పేజీలు

18, ఫిబ్రవరి 2024, ఆదివారం

సంఘములో ఐక్యత!


సంఘము అనగా యేసు క్రీస్తును తలగా చేసుకొని అయన దేహముగా అయన రెండవ రాకడ కోసం సిద్దపడే వధువు వంటిది. క్రీస్తు దేహముతో పోల్చినప్పుడు అందులో భాగములు కూడా ఉంటాయి కదా! అనగా సంఘములో ఉండే అంగములే విశ్వాసులు. ఈ విశ్వాసుల మధ్యలో ఐక్యత, సఖ్యత కలిగి ఉంటేనే సంఘమంత ప్రభువు రాకడకు సిద్ధపడుతున్నట్లు చెప్పుకోవచ్చు. కానీ నేటి సంఘములలో అటువంటి ధోరణి కొనసాగుతుందా? వాటి గురించి తెలుసుకొనే ముందు! అసలు సంఘము యొక్క లక్షణములు ఏమిటి? వాక్యానుసారముగా తెలుసుకుందాం.

అపొస్తలుల కార్యములు 2: "45. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. 46. మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై 47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను."

ఈ వచనము ఆనాడు ఆదిమ సంఘము, పెంతేకొస్తు దినమున పరిశుద్దాత్మ పొందుకొన్న తర్వాత, ఏవిధముగా తాము ప్రభువులో ఎదుగుతూ తమ పరిచర్యను కొనసాగించారో తెలుపుతుంది. విశ్వాసులు అందరు  తమకు కలిగినది అమ్మి అవసరం ఉన్నవారికి పంచి ఇచ్చారు. అంతే కాకుండా వారు ఏక మనస్సు కలిగిన వారై! దేవుణ్ణి స్తుతించారు. తద్వారా ప్రజల యొక్క దయను పొందారు. ఆనందముతోను నిష్కపట హృదయముతోను ఆహారము పుచ్చుకొనే వారు. మరియు ప్రభువు అనుదినము రక్షణ అనుభవము పొందిన వారిని వారితో చేర్చు చుండెను. అనగా రోజు కొత్తవారు సంఘములో చేర్చబడు చున్నారు. క్రీస్తు సంఘముగా ప్రజల యొక్క ఆదరణ పొందటం ఎంతో ప్రాముఖ్యమయినదిగా పరిగణించాలి. మన ప్రవర్తనయందు క్రీస్తు ప్రేమను చూపుతూ మన యొక్క రక్షణను ప్రకటించాలి. 

ఆవిధముగా ప్రభువు ప్రేమను ప్రజలకు చాటి అయన వైపు వారిని నడిపించాలి. ఇది జరగాలంటే విశ్వాసులు ఏక మనసు కలిగిన వారై ఉండాలి. దేహము యొక్క ప్రవర్తన తలను బట్టి ఉంటుంది గాని చేతిని బట్టి, ముక్కును బట్టి లేదా కళ్ళను బట్టి ఉండదు. అదే విధముగా సంఘము యొక్క ప్రవర్తన కూడా తలగా ఉన్న క్రీస్తును పోలి నడుచుకోవాలి గాని ఏ ఒక్క విశ్వాసిని బట్టి, సంఘ పెద్దలను బట్టి కాదు. దేవుడు ప్రతి విశ్వాసిని తన దేహములో అనగా సంఘములో అవయవాలుగా చేసాడు. తన చిత్తము చొప్పున తలాంతులు అనుగ్రహించి తన పరిచర్యను చేయటానికి అనగా తన రాజ్య వ్యాప్తికై వాడుకుంటున్నాడు. తద్వారా సంఘము యొక్క అభివృద్ధిని జరిగిస్తున్నాడు అనగా కొత్తవారిని చేర్చటానికి ఇష్టపడుతున్నాడు. కొత్తగా వచ్చిన విశ్వాసుల పట్ల సంఘ సభ్యుల ప్రవర్తనను విశదీకరిస్తూ పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము చదవండి.

సహోదరులందరు ఏకభావము కలిగిన వారై ఉండాలి, కక్షలు లేకుండా ఏక మనసు కలిగిన వారై ఉంటు  ప్రభువు రాకడకై సంఘముగా సిద్దపడి ఉండాలి. విభిన్న మనస్తత్వాలు, నేపథ్యాలు కలిగిన మనుష్యుల మధ్య ఇది సాధ్యమేనా? ఒక ఇంట్లో పుట్టిన సహోదరి, సహోదరుల మధ్య ఎన్నో మనస్పర్థలు ఉన్నప్పుడు, ఇంతమంది పరాయి వారు ఉన్న సంఘములో ఐక్యత ఎలా సాధ్యం అవుతుంది? ప్రతి విశ్వాసి తమను తాము తగ్గించుకోవాలి, ఇతరులను ప్రేమించాలి అన్న క్రీస్తు లక్షణాలు కలిగి ఉంటె సాధ్యమే కదా! తగ్గించుకుంటే తగిన ఘనత దేవుడు మనకు ఇస్తాడు. 

1 పేతురు 3: "8.  తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖ ములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. 9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి." 

అపొస్తలుడయిన పేతురు గారు కూడా తాను రాసిన మొదటి లేఖలోని వచనములు చూడండి. ఏక మనస్సు కలవారై ప్రతి ఒక్కరి సుఖదుఃఖముల యందు పాలు పంచుకొంటూ సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులుగా, వినయ మనస్సు కలవారై ఉండుమని ప్రోత్సహిస్తున్నారు. ఆశీర్వాదమునకు వారసులు కావటానికి మనం పిలువబడ్డ వారము కనుక కీడు చేసే వారికి ప్రతిగా కీడు చేయకుండా, దూషించిన వారిని తిరిగి దూషించకుండా దీవించుమని పరిశుద్దాత్మ ప్రేరణతో హెచ్చరిస్తున్నారు. యేసు క్రీస్తు చెప్పినట్లుగా "మిమల్ని దీవించిన వారిని దీవిస్తే మీకేమి ప్రయోజనము, మీకు తిరిగి సహాయము చేసేవారికి సహాయం చేస్తే ఏమిటి లాభము" (లూకా 14:13-14) అన్నట్లుగా ప్రతి ఒక్క విశ్వాసి ఈ లక్షణములు పాటించినట్లయితే సంఘములో ఐక్యత సాధ్యమవుతుంది.  

అలాగే ప్రతి ఒక్కరు కూడా మృదువైన మాట తీరును అలవరచు కోవాలి. ఆవిధమయిన మాట తీరు  ఎదుటి క్రోధమును చల్లార్చుతుంది, కానీ నొప్పించు మాట కోపమును రేపుతుంది. అసలు ఇశ్రాయేలు పన్నెండు గోత్రములు విడిపోవడానికి సొలొమోను కుమారుడవైన రెహబాము మాట్లాడిన పరుషమయిన మాటలే అని లేఖనములు స్పష్టం చేస్తున్నాయి. ఇశ్రాయేలు వివిధ గోత్రముల నుండి కొంతమంది పెద్దలు రెహబాముతో కొన్ని విన్నపములు చేసుకోవటనికి వచ్చారు. అతని తండ్రి అయినా సొలొమోను వారిని ఎంతగా కష్టపెట్టింది చెప్పుకొని తననైనా ఆ కష్టములు తొలగించుమని వేడుకుంటారు (1 రాజులు 12: 3-4)

1 రాజులు 12: "13. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ¸యౌవనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను 14. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును."

ఇక్కడ అహంకారుడయినా రెహబాము పెద్దల మాటను పేడ చెవిన పెట్టి తనవంటి  యవ్వనస్తులు చెప్పిన సలహాలు విని వారితో పరుషంగా మాట్లాడి ఇశ్రాయేలులో పది గోత్రముల వారు విడిపోయేలాగా ప్రవర్తించాడు.  రాజు తమ మాట మన్నించకపొగ పరుషంగా మాట్లాడినందుకు తన ఏలుబడిలో నుండి వెళ్ళి పోయారు ఇశ్రాయేలు వారు. తద్వారా ఇశ్రాయేలులో సమైఖ్యత నశించిపోయింది. సంఘములో సైతం పరుషముగా మాట్లాడుతూ, ఇతరులను నొప్పించువారు ఉన్నట్లయితే సంఘములో ఐక్యత ఖచ్చితంగా దెబ్బ తింటుంది. కనుక మృదువయిన మాట తీరును అలవరచుకుందాం! ఏక మనసు కలిగి ఉండటానికి ఇష్టపడుదాం కానీ ఏక పక్షముగా ఉండటాన్ని కాదు. ఇక్కడ రెహబాము ప్రజలు లొంగి ఉంటున్నారు కదా అని నిరంకుశంగా ఏక పక్షంగా ఉండాలని చూశాడు, కానీ ప్రజలు దాన్ని స్వాగతించ లేదు. సంఘములో ఉండే పెద్దలు సైతం ఇటువంటి మనస్తత్వమును మానుకోవాలి. 

క్రీస్తు ప్రేమయే మనలను ఐక్యపరచే బలము. ఆ ప్రేమ లోపించిన నాడు భిన్న మనస్తత్వాలు, సొంత చిత్తములు బయలు దేరుతాయి. క్రీస్తు ప్రేమ రెహబాము వంటి స్వభావమును అంగీకరించదు, సంఘము యొక్క ఐక్యతను కోరుకుంటుంది, ప్రతి సభ్యుడిని పాలిబాగస్తుడిగా చేర్చుకుంటుంది. కన్ను ఒక్కటి ఉంది కదా అని రెండవ కన్నును ఎవరయినా నిర్లక్యం చేస్తారా? చేతికి వెళ్ళు పది ఉన్నాయి కదా అని ఒక్క వేలిని నరికేసు కుంటారా? సంఘములో ఉన్న ప్రతి అంగము అనగా ప్రతి విశ్వాసి అంతే ప్రాముఖ్యం ఉన్నవాడు. అది దేవుని చిత్తముగా జరిగింది కనుకనే ఆ విశ్వాసి ఆ సంఘములోకి నడిపింపబడ్డాడు. విశ్వాసులను సరిచేయటం తప్పు కాదు, వారు మారనప్పుడు వదిలేయటం వాక్యానుసారం కానిది కాదు. కానీ అతను నా వాడు, ఇతను ఫలానా అతని వాడు అని గుంపులు కట్టటం కొరింథీయులకు రాసిన పత్రికలల్లో  పౌలు గారు ఏనాడో ఖండించాడు.  

రాజులు 18: "31.  యెహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని 32. ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి"

దేవుని ప్రవక్త ఏలీయా  బయలు ప్రవక్తలను సవాలు చేసి యెహోవాకు బలి అర్పించుటకు ముందు విడిపోయిన ఇశ్రాయేలు గోత్రములన్నింటిని బట్టి పన్నెండు రాళ్లు తెప్పించి దేవునికి బలి పీఠము కట్టి ఆ గోత్రముల సమైక్యతను, సమానత్వమును చాటుతున్నాడు. అటువంటి ప్రవర్తన  దేవునికి ఎంతో ప్రీతికరమవుతుంది! అటువంటి స్వభావము మనం కలిగి ఉన్నామా? వారు మా కులం వారు, వీరు మా వీధి వారు లేక మా ఉరి వారు అని ఇంకా తారతమ్యాలు పాటిస్తున్నామా?  సంఘము అనగా లోక రీతిగా ఒక కులం వారు కలుసుకోవటం కాదు, ఒక ఉరి వారు విహార యాత్రకు రావటం కాదు, లేదా కేవలం స్నేహితులు చేసుకొనే విందు కాదు.  ఒకరి మంచిని ఒకరు మెచ్చుకుంటూ, ప్రతి ఒక్కరు ఇతరుల మంచిని, క్షేమమమును ఆశిస్తూ, క్రీస్తులో ఎదగటం. అనగా అయన ప్రేమను చూపుతూ ఇతరులను ఎదిగించటం. 

తద్వారా క్రీస్తు రెండవ రాకడకై మనం సిద్దపడుతూ అయన చిత్తముగా ఇతర ఆత్మలను రక్షించటం. అందరం క్రీస్తు వారలము, దేవుని బిడ్డలము అన్న భావన కలిగిననాడు సంఘములో ఐక్యతకు లోటేమి ఉంటుంది. ఇవన్ని జరిగేలా చూడవలసింది సంఘములో ఉండే పెద్దలు. యధా రాజా తధా ప్రజ లాగా పరిస్థితి మారకుండా ఉండాలంటే యధా క్రీస్తు తథా సంఘముగా పరిస్థితి మారాలి. ప్రస్తుతం సంఘములలో పెత్తనాల కోసం పోరు మాములుగా ఉండటం లేదు. దేవుని సంఘములో ఎన్నికలు పెడుతున్నారు. అపొస్తలలు ఏనాడయినా  ఎన్నికలు పెట్టారా? యేసు క్రీస్తు తన వృత్తి చేసిన వారినే శిష్యులుగా ఎంచుకున్నాడా? చీటీలు వేసి తండ్రి నీ చిత్తము బయలు పరచు అని సభ్యులను ఎన్నుకొంటే సరిపోదా? సంఘ పెద్దలు ప్రార్థిస్తే దేవుడు తన  చిత్తమును  బయలు పరచాడా? 

ప్రియాయమయిన సహోదరి, సహోదరుడా! సొలొమోను రాజు దగ్గరికి వచ్చిన ఎంతో ప్రసిద్దమయిన తగువు సంఘటనను ఈ పరిస్థితులకు ఆపాదించి చూద్దాము. ఇద్దరు తల్లులు ఒక్క బిడ్డతో వచ్చి ఆ బిడ్డ నాదంటే నాదని తగువులాడుకున్నారు. అటువంటి స్థితిలో చాల సంఘాలు కూడా ఉన్నాయి. సంఘము నాదంటే నాది అని సంఘ పెద్దలు తగువులాడుకుంటున్నారు. వారి వారి గొప్ప కోసం సంఘమును ముక్కలు చేయటానికి వెనుకాడటం లేదు. కానీ సొలొమోను, బిడ్డను రెండు ముక్కలుగా చేయమన్నప్పుడు నిజమయిన తల్లి తన బిడ్డను త్యాగం చేయటానికి వెనుకాడలేదు. ఆ తల్లికే బిడ్డ అప్పగింపబడింది కానీ ముక్కలు చేయమన్న తల్లికి కాదు. కనుక  సంఘంలో  నీ పరిస్థితి ఎలాంటిదయినా సంఘమును ముక్కలు చెయ్య వద్దు. దేవుని చిత్తమును కనిపెట్టు ఆయన ప్రేరేపిస్తే అక్కడ నుండి వెళ్ళిపో. ఆయనే నిన్ను తన చిత్తానుసారముగా వాడుకుంటాడు. దేవుణ్ణి నమ్ముకొని, అయన చిత్తము నెరవేర్చి నశించి పోయినవాడు ఎక్కడ వెతికిన దొరకడు. దేవుని సంఘము ఐక్యతను కోరుకోవటం కన్న మించిన దేవుని చిత్తము మరోటి ఉంటుందా? 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగముతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి