పేజీలు

9, మార్చి 2024, శనివారం

సాటి వారిని ప్రసంశిస్తున్నావా?


సంఘము యొక్క క్షేమాభివృద్ధికై పరిశుద్దాత్మ దేవుడు సంఘములో ప్రతి విశ్వాసికి ఆత్మీయ వరములు అనుగ్రహిస్తాడు. వాటిని పొందుకున్న విశ్వాసులు దేవుడి మహిమను దొంగిలించకుండా సంఘము అభివృద్ధికై పాటుపడాలి. కానీ పరిశుద్దాత్మ దేవుడు సాటి విశ్వాసులకు ఇచ్చే ఆత్మీయ వరములను నిర్లక్ష్యం చేయటం, వారి విశ్వాసమును మరియు ప్రభువు పట్ల వారి పరిచర్యను చులకన చేయటం వాక్యానుసారము కాదు. ఇశ్రాయేలుకు రాజయిన హిజ్కియా దేవుడయిన యెహోవాకు పస్కా పండుగ జరుపవలెనని తలచినప్పుడు అందరికి లేఖలు పంపాడు. తర్వాత దేవుని సేవలో ఉన్న లేవీయులను అతను ప్రసంశించాడు. అది వారు చేయవలసిన బాధ్యతే కదా అని నిర్లక్ష్యం వహించలేదు (2 దినవృత్తాంతములు 30:22)వారితో ఎంతో ప్రియముగా మాట్లాడినట్లు దేవుని వాక్యం తెలియ జేస్తుంది.  అటువంటి ప్రితికరమయిన మాటలు సంఘములో ఉన్న పాస్టర్లతో మాట్లాడే స్థితిలో ఉన్నామా? లేదా "వారు చేయవలసిందే చేస్తున్నారు కదా" అని నిర్లక్ష్యం వహిస్తున్నామా? 

1 కొరింథీయులకు  16: "18. మీరులేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మా నించుడి." 

పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమంటున్నారు! ఆయనకు సహాయం చేసిన వారిని సన్మానించుమని చెపుతున్నారు. మెచ్చుకోలు మాట ఆత్మను తృప్తి పరుస్తుంది, శ్రమను దూరం చేస్తుంది. అంతేకాకుండా రెట్టించిన ఉత్సాహముతో దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళే శక్తిని ఇస్తుంది కనుకనే పౌలు గారు ఇలాంటి కార్యములు సూచిస్తున్నారు. దేవుడి మహిమను దొంగలించకూడదు అన్న నెపంతో ఇతరుల శ్రమను నిర్లక్ష్యం చేయటం ఎంత వరకు సరయినది? వారి ద్వారా దేవుడు తన కార్యములు చేస్తున్నాడు, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, "దేవుడు మిమల్ని ఇంత బాగా వాడుకుంటున్నందుకు చాల సంతోషం సోదరుడా లేదా సోదరి" అని చెప్పటం సరైన పని కాదంటారా? 

మన ప్రభువయినా యేసు క్రీస్తు ఎన్నో మారులు ఆయనకు తండ్రి అయినా దేవుడు ఇచ్చిన  మహా జ్ఞానమును బట్టి మత పెద్దల చేత శోదించబడ్డాడు. అయన చేయుచున్న పరిచర్యను బట్టి, అధికారముతో బోధించిన విధానమును బట్టి విమర్శలు ఎదుర్కొన్నాడు. వారు తమకు ఉన్న బైబిల్ జ్ఞానమును బట్టి ఆత్మీయ గర్వముతో నిండియున్నారు. అంతే కాకుండా యేసు క్రీస్తు నేపథ్యమును బట్టి ఆయనను చాల తక్కువ అంచనా వేశారు. కనుకనే దేవుడు ఆయనకు ఇచ్చిన అధికారమును గుర్తించ లేకపోయారు. మనలో అటువంటి ఆత్మీయ గర్వము ఉందా? ఇతరుల నేపథ్యమును బట్టి ఎదుటి వారిని చులకనగా చూస్తున్నామా? ఎవరు ఊహించారు! చేపలు పట్టే వారు ప్రంపంచాన్ని ప్రభువు పేరిట మార్చేస్తారని. గాడిదను సైతం వాడుకున్న దేవునికి తనయందు విశ్వాసం ఉంచి, తన పరిచర్యలో వాడబడాలనే తపన కలిగిన వారిని  వాడుకోవటం అసాధ్యమా? 

మత్తయి 13: "55.  ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా? 56. ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి."

యేసు క్రీస్తును నజరేతు వారు ఎంత చులకనగా చూస్తున్నారో చూడండి! "మన ముందు పెరిగిన వడ్లవాని కుమారునికి ఇంత జ్ఞానం ఎక్కడిది" అని అయన బోధను ఆటంక పరుస్తున్నారు. అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ఎదుటి వారు నీకన్న చాల ఆలస్యంగా విశ్వాసములోకి రావచ్చు, లేదా వారు నీ అంత చదువుకోక పోవచ్చు, వారి ఆర్థిక స్థితి నీ అంత మెరుగుగా ఉండక పోవచ్చు, కానీ వారి ఆత్మీయ స్థితిని బట్టి, దేవునికి వారి పట్ల ఉన్న ప్రణాళికను బట్టి వారికి ఇస్తున్న జ్ఞానమును బట్టి, ఆత్మీయ వరములను బట్టి అభ్యంతరపడవద్దు.  వారిని ప్రోత్సహిస్తూ సంఘము క్షేమాభివృద్ధికి వారిని వాడుకోవటమే దేవునికి ఇష్టమయిన కార్యము. 

ముఖ్యముగా కొన్ని సంఘములలో సాటి సహోదరులు చెప్పే ప్రసంగమయిన, రాసిన పాటయినా, లేదా వారు పాడే పాటయినా ఏ ప్రోత్సాహానికి నోచుకోదు. లోకంలో చెప్పుకొనే సామెత "పొరుగింటి పుల్లకూర రుచి" అన్న మాదిరి, ఎవరో తెలియని వారు ఏమి చెప్పిన, ఏమి చేసిన అందులో అద్భుతాలు చూసే మనసు ఉంటుంది కానీ తోటి సహోదరుడు ఏమి చేసిన వంకలు వెతికి పక్కన పెడుతూ ఉంటారు. అటువంటి వారి నిమిత్తమై యేసయ్య ఏమన్నాడో తెలుసా? 

దేవుని పరిచారకుడు సొంత ఊరిలో, ఇంటిలో తప్ప ప్రతి చోట ఘనంగా చూడబడుతాడని (మత్తయి 13: 57-58). తరువాత ఏమి జరిగింది, అటువంటి వారి అవిశ్వాసమును బట్టి అయన అనేకమైన  అద్భుతములు చెయ్యలేదు. నీ అవిశ్వాసమును బట్టి అనగా సాటి సహోదరునికి, సహోదరికి ఉన్న జ్ఞానము దేవుడే ఇస్తున్నడని నమ్మకుండా, నీ గర్వమును బట్టి, అభ్యంతరపడితే నీ జీవితంలో కూడా  జరిగే అద్భుతములు ఆగిపోతాయేమో ఆలోచించుకో! వారు ఏమి చెప్పిన అద్భుతం అని పొగడవలసిన అవసరం లేదు! కానీ వారిని ప్రోత్సహిస్తూ సూచనలు ఇవ్వటం, ప్రభువులో వారిని బలపరుస్తుంది, సంఘముకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. 

మత్తయి 8: "10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి ఇశ్రా యేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను." 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! యేసయ్య విశ్వాసము చూపించిన వారిని ఎంతగా ప్రశంసించే వాడో ఈ వచనంలో స్పష్టంగా తెలుస్తుంది. తన దగ్గరికి వచ్చిన శతాధిపతి చూపిన విశ్వాసమును బట్టి అక్కడే ఉన్న ఇశ్రాయేలు లందరి ముందు, అన్యుడయినా అయన చూపిన విశ్వాసం వారిలో కూడా లేదని ప్రసంశించాడు. అంతే కాకుండా తమ విశ్వాసము ద్వారా స్వస్థత పొందిన ఎంతో మందిని  కూడా ఎల్లప్పుడూ అయన ప్రసంశించాడు. వారు స్వస్థత కోసం విశ్వాసం చూపించారు కదా అని నిర్లక్ష్యం చెయ్యలేదు. వారిని మరింతగా బలపరచటానికి ఎల్లప్పుడు వారి విశ్వాసమును  ప్రసంశించాడు  యేసు ప్రభువుతోటి వారిని ప్రసంశించటంలో చొరవ చూపించండి. వారికి ఉన్న తలాంతులను బట్టి, పరిచర్యను బట్టి, విశ్వాస జీవితమును బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అంతే కానీ "ఇక చాలులే" అని చులకనగా చూడకండి, నిర్లక్ష్యం చేయకండి, ప్రభువుకు వారి పట్ల ఉన్న ఉద్దేశ్యాలకు అడ్డుపడకండి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగం కలుసు కుందాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి