పేజీలు

5, జనవరి 2024, శుక్రవారం

దేవుని దీవెనలు!



క్రైస్తవ విశ్వాసులు ఎన్నో రీతులుగా దేవుని చేత దీవించబడాలని ఆశపడుతూ ఉంటారు. అందుకోసం ఎంతో విశ్వాసముతో ప్రార్థిస్తారు. ఎన్నో రకాల ప్రార్థనలు, అనగా ఉపవాస ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన పేరిట నిత్యమూ దేవునికి విన్నపాలు చేస్తుంటారు. మరియు నూతన సంవత్సరం పొందుకున్న వాగ్దానపు పత్రాలను భద్రంగా బైబిల్ లో దాచుకుంటారు. ప్రతి రోజు ప్రార్థనల్లో ఆ వాగ్దానాలను ఎత్తి పడుతూ సంవత్సరం అంత ప్రార్థిస్తారు. ఈ మధ్య కొంతమంది వాగ్దానాలు తీసుకోవటం జ్యోతిషం లాంటిది, మన దేవుడు అలాంటి వాటిని లెక్క చేయడు అని ప్రసంగాలు చేస్తూ విశ్వాసులను గందరగోళానికి గురి చేస్తున్నారు. 

క్రీస్తు ధర్మ శాస్త్రము నెరవేర్చి నూతన నిబంధన ఏర్పరచాడు కాబట్టి, దేవుడు పాత నిబంధనలో ఇచ్చిన పాప క్షమాపణార్థ బలులు మరియు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ధర్మ శాస్త్రము తప్ప, బైబిల్ లో ఉన్న ప్రతి ఆజ్ఞ, ప్రతి వాగ్దానము అయన విశ్వాసులయినా అందరి కోసము. ప్రతి వాగ్దానము లేదా ఆశీర్వాదము ఆజ్ఞను పాటించటం ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. ఉదాహరణకు "నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము" (నిర్గమకాండము 20:12). దీర్ఘాయువు అనేది ఆశీర్వాదము అయితే దాన్ని పొందు కోవటానికి కావలసింది ఆజ్ఞను పాటించటము అంటే తండ్రిని తల్లిని గౌరవించటం. 

వాగ్దానపు కార్డులు తీసుకోవటం వాక్యానుసారమా? కాదా? అని చర్చ అనవసరం. దేవుని వాక్యం నుండి ఒక వాగ్దానం తీసుకోని, దాని ద్వారా ఆత్మీయ పరుగులో ఉత్తేజం తెచ్చుకుంటే, దేవుడు తప్పు పడుతాడా? లేక ఏ వచనమయిన ఖండిస్తుందా? "మనుష్యుడు బ్రతికేది కేవలము రొట్టె ద్వారా మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు ద్వారా" అని దేవుని వాక్యమే చెపుతోంది. మరి దేవుడు ఇచ్చిన మాటను ఎత్తి పడుతూ విశ్వాసులు ఆత్మీయంగా బలం పొందుకోవటాన్ని, ఎవరో మనుష్యులు చెప్పే జ్యోతిష్యంతో పోల్చటం విశ్వాసులను నిరుత్సాహ పర్చటమే అవుతుంది. 

2 కొరింథీయులకు 1: "20. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి."

పౌలు గారు పరిశుద్దాత్మ ప్రేరణతో కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో ఇదే మాటను మనకు వెల్లడి చేశారు. క్రీస్తు యేసు నామములో దేవునికి మహిమ కలుగుటకు ప్రతి వాగ్దనము విశ్వాసులయిన మన జీవితములో దేవుని చిత్తానుసారముగా నెరవేరుతాయి. కనుక వాగ్దనాలను తీసుకోవటానికి, నమ్మటానికి నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఒక్క వాగ్దానమును మాత్రమే నమ్ముకోకుండా మిగిలిన దేవుని వాక్యమును కూడా ధ్యానించటానికి ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. 

అంతే కాకుండా వాగ్దనాల మీద విశ్వాసముతో పాటు, ప్రభువయినా యేసు క్రీస్తు చెప్పినట్లుగా "ముందుగా మనం దేవుని రాజ్యమును వెతకాలి, అప్పుడు మనం కోరినవి అన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు" (మత్తయి  6:33). దేవుని రాజ్యము వెతకటము అంటే ఏమిటి? బాప్తిస్మము ఇచ్చు యోహాను ఆనాటి ప్రజలకు "దేవుని రాజ్యము సమీపించినది కనుక పాపములు ఒప్పుకొని మారు మనసు పొందండి" అని బాప్తిస్మము ఇచ్చాడు (మత్తయి 3:1-2). యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు క్రీస్తు కూడా "దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది, సువార్తను నమ్ముడనీ, దేవుని సువార్తను ప్రకటించాడు" (మార్కు 1:15). దేవుని రాజ్యమును వెతకటం అంటే పాపములు ఒప్పుకొని, మారు మనసు పొందటమే అని మనకు అర్థం అవుతుంది. 

కనుక దేవుని దీవెనలు పొందుకోవాలంటే మనం ఖచ్చితముగా పాపమునకు దూరముగా ఉండాలి,  ఒక వేళ పడిపోతే పాపములు ఒప్పుకుంటూ, దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను పాటించే వారిగా ప్రయత్నం చేయాలి. బాప్తిస్మము తీసుకున్నపుడే మారు మనసు పొందుకోవటం కాదు. పడిపోయిన ప్రతి సారి మారు మనసు కలగాలి. అంటే ఆ పాపమూ పట్ల ద్వేషము కలగాలి, దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని క్రీస్తు రక్తములో పరిశుద్దులుగా మారాలి. పరిశుద్దాత్మ శక్తి ద్వారా ప్రతి శరీర క్రియను జయించి, ఆత్మ ఫలములు పొందుకోవాలి. ఆవగింజంత విశ్వాసము చూపి ప్రార్థిస్తే కొండలను సైతం కదిలించే శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఇక వాగ్దనాలు నెరవేరి, దీవెనలు పొందుకోవటం అసాధ్యమా? 

దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు కనుక మనలను పోషిస్తున్నాడు. మనము కూడా నిత్యమూ ఆయనను ప్రేమించాలని ఆశపడుతున్నాడు. ఆయనను సంతోష పెట్టేవారుగా మనం ఉండాలి. మనకు వస్తున్నా దీవెనలు అయన నామ ఘనతార్థమై, అయన సంఘము యొక్క క్షేమార్థమై వాడబడాలి. వ్యక్తిగత అభివృద్ధి చూసుకోవద్దు, ఆర్థిక సామర్థ్యము పెంచుకోవద్దు అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. మనకు, మన పిల్లల భవిష్యత్తుకు సరిపడినంత ఉంచుకుంటూ, మిగిలినది ఇతరులకు సహాయం చేయటానికి వెచ్చించాలి. "రెండు అంగీలు గలవాడు ఏమియు లేనివానికియ్య వలెనని, ఆహారముగలవాడు లేని వానికి పెట్టాలని" బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పింది అందుకే (లూకా 3:11). దేవునికి ఇష్టముగా జీవిస్తూ, విశ్వాసముతో మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తాడు. 

ఎస్తేరు 2: "17. స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్యకిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను."

ఇక్కడ పరాయి దేశములో, ఇతర ప్రజల మధ్య అన్యురాలుగా ఉంటున్న ఎస్తేరు పట్ల, రాజుకు తన దగ్గరికి పంపబడిన కన్యలందరి కంటే దయ దాక్షిణ్యాలు కల్పించాడు దేవుడు.  అందును బట్టి రాజు ఆమెను రాణిగా నియమించాడు. లేదంటే ఆమె కేవలం రాజుకు ఉప పత్నిగా ఉండిపోయేది. ఎంతో మందిలో ఒక్కత్తిగా ఆమె మిగిలి పోయేది. అంతే కాకుండా రాజు ఆమెను ఎంతగానో ప్రేమించాడు మరియు ఆమె నిమిత్తమై గొప్ప విందును కూడా ఏర్పాటు చేసాడు. ఆవిధముగా ఆమెను దేవుడు ఎంతో గొప్పగా దీవించాడు. అయితే ఎస్తేరు రాణి అయినా తర్వాత కూడా ఆమె తన తగ్గింపును వదిలి పెట్టలేదు. ఎందుకంటే తన తండ్రి సోదరుడయినా మొర్దకై ఆజ్ఞకు లోబడి తన వంశమును కానీ, తన జాతిని కానీ బయట పెట్టలేదు అని దేవుని వాక్యం చెపుతోంది (ఎస్తేరు 2:20)

తర్వాత హామాను అనబడే ఆ రాజ్యపు ప్రధాన మంత్రి మొర్దకై తనకు సాష్టాంగ నమస్కారం చేయలేదని దేవుని ప్రజలయిన యూదులను పూర్తిగా నాశనం చేయాలని ఎదురు డబ్బులు కట్టి రాజు ద్వారా శాసనం రాయిస్తాడు. అప్పుడు మొర్దకై ఎస్తేరు తో "రాజు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, తన జాతి వారయినా యూదులను కాపాడమని" కబురు పంపుతాడు. అయితే ఎస్తేరు "రాజు పిలవకుండా అయన ముందుకు వెళితే నా ప్రాణాలు పోవచ్చు" అని తిరిగి కబురు పంపుతుంది.

ఎస్తేరు 4: "13. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తర మిచ్చిరాజ నగరులో ఉన్నంతమాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని నీ మనస్సులొ తలంచుకొనవద్దు; 14. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. "
 
ఇక్కడ మొర్దకై ఎస్తేరును "నువ్వు రాణివి అయినంత మాత్రాన క్షేమమముగా ఉంటావని అనుకోవద్దు. నువ్వు ధైర్యం చేసి ఇప్పుడు మాట్లాడక పొతే యూదులకు మరో రకముగా సహాయం దొరుకుతుంది. అసలు నువ్వు రాణివి అయింది యూదులను ఈ ఆపద నుండి తప్పించటానికేనేమో, ఒక్కసారి ఆలోచించుకో" అని హెచ్చరిస్తున్నాడు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుడు నీకు ఇచ్చిన దీవెనలు ఎందుకోసమో గుర్తించావా? అయన చిత్తమును నెరవేర్చటానికి, అయన సంఘము యొక్క క్షేమాభివృద్ధికై ఆ దీవెనలు వాడుతున్నావా? దేవుడు ఎంత గొప్పగా దీవిస్తే అంతగా తగ్గింపును అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఎస్తేరు రాణి అయినా తర్వాత కూడా తన తగ్గింపును వదులు కోలేదు. అందుకే మొర్దకై ఇచ్చిన ఆజ్ఞను పాటించి తన జాతిని, వంశమును గోప్యముగా ఉంచింది. లేదంటే దేవుడు ఆమె ద్వారా చేయాలనుకున్న గొప్ప కార్యం చేసే ధన్యతను ఆమె కోల్పోయేది. దేవుడు నిన్ను ఉన్నత స్థానములో నిలబెట్టడా? నీ దారి నువ్వు చూసుకోవద్దు, నీ వారి కోసం, దేవుని ప్రజల కోసం ధైర్యముగా నిలబడు. దేవుడు తన కార్యలను ఎలాగయినా జరిగించుకుంటాడు. శూన్యం నుండి సృష్టిని చేసిన దేవునికి అసాధ్యమయినది ఏది లేదు. కానీ అయన కార్యమును చేసే ధన్యతను నువ్వు కోల్పోతావు. 

దేవుని నుండి దీవెనలు పొందుకోవటం అసాధ్యం ఏమి కాదు గాని వాటిని ఏ విధముగా దేవుని కోసం వాడుతున్నాము అనేది చాల ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీవెనలు మన ఆత్మీయ జీవితమును మరింతగా మెరుగు పరచాలి గాని నశింప జేయకూడదు. దేవునికి మనలను మరింత దగ్గరగా చేయాలి గాని దూరం చేయకూడదు. "ఎందుకు పనికి రాని నన్ను ఎన్నుకొని, ఇంతగా దీవిస్తున్నావు తండ్రి" అని నిత్యమూ కృతజ్ఞత భావముతో దీనమనసు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఇచ్చే దీవెనలకు హద్దు ఉండదు, మన ద్వారా ఆయన చేసే గొప్ప కార్యాలకు అంతు ఉండదు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగముతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి