పేజీలు

22, డిసెంబర్ 2022, గురువారం

సువార్త చెపుతున్నావా?


ప్రపంచం అంత జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్, అంటే యేసు క్రీస్తు పుట్టిన రోజు అని అందరి నమ్మకం. క్రైస్తవులు అంటే క్రీస్తును అనుసరించే వారు అని అర్థమని మనందరికి తెలుసు. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయం కూడా ప్రతి క్రైస్తవుడికి తెలుసు. పాపముల నుండి మనలను రక్షించటానికి దేవుని కుమారుడు అయినా యేసు క్రీస్తు భూమి మీద జన్మించాడు. ఈ సువార్తను పది మందికి తెలుపాలని క్రైస్తవులందరు ఎంతగానో ఆరాట పడుతుంటారు. క్రైస్తవులుగా పిలువబడుతున్న వీరు, క్రీస్తును నిజముగా అనుసరిస్తున్నారా? 

క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే చాలు, ప్రతి చర్చ్ లో ఎంతో హడావిడి మొదలవుతుంది. కారల్స్  తో  సువార్త,  మినీ క్రిస్మస్ తో సువార్త, పాటల ద్వారా సువార్త, క్రిస్మస్ ఉత్సవాలతో సువార్త. ఎందుకని  సువార్త చెపుతున్నాము? యేసయ్య చెప్పమన్నాడు కాబట్టి. కానీ అయన సువార్త ఒక్కటే చెప్పమన్నాడా? వారందరిని తన శిష్యులుగా మార్చమన్నాడు. యేసు క్రీస్తు దేవుడని అన్యులు సైతం నమ్ముతారు కదా. మరి వెళ్ళి వారికి సువార్త చెప్పినంత మాత్రాన మారిపోతారా? దేవుడు ఒక వ్యక్తిని మార్చాలనుకుంటే ఒక చిన్న కరపత్రిక చాలు. ఇంత హడావిడి అవసరం లేదు. 

యేసయ్యను అనుసరించమని అన్యులకు చెప్పే ముందు, నువ్వు ఆయనను అనుసరిస్తున్నావా? అయన శిష్యునిగా మారమని, నీ స్నేహితునికి చెప్పే ముందు, నువ్వు అయన శిష్యుడిగా ఉన్నావా? యేసయ్య తన శిష్యులను సువార్త చెప్పమని ఎప్పుడు పంపాడు? వారిని విశ్వాసములో బలపరచిన తర్వాత కదా! మరి మన విశ్వాసము కేవలం మాటలలోనే ఉందా లేక చేతలలో కూడా ఉందా? యేసయ్య శిష్యులుగా ఉండటం అంటే, అయన చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటించాలని. 

1 యోహాను 3: "22. ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింప వలెననునదియే."

యేసయ్య ప్రియా శిష్యుడయినా యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఈ వచనం ఏమి చెపుతుంది. యేసు క్రీస్తు మనకు ఇచ్చిన ఆజ్ఞ, ఒకరి నొకరు ప్రేమించాలని. మనం క్రీస్తు మనుష్యులం అని చెప్పుకుంటే సరిపోదు, మనలో పాపం లేకుండా చూసుకోవాలి. పాపం మనలో ఉంటే, మనకు ఆయనకు సంబంధం లేదని దేవుని వాక్యం చెపుతుంది (1 యోహాను 3:6). మనకు అన్ని సౌకర్యాలు ఉండి, మన పక్కవాడు, తిండికి కూడా కష్టపడుతుంటే, నాకేందుకు అనుకుంటే, యేసయ్య ప్రేమ మనలో లేనట్లే. మనం అయన శిష్యులం కానట్లే. మనకు ఉన్నవన్నీ అందరికి పంచేయమని దేవుడు చెప్పటం లేదు. నీకు ఉన్న దాంట్లో, సంతోషంగా ఇతరులకు సహాయం చేయమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. 

మనం చూపే ఆ ప్రేమ ఎంతో మందిని యేసయ్యకు దగ్గర చేస్తుంది! నీతి కలిగిన జీవితం మన బంధువులను, స్నేహితులను అయన శిష్యులుగా మారుస్తుంది. ఎన్నో ప్రసంగాల ద్వారా చెప్పలేని సువార్త నీ జీవితం ద్వారా చెపితే, ఎంతో మంది మారి, నశించి పోకుండా క్రీస్తులోకి వచ్చే అవకాశం ఉంది. సువార్త భారం మంచిదే, కానీ అంతకన్నా ముందు మన  విశ్వాస జీవితం ఇంకా ప్రాముఖ్యమయినది. మనం బ్రతికి చెపితే, ఎదుటి వారి హృదయంలో దేవుడు దాన్ని ఫలింప చేస్తాడు. మనం పాటించకుండా ఎంత గొంతూ చించుకున్నా ఫలితం ఉండదు. 

1 యోహాను 3: "19. దేవుడు మన హృదయము కంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము."

పై వచనంలో చెప్పినట్లుగా దేవునికి నచ్చినట్లు బ్రతకటానికి మనకు గొప్ప బైబిల్ వాక్యాలు కూడా తెలియనవసరం లేదు. మన మనసు ఏ విషయాలలో మనలను తప్పు పడుతుందో వాటి విషయంలో దేవుని ఎదుట మన మనసును  సమాధాన పరచుకుంటే చాలు. మనలో దేవుని ప్రేమ ఉన్నట్లే, మనం యేసయ్య శిష్యులుగా నడచుకున్నట్లే. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మాటలతో, పాటలతో, ఇంకా ఎన్నో రకాలుగా సువార్త చెప్పటం మంచిదే! అన్నింటి కన్నా మనకు తెలిసిన వారికి మన జీవితాల ద్వారా చెపితే ఇంకా గొప్ప పరిచర్య చేసిన వారిగా ఉంటాము. మీకు పాటలు పాడే శక్తి లేక పోవచ్చు, ప్రసంగాలు చేసే తెలివి, దైర్యం లేక పోవచ్చు, మిమల్ని ఎవరు దేవుని పరిచర్యలో పాలి బాగస్తులు చేయట్లేదేమో! వాటి అవసరం లేదు. ప్రభువు మిమల్ని పిలుచుకున్నాడు, విశ్వాసం ఇచ్చి నడిపిస్తున్నాడు. మీ జీవితం చాలదా! అయన ప్రేమను చాటటానికి, సువార్త చెప్పటానికి! ఆలోచించండి, ఆచరించండి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!

1 కామెంట్‌: