప్పటికి, అయన పుట్టుకతోనే రోమా పౌరసత్వం కలిగి ఉన్నాడు. రోమీయుల చేత పాలించబడుతున్న యూదులకు రోమా పౌరసత్వం ఎలా దొరుకుతుంది? వారి కుటుంబం ఎంతో గొప్ప సంపద కలిగి ఉంటె తప్ప సాధ్యం కాదు. అంతే కాకుండా అత్యంత ఖరీదయిన రోమా పట్టణములో రెండు సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండటం అత్యంత పేదవారికి సాధ్యపడేది కాదు. కనుకనే పౌలు నుండి లంచం ఆశించి గవర్నరు అయినా ఫేలిక్సు తన పని వారిని అతనికి పరిచర్య చేయమని పంపేవాడు, మరియు తనను అదే పనిగా పిలిపించి మాట్లాడే వాడు. కానీ పౌలు తన కుటుంబం ద్వారా తనకు వచ్చిన ధనమును ఎంత మాత్రము, తన నిమిత్తము వాడుకోకుండా, అతను తనను పిలిపించిన ప్రతి సారి, క్రీస్తును గురించి సువార్తను తెలిపాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది.
ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుడు నీకు ఇప్పుడు సమృద్ధిని ఇవ్వలేదేమో! కానీ దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడు, ఖచ్చితముగా నీకు సమృద్ధిని ఇస్తాడు. కానీ ఆ సమృద్ధిని నువ్వు ఎలా వాడ బోతున్నావు? ఆ ధనము, ఆ సమృద్ధి నీకు యజమానిగా ఉండబోతోందా? ఒక వేళ దేవుడు నీకు సమృద్ధిని ఇప్పటికే ఇచ్చి ఉంటె, ఏ విధముగా ఆ సమృద్ధిని వాడుతున్నావు? నీ గొప్పల కోసం, డంబికముగా బ్రతకటానికి వాడుతున్నావా? దేవుని పరిచర్య నిమిత్తం, అయన చిత్తానుసారం వాడుతున్నావా? లాజరు, మరియు ధనికుని ఉపమానం గుర్తుందా? పేద వారీగా ఉండమని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. కానీ సమృద్ధిని బట్టి మీ ఆత్మీయ జీవితం నశించి పోకుండా చూసుకోండి. గర్వముకు లోనయి, సాతాను వలలో చిక్కుకోకండి, మీ పట్ల దేవుని ఉద్దేశ్యాలు తప్పిపోకండి.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి