పేజీలు

13, జనవరి 2024, శనివారం

విశ్వాసము - పశ్చాత్తాపముఒకప్పుడు పాపపు జీవితము గడిపి, వాటిని బట్టి పశ్చాత్తాప పడి, ఇప్పుడు వాటిని విడిచి పెట్టి క్రీస్తును విశ్వాసిస్తున్నాము. కాబట్టి విశ్వాసము, పశ్చాత్తాపము ఆత్మీయ ప్రయాణానికి రెండు కాళ్ళ వంటివి. ఈ రెండు సమన్వయంగా సాగినప్పుడే మన ఆత్మీయ జీవితం సాజావుగా సాగుతుంది. లేదంటే క్రియలు లేని విశ్వాసము ఎలాగయితే దేవుణ్ణి సంతోష పెట్టలేదో, అలాగే పశ్చాత్తాపం లేని విశ్వాసము మనకు గర్వమును కలిగించి ఆత్మీయంగా మరింత లోతునకు మనలను నెట్టి వేస్తుంది. పశ్చాత్తాపం అంటే చేసిన పాపాలను ఒప్పుకొని దేవుణ్ణి క్షమాపణ అడగటం. ఈ విధముగా దేవుణ్ణి విశ్వాసించే గుణమును కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అనేది క్రైస్తవ విశ్వాసము. 

అయితే ఇతర మతాలలో పాపానికి ప్రాయశ్చిత్తము చేయటం ద్వారా పాపములు తగ్గించు కోవచ్చు అని నమ్ముతారు.  కానీ పాపానికి నిలయం అయినా శరీరం సంగతి ఏమిటి? ఆవిధముగా కలుషితం అవుతున్న మనసును ఎవరు మారుస్తారు. ప్రభువయినా క్రీస్తు చెపుతున్నది ఏమిటంటే మరుమనసు పొంది అంటే పాపములు మానేసి, వాటిని ఒప్పుకోవటం అంటే పశ్చాత్తాపం చెందటం ద్వారా మనకు నూతన జీవితము ఇస్తానని,  మరియు తన పరిశుద్దాత్మ శక్తి ద్వారా మన శరీర క్రియలు జయించే శక్తిని పొందుకుంటామని. 

దేవుడు నిత్యమూ మనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు, ప్రతి మనిషికి తనను తానూ  బయలు పరచుకోవటానికి సిద్దపడి ఉన్నాడు. ఆయన పిలుపుకు స్పందించిన మానవులకు పశ్చాత్తాపము, విశ్వాసమును ఇఛ్చి తనకు దగ్గరగా ఉండటానికి వివిధ పరిస్థితులను కల్పించి తన మీద ఆధారపడటానికి ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహిస్తాడు. పశ్చాత్తాపము, విశ్వాసము అనే ఈ రెండు కృప వరములను పరిశుద్దాత్మ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. కనుక వీటిని బట్టి మనలో ఎవరు కూడా తమ గొప్పను చెప్పుకోవటానికి ఆస్కారం లేదు. పరిశుద్దాత్మ లేని కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ధర్మ శాస్త్రం ఇచ్చి వాటిని పాటించుట ద్వారా ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించాడు. అన్యులయిన ప్రజలకు మనసాక్షిని ఇచ్చి తమ తప్పులను బట్టి పశ్చాత్తాప పడే గుణమును ఇచ్చాడు. 

యోనా 3: "5. నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి."

దేవుడు "నీనెవె పట్టణపు ప్రజల పాపములు ఎక్కువైనాయి, నలుపది రోజులలో వారిని నేను నాశనం చేస్తాను" అని యోనా ద్వారా వర్తమానం పంపినప్పుడు వారు ఎం చేశారు? దేవునియందు విశ్వాసముంచి, గోనెపట్టలు కట్టుకొని అంటే పశ్చాత్తాప పడి ఉపవాసములు ఉన్నారు, దేవుడు తన మనసు మార్చుకొని వారిని కనికరిస్తాడని. అలాగే వారు తమ దుష్ట కార్యములను విడచి, తాము చేయు బలాత్కార్యములను మానివేయాలని ఆ దేశపు రాజు చాటింపు వేశాడు. ఏది మంచి కార్యము, ఏది చెడు కార్యము అని వారికి ఎలా తెలిసింది? దేవుడు ఇచ్చిన మనసాక్షిని బట్టి.  ఆవిధముగా వారు పశ్చాత్తాప పడుట ద్వారా దేవుని యందు విశ్వాసమును కనబరిచారు. అందును బట్టి  వారు దేవుని క్షమాపణను పొందుకున్నారు. 

పశ్చాత్తాపము మనలను నిత్యమూ దినులుగా ఉంచుతుంది. ఆ విధముగా మనము దేవుని కృపను పొందుకుంటాము, అప్పుడు మరింతగా ఆత్మీయముగా ఎదుగుతాము. కొన్ని సార్లు దేవుడు మన ఆపేక్షనుబట్టి కొన్ని విధములయిన శరీర క్రియల మీద విజయం ఇస్తాడు, అప్పుడు మనలో ఆత్మీయ గర్వం కలుగ వచ్చు. అలాగే కొన్ని సార్లు దేవుడు మనకు బయలు పరచే వాక్యపు లోతులను బట్టి కూడా మనలో ఎదుటి వారిని చిన్న చూపు చూసే తత్త్వం మొదలు కావచ్చు. తద్వారా మనము పశ్చాత్తాపమును కోల్పోయి, విశ్వాసములో వెనుకబడిపోయే అవకాశం ఉంది. 

యేసయ్యను క్రీస్తుగా, దైవ కూమారునిగా గుర్తించిన పేతురు, "వీళ్ళందరూ నిన్ను విడచి పోయిన కూడా నేను మరణని కైనా నీతో వస్తాను గాని, నిన్ను విడిచి పోను" అన్నాడు యేసయ్య తో (మార్కు 14:20-30). ఇది ఆయనలో ఉన్న ఆత్మీయ గర్వము. దేవుడే తనకు యేసయ్యను గురించి బయలు పరచాడని యేసయ్య చెప్పిన కూడా (మత్తయి 16:16-18), అదంతా తన విశ్వాసమే అనుకున్నాడు. కనుకనే ఆత్మీయముగా పడిపోయాడు. పలుమార్లు యేసయ్యను నేను ఎరుగనని అబద్దం ఆడాడు. తిరిగి పశ్చాత్తాప పడి, విశ్వాసులకు నాయకుడిగా యేసయ్య చేత ఎన్నుకోబడ్డాడు.  పడి పోయినప్పుడే పశ్చాత్తాప పడాలా? ముమ్మాటికీ కాదు. దేవుని పరిశుద్ధతను బట్టి మనం ఎన్నటికీ కూడా అయన నామమును సైతం ఉచ్చరించటానికి అర్హులము కాము. కానీ అయన మనకు విశ్వాసము ఇచ్చి ఆయనను "అబ్బా", "తండ్రి" అని పిలిచే ఆధిక్యతను ఇచ్చాడు కనుక, మనము నిత్యమూ పశ్చాత్తాప పడ బద్దులుగా ఉన్నాము. 

దానియేలు 9: "2. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సర ములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించి తిని. 3. అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని."

బబులోనుకు చిన్నతనంలోనే బానిసగా పట్టుకొని పోబడిన దానియేలు తన దినచర్యను దేవుని వాక్యము చదువుట ద్వారా ప్రారంభిస్తున్నాడు. అప్పుడు అయన యిర్మీయా గ్రంథములో దేవుడు ఇశ్రాయేలుకు విధించిన డెబ్భై సంవత్సరాల చెర పూర్తవ్వబోతున్నట్లు కనుగొన్నాడు. వెంటనే గోనెపట్ట కట్టుకొని, తలపైన ధూళి వేసుకొని, ఉపవాసముండి దేవునికి ప్రార్థనలు చేయటానికి సిద్దపడ్డాడు. తన ప్రార్థనలో కూడా తమ పితరులు చేసిన పాప కార్యములను బట్టి పశ్చాత్తాప పడ్డాడు. దేవుని క్షమాపణకై దినముగా వేడుకున్నాడు. తిరిగి ఇశ్రాయేలును నిలబెట్టుమని దేవునికి విజ్ఞాపణ ప్రార్థనలు చేశాడు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! కొన్ని సార్లు దేవుని మీద మనకు ఉన్న  విశ్వాసము మనలను పశ్చాత్తాప పడ నివ్వదు. ఎందుకంటే దేవుడు కరుణ సంపన్నుడు, అయన మిక్కిలి మనలను ప్రేమిస్తున్నాడు, నిత్యమూ మనలను క్షమిస్తున్నాడు, ఇంకా పశ్చాత్తాప పడవలసిన అవసరం ఏమిటి? కొంత మంది, "అదే పనిగా పశ్చాత్తాప పడటం మనలను మనం ఖండించుకోవటం అవుతుంది" అని పశ్చాత్తాపాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ దానియేలు పశ్చాత్తాప పడటం ద్వారా తన తగ్గింపును దేవుని ముందు చూపిస్తున్నాడు. దేవుడు జరిగించ బోయే కార్యాలకు అయన మీద ఆధారపడుతున్నాడు. ఆవిధముగా దేవుని మీద  తన విశ్వాసమును చాటుతున్నాడు. 

దేవుడు ఖచ్చితముగా తమను చెర నుండి విడిపిస్తాడని తెలిసిన కూడా, కేవలము కృతజ్ఞత ప్రార్థనతో సంతోషముగా గడపలేదు. రాబోయే ఆశీర్వాదాల కంటే గతములో చేసిన పాపాలకు, వాటి కోసం పశ్చాత్తాపానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. దానియేలు పితరుల కంటే మనం ఏమి పవిత్రులము కాము. మనం చేసిన పాపముల నిమిత్తం క్రీస్తు సిలువలో మరణించి, తిరిగి లేచాడు. అందుకు మనం ఎంతగా పశ్చాత్తాప పడాలి? ఆయన మనకు ఇచ్చిన రక్షణ వాగ్దానమును బట్టి ఎంత దీనులుగా అయన ముందు ప్రవర్తించాలి. అయన మన జీవితములో నెరవేర్చే నిరీక్షణ వాగ్దానానికై  ఎంతగా అయన మీద ఆధారపడాలి? 

కొంతమంది విశ్వాసులు జీవితములో ఆశీర్వాదాలు కలిగే పరిస్థితులను బట్టి తగ్గింపును కోల్పోతారు. తాము పొందుకున్న దీవెనలు తమ అర్హతను బట్టి దేవుడు ఇచ్చాడు అని, దేవునికి తామంటే అధిక ఇష్టం అని విశ్వాసముతో కూడిన గర్వం ప్రదర్శిస్తారు. ఆ విధమయిన ఆలోచన మనలో పశ్చాతాపమును తగ్గించి, విశ్వాసములో మనలను వెనుకకు నెట్టేస్తుంది. కాబట్టి విశ్వాసమును బట్టి గర్వపడకుండా నిత్యమూ పశ్చాత్తాపమును కలిగి దినులుగా మన ఆత్మీయ పరుగును కొనసాగిద్దాము. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉందును గాక! ఆమెన్ !! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి