పేజీలు

30, మార్చి 2024, శనివారం

పరిశుద్ధ పరిచే దేవుడు!


క్రైసవ విశ్వాసము నిత్యమూ పాపమూ, పరిశుద్ధత గురించి ప్రాముఖ్యముగా బోధిస్తూ ఉంటుంది. ఎందుకంటే సృష్టి కారకుడయినా దేవుడు ఎంతో పరిశుద్ధుడిగా ఉన్నాడు. కనుక ఆయన బిడ్డలయినా మనము కూడా నిత్యమూ పరిశుద్ధముగా ఉండాలని, పాపపు తలంపులు పాటించకుండా ఉండాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. దేవుడు మనలను తన స్వరూపములో సృష్టించాడు అని దేవుని వాక్యం చెపుతోంది. కానీ మనకు ఉన్నటు వంటి సంపూర్ణ స్వేచ్ఛను బట్టి, పాపమూ చేసి, దేవుడు మనకు ఇచ్చిన అయన మహిమను కోల్పోయాము. అప్పుడు పరిశుద్ధుడయినా దేవుని సన్నిధిని మనము కోల్పోయాము. దేవుని ప్రమాణాల ప్రకారం పాపం చేయటం అంటే, దొంగతనము, హత్య చేయటం లాంటివి మాత్రమే కాదు గాని చిన్న అబద్దం చెప్పిన కూడా పాపముగానే పరిగణింప బడుతుంది. 

దురదృష్టవశాత్తు కొన్ని ధర్మాలలో అబద్దాలు చెప్పటం కూడా అంగీకారముగా బోధింపబడుతోంది. అదేవిధముగా, ఇతరుల మీద కోపం పెంచుకోవటం వారిని హత్య చేయటంతో సమానంగా, పరాయి స్ర్తీని మోహపు చూపు చూడటం వారితో వ్యభిరించటంతో సమానముగా బైబిల్ బోధిస్తుంది. ఈ విధముగా ఏ ఒక్క మానవుడు దేవుని పరిశుద్ధ ప్రమాణాలను అందుకోలేడు, కనుకనే క్రెస్తవ విశ్వాసము పాపమూ గురించి, పరిశుద్ధత గురించి ప్రాముఖ్యముగా బోధిస్తుంది. అయితే దేవుని కుమారుడు అయినా యేసు క్రీస్తు మనిషిగా జన్మించి, పాపం లేకుండా జీవించి, మన పాపముల నిమిత్తం, పరిశుద్ధమయిన తన రక్తం కార్చి, పాపం ద్వారా మనకు సంభవించే మరణము పొందుకొని, మరణము జయించి తిరిగి లేచాడు. దానినే ఈస్టర్ గా లేదా పునరుద్ధాన ఆదివారముగా జరుపుకుంటున్నాము. 

మనలో చాల మంది యువతి, యువకులు మరియు మధ్య వయస్కులు దేవుని దగ్గరికి రావటానికి, పాపములు ఒప్పుకొని పరిశుద్ధముగా జీవించే ప్రయత్నం చేయటానికి  ఇంకా చాల సమయం ఉంది అనుకుంటారు. కానీ రేపు ఏమి జరుగుతుందో తెలియని అనిశ్చితి ఉన్న ఈ లోకంలో మనకు ఎంత సమయం ఉందొ ఎవరు మాత్రం చెప్పగలరు? ఇలాంటి వారు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. అయితే మరి కొంత మంది దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడుతారు కానీ, తమకు ఉన్న చెడు అలవాట్లను బట్టి రాకుండా, ఆ అలవాట్లు వదిలేసినా తర్వాత రావాలని వెనుకడుగు వేస్తుంటారు. దేవుని పరిశుద్ధ ప్రమాణాలను, ఒక్క క్రీస్తు తప్ప, ఏ మానవుడు కూడా అందుకోలేదు, ఇక ముందు  కూడా అందుకోలేడు (రోమీయులు 3:23) అని దేవుని వాక్యం చెపుతోంది. 

క్రీస్తు తన బోధలలో "రోగులకే వైద్యుడు అవసరం కానీ, ఆరోగ్యవంతులకు కాదు" అని చెప్పాడు (మార్కు 2:17). అయన వైద్యుడిగా మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు. మన ఆత్మీయ రోగాలను, అనగా పాపాలను తొలగించటానికి అయన వచ్చినప్పుడు, ఆనారోగ్యం అనగా పాపములు తొలగించు కోవటానికి ఆయనను చేరుకోవాలి గాని, ఆరోగ్యం పొందుకున్న తర్వాత అనగా పాపములు వదిలిపెట్టిన తర్వాత  అయన దగ్గరకు వస్తానని చెప్పటం ఏమిటి? దేవుని వాక్యము, యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తము మరియు పరిశుద్దాత్మ శక్తి లేకుండా మనం ఏ చిన్న చెడు అలవాటును కూడా జయించ లేము. మనసులో అదిమి పెట్టి ఉంచటం తప్ప. మారు మనసు కావాలంటే క్రీస్తు దగ్గరకు రావాల్సిందే. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, మోకరించి అడుగు, నీ పరిశుద్ధ జీవితానికి అదే మొదటి అడుగవుతుంది. 

నిర్గమకాండము 3: "6. మరియు ఆయననేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖ మును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను."

దేవుడు మోషేకు తనను తానూ, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని పరిచయం చేసుకుంటున్నాడు. వీరందరూ కూడా ఎన్నో తప్పులు చేసిన మానవమాత్రులు మాత్రమే. కానీ దేవుడు తన పరిచయం వారితో జోడించి చేసుకుంటున్నాడు. సర్వ సృష్టిని చేసింది నేనే, అని చెప్పి దేవుడు అద్భుతాలు చూపించి తన పరిచయం చేసుకోవచ్చు కదా? కానీ దేవునికి మనుష్యులంటే ప్రేమ. తనను విశ్వసించినా వారంటే గర్వం. కనుకనే వారి పేరుతొ జోడించి తనను తానూ పరిచయం చేసుకుంటున్నాడు. తన పరిచయం మన ద్వారా కూడా జరగాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. హనోకు దేవునితో నడిచాడని దేవుని వాక్యం చెపుతోంది. అంటే హనోకులో ఏ తప్పులు లేవా? దేవుని వాక్యం ప్రకారం ఖచ్చితముగా ఉన్నాయి. కానీ ఆయనకు దేవుని పట్ల ఉన్న విశ్వాసం ఆయనను మరణం లేకుండా దేవుని దగ్గరికి చేర్చింది (ఆదికాండము 5:24)

యాకోబు 4: "8. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి."

క్రీస్తు సహోదరుడయినా యాకోబు గారు పాపులయిన ప్రతి ఒక్కరు దేవుని యొద్దకు వస్తే అయన మీ వద్దకు వస్తాడు అని చెపుతున్నాడు. అప్పుడు మీ చేతులను శుభ్రము చేసుకొనుడి అని పిలుపునిస్తున్నారు. అలాగే ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధ పరచుకొనుడి అని సూచిస్తున్నారు. ఈ యాకోబు గారు ఒకప్పుడు యేసయ్యను పిచ్చి పట్టిన వాడని చెప్పి, ఆయనను పట్టుకో బోయిన వారిలో ఒక్కడు అని దేవుని వాక్యంలో చూడవచ్చు (మార్కు 3:21).  కానీ క్రీస్తు మరణం, పునరుద్ధానము చూసిన తర్వాత ఆయన విశ్వాసిగా మారిపోయాడు. 

పాపి అయినా తనను పరిశుద్ధ పరిచింది క్రీస్తు సిలువ మరణమే అని ఆయన గుర్తించాడు కనుకనే మనకు కూడా బోధిస్తున్నాడు. అలాగే క్రీస్తు విశ్వాసులయిన వారు ద్వంద మనసును మానుకొని హృదయములను దేవుని యొద్ద పరిశుద్ధ పరుచుకోవాలని ప్రోత్సహిస్తున్నాడు. మన పాపపు బ్రతుకులను శుభ్రము చేసి మన హృదయాలను  పరిశుద్ధ పరిచేది ప్రభువయినా క్రీస్తు మాత్రమే. కనుక ఏ పరిస్థితిలో  మనం ఉన్న అయన దగ్గరకు రావటమే మనం చేయవలసింది. 

తీతుకు 3: "5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! తన ఆత్మీయ కుమారుడయిన తీతుకు పౌలు గారు రాసిన లేఖలో ఏమని రాస్తున్నాడు చూడండి. మనం పాటించే నీతిని క్రియలను బట్టి కాకుండా కేవలము దేవుని కనికరము చేత మాత్రమే మనము రక్షింపబడ్డాము అని చెపుతున్నాడు. నీలో పాపపు క్రియలు ఉన్నాయని, చెడు అలవాట్లు పాటిస్తున్నానని దేవునికి దూరంగా ఉంటున్నావా? దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్ను ఎప్పుడెప్పుడు పరిశుద్ధ పరచి తన బిడ్డగా మార్చుకోవాలా? అని తపన పడుతున్నాడు. క్రీస్తు మీద విశ్వాసం ఉంచి, బాప్తిస్మము తీసుకోని, పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా మన చెడు అలవాట్లు జయించే శక్తిని మనకు దేవుడే ఇస్తాడు. 

క్రీస్తు మనకు ఇచ్చే ఆదరణ కర్త పరిశుద్దాత్మ మనకు నూతన స్వభావం కలిగిస్తాడు. అప్పుడు మన పాపపు జీవితం మారిపోయి, పరిశుద్ధ పరచబడుతుంది. ఆ విధముగా దేవుడు నిన్ను పరిశుద్ధ పరుస్తాడు. కేవలము నువ్వు విశ్వాసం చూపి, ఆయనతో సాంగత్యం చేస్తే చాలు. అంటే ఏమిటి? ప్రతి రోజు ప్రార్థన, దేవుని వాక్య ధ్యానము, పరిశుద్దాత్మ ప్రేరణను ఆగింకరించటం. ఈ ప్రయత్నంలో పడిపోయిన పర్వాలేదు. మరల లేచిరా! ఏ మనుష్యుడు కూడా సంపూర్ణ పరిశుద్ధుడు కాలేదు, దేవుని కృప చేతనే వారు రక్షించ బడ్డారు. కానీ మొక్కవోని విశ్వాసం వారి సొతం. అదే నీ ఆయుధం కావాలి, కొంత మంది కయినా దేవుని పరిచయం నీతో జరగాలి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి