పేజీలు

3, ఫిబ్రవరి 2024, శనివారం

నాలుకతో జాగ్రత్త!దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మనుష్యులు బ్రతుకుతారని దేవుని వాక్యం చెపుతోంది. అయితే మనలో చాల మంది మాట్లాడే మాటలు ఇతరులను బాధించేవిగా ఉంటాయి. వెనుక ముందు ఆలోచించకుండా మనం పలికే చెడ్డ మాటలు ఇతరులను తీవ్రమయిన ఇబ్బందులకు గురి చేస్తాయి. కనికరం లేని మాటలు పలికే వారు కూడా కనికరం లేని (యాకోబు 2:13) తీర్పును పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అలాగే  "మనం వినటానికి త్వరపడాలి, మాట్లాడటానికి ఆలస్యం చేయాలి" (యాకోబు 1: 19).  తద్వారా ఎదుటి వారి జ్ఞానమును తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది, లేదంటే మనకు తెలిసిందే మనం చెప్పగలం, దాని వలన మనం కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు. 

లోకంలో ఉన్న తీరును బట్టి అధికముగా మాట్లాడే వారు మాత్రమే తెలివయిన వారు అని భ్రమ పడుతారు. కానీ సందర్బమును బట్టి మాటలను నియంత్రించుకునే వారు అనగా తమ నాలుకను కట్టడి చేసుకొనే వారు మాత్రమే తెలివయిన వారు. అంతే కాకుండా దేవుణ్ణి స్తుతియించె నాలుకతో దేవుని స్వరూపములో చేయబడిన సాటి సహోదరుణ్ణి లేదా సహోదరిని దూషించటం, మనలో దేవుని ప్రేమను చూపించదు. ఎందుకంటే మంచి నీటి ఊటలో నుండి ఉప్పు నీరు ప్రవహించనట్లే, దేవుని ప్రేమ కలిగి ఉన్న మనలో నుండి శాపనార్థలు, దూషించే మాటలు రాజాలవు (యాకోబు 3:11)

కొలస్సయులకు 3 : "8. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి."

ఇక్కడ పౌలు గారు పేర్కొన్న పాపపు కార్యములన్ని కూడా నాలుకతోనే చేసేవిగా ఉన్నాయి. కోపం వచ్చినప్పుడు మౌనముగా దేవుని వాక్యమును ధ్యానించు కోవాలి లేదా మౌనముగా మనసులోనే ప్రార్థించు కోవాలి. ఎలాంటి సందర్భములోను  నిగ్రహము కోల్పోయి మన ఆగ్రహమును చూపించ రాదు. మనకు ఎదురవుతున్న ప్రతి సమస్య మన దేవుని అధీనములో ఉన్నాయి అని పూర్తిగా విశ్వాసం చూపాలి.  లేదంటే దేవునికి  ఇష్టం లేని దూషణ, మరియు బూతులు మాట్లాడుతాము. కొనసాగింపుగా దుష్టత్వము అనగా మనకు నష్టం లేదా కష్టం కలిగించిన వారికి కీడు చేయాలన్న తలంపులు మొదలవుతాయి. భక్తి పరులమని చెప్పుకుంటూ ఇటువంటి పనులు జరిగిస్తూ ఉంటె మన భక్తి వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తోంది (యాకోబు 1:26)

మత్తయి 12: "37. నీ మాటలనుబట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అప రాధివని తీర్పునొందుదువు."

మనలో చాల మంది విశ్వాసులు వారు మాట్లాడే మాటలను చాల తేలికగా తీసుకుంటూ ఉంటారు. కానీ మన ప్రభువయినా యేసు క్రీస్తు చెపుతున్న మాట ఏమిటంటే, మనం పలికే ప్రతి మాటకు మనం లెక్క అప్పజెప్పాలని. వ్యర్థముగా మనం పలికే మాటలు మనలను అపరాదిగా దేవుని ముందు నిలబెడుతాయి. జీవము మరణము మన నోటిలోనే ఉన్నాయి, పలికే చెడ్డ మాటల యందు సంతోషించే వారు అటువంటి ఫలములనే పొందుకుంటారు (సామెతలు 18:21). కాబట్టి నిత్యమూ మనం పలికే మాటలను ఆచితూచి పలకాలి. ఎలా వేళల ఆశీర్వాదాలను, ప్రేమతో కూడిన మాటలను, ప్రతికూల పరిస్థితిలో కూడా అనుకూలమయిన మాటలనే పలకాలి. ఎందుకంటే మన విశ్వాసం చొప్పున మనకు  జరుగుతుందని దేవుని వాక్యం చెపుతోంది. 

చిన్న నిప్పు రవ్వ అడవి అంతటిని దహనం చేసినట్లుగా మన నోటి నుండి వచ్చే చిన్న మాట ఎన్నో గొడవలకు కారణం అవుతుంది. ప్రేమ పూర్ణుడు అయినా క్రీస్తు విశ్వాసులుగా మనము నిత్యమూ ప్రేమ కలిగిన మాటలనే పలకాలి. మామిడి చెట్టు కేవలం మామిడి పండ్లను మాత్రమే కాస్తుంది కానీ జామ పండ్లను కాయదు కదా.  క్రీస్తు విశ్వాసులుగా  ఉన్న మనము ఆయనకు సంబంధం లేని  చెడ్డ మాటలు, కనికరం లేని మాటలు మాట్లాడం మన విశ్వాసమును ఎలా చూపుతుంది? (యాకోబు 3:12). అలాగే మన మృదువయినా మాట తీరు ఎదుటి వారి కోపమును చల్లారుస్తుంది (సామెతలు 15:1), కనుక నిత్యము మృదువయినా మాట తీరునే కలిగి ఉండాలి. 

1 సమూయేలు 25 : "10. నాబాలు-దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజ మానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకు లున్నారు."

ఇక్కడ దావీదు, నాబాలు వద్దకు తన మనుష్యులను పంపి "పరోక్షంగా తానూ చేసిన మేలుల నిమిత్తం, అతని మందలను అడవి మృగముల నుండి కాపాడిన నిమిత్తం తన వారికి ఆహారం ఇవ్వమన్నప్పుడు". నాబాలు  దావీదు మనుష్యులతో దురుసుగా మాట్లాడుతూ "అసలు దావీదు ఎవడు? తన యజమానుడయినా సౌలును విడచి పారిపోయాడు. ఇటువంటి దాసులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి నేనెందుకు ఆహారం ఇవ్వాలి" అని హేళన చేశాడు. ఆ మాటలు విన్న దావీదు అతణ్ణి సంహరించాలని బయలు దేరుతాడు. అప్పుడు నాబాలు పనివారిలో ఒక్కడు, అతని భార్య అయినా  అబీగయీలు తో విషయం చెప్పగానే ఆమె వారికి కావలసిన ఆహారం సిద్ధం చేసి దావీదును కలుసుకొని తన భర్త విషయమై అతణ్ణి క్షమాపణ వేడుకుంది. ఆమె మృదువయిన మాట తీరును బట్టి, బుద్ది కుశలతను బట్టి దావీదు క్షమించి వెళ్ళిపోయాడు. కానీ పది దినములైన తరువాత దేవుడు నాబాలును మెత్తినందున అతను చనిపోయాడు (1 సమూయేలు 25:5-38). 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! మృదువయినా మాట తీరు ఎంతటి ఆపదనయినా తప్పిస్తుంది. కఠినమయిన మాట తీరు లేని ఆపదలను కలిగిస్తుంది. ఇక్కడ నాబాలు దావీదు మనుష్యులతో దురుసుగా మాట్లాడి తన పని వారి ముందు దావీదును  అవమానించాలని చూశాడు. ఒకవేళ నాబాలు భార్య అబీగయీలు సమయస్ఫూర్తి చూపించక, మృదువయినా మాటలతో దావీదును వేడుకొనక పొతే దావీదు చేతిలో నాబాలు హతం అయ్యేవాడు. దావీదు నాబాలు యొక్క భార్య మృదువయినా మాట తీరును బట్టి అతణ్ణి క్షమించినా కూడా అతని చెడ్డతనమును బట్టి, మోటుతనమును బట్టి దేవుడు నాబాలును క్షమించలేదు. కేవలం పది దినములలో అతను చనిపోయాడు. ఎల్లప్పుడూ మృదువయినా మాటలను పలకటానికి ఆసక్తి చూపాలి, అది ఎదుటి వారిని శాంతపరుస్తుంది అలాగే మన దేవుణ్ణి సంతోష పెడుతుంది. 

దేవుని వాక్యం చెపుతున్నది ఏమిటంటే, మనుష్యులు ఎన్నో క్రూరమయిన జంతువులను మచ్చిక చేసుకున్నారు గాని, చిన్నదయినా నాలుకను మచ్చిక చేసుకోలేక పోతున్నారు. అందును బట్టి దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడుతూ పాపంలో పడి పోతున్నారు (యాకోబు 3:7-8). చుక్కాని లేని నావ ఎలాగయితే నియంత్రణ లేకుండా సముద్రములో కొట్టుకు పోతుందో, అదుపు లేని నాలుక ద్వారా మనుష్యులు కూడా విశ్వాసములో తప్పిపోతారు (యాకోబు 3:4-5). కాబట్టి మన నాలుక నిత్యమూ పరిశుద్ధాత్మ అధీనములో ఉండాలి. తద్వారా దేవుడు మనకు ప్రేమ పూరితమయిన మాటలను ఇస్తాడు. పెంతేకొస్తు దినము నాడు పరిశుద్దాత్మ శక్తిని పొందుకోవటం ద్వారా  అక్కడ ఉన్న ప్రజలు తమకు రాని భాషలను మాట్లాడారు అని దేవుని వాక్యం చెపుతోంది (అపొస్తలుల కార్యములు 2:1-2). అధే విధముగా మనకు సాధ్యం కానీ మృదువయినా మాటలను కూడా దేవుడు మనకు అనుగ్రహించగలడు. విశ్వాసముతో ఉండండి, మన నోటి నుండి అయన మాటలను పలికించుమని  ప్రార్థించండి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి