పేజీలు

16, మార్చి 2024, శనివారం

ఓర్పు కలిగిన విశ్వాసము!


క్రైస్తవ విశ్వాసము అనగానే చాల మంది దేవుని మీద ఆధారపడటం, ఏ కష్టం, నష్టం కలిగిన అన్ని కూడా దేవుని అధీనములో ఉన్నాయి కాబట్టి సంతోషించాలి అని బోధిస్తారు మరియు అలాగే భావిస్తారు. అయితే విశ్వాసము లోకి రావటానికి మాత్రం చాల మంది జీవితాలలో ఏవో అద్భుతాలు జరిగి ఉండటం సహజం. కానీ అద్భుతాల మీద మాత్రమే కొనసాగే విశ్వాసం ఎక్కువ కాలం నిలువబోదు. అందుకే దేవుని వాక్యం చెపుతోంది "విశ్వాసం అంటే ఎదురు చూసే వాటికి నిజ స్వరూపముగా మరియు కనబడని వాటికి ఋజువుగా ఉందని" (హెబ్రీయులకు 11:1). అంటే ఏమిటి? పొందుకొబోయే వాటికి  సంతోషించటం మరియు కంటికి కనబడని వాటిని నమ్మటం అనేది క్రైస్తవ విశ్వాసము అని అర్థము. అయితే ఇటువంటి విశ్వాసము చూపించటానికి ఎంతో ఓర్పు కావాలి, ముఖ్యముగా జీవితములో ఎదురయ్యే వివిధ సమస్యల యందు మరింత కష్టము. 

అయితే ఇటువంటి విశ్వాసమును మనకు దేవుడే నేర్పిస్తాడు. ఆత్మ ఫలములలో ఒకటయిన ఫలము దీర్షశాంతము అని దేవుని వాక్యం చెపుతోంది (గలతీయులు 5:22). అనగా ఓర్పు కలిగి ఉండటము. క్రీస్తు నందు విశ్వాసము ఉంచి, అయన మీద ఆధారపడిన నాడు, తన ఆదరణ కర్త అయినా పరిశుద్దాత్మ దేవుడు మనలో తన కార్యములు నెరవేర్చటం మొదలు పెడుతాడు, అనగా మనం ఆత్మ ఫలములు పొందుకోవటం మొదలవుతుంది. అప్పుడు వాటిలో ఒకటయిన ఓర్పు మనలో మొదలవుతుంది. అయితే ఈ ఓర్పు వలన కలిగే లాభములు ఏమిటి? విశ్వాసములో ఇది ఎందుకు ప్రాముఖ్యత కలిగి ఉంది? 

హెబ్రీయులకు 11: "11. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను." 

కుమారుణ్ణి ఇస్తానని దేవుడు తన భర్త అయినా అబ్రాహాముకు వాగ్దానము చేసినప్పుడు, శారా ఒక్కసారి తొందరపడి తన భర్తను దాసి అయినా హాగరు తో పంపినప్పటికి, తిరిగి తన విశ్వాసము పొందుకొని, మరల తప్పిపోలేదు. చాల ఓర్పు కలిగి ఎన్నో ఏండ్లు సంతానం కోసం నిరీక్షించింది. తన స్ర్తీ ధర్మము నిలిచి పోయినప్పటికి కూడా దేవుడు తనకు గర్భ ఫలమును ఇస్తాడని దృఢమయిన విశ్వాసముతో, దీర్ఘ శాంతముతో ఎదురు చూసి, కుమారుణ్ణి పొందుకుంది. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటమే ఓర్పుతో కూడిన విశ్వాసముగా చెప్పుకోవచ్చు. ఓర్పు కలిగి ఉండటం ద్వారా ప్రతి విషయములో, ప్రతి పరిస్థితిలో  దేవుని యందు ఆనందిస్తూ, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే మానసిక స్థితి లేదా విశ్వాసము అలవడుతుంది. 

"క్రియలు లేని విశ్వాసము మృతమయినది" అని దేవుని వాక్యం చెపుతోంది (యాకోబు 2:17). మనలో విశ్వాసము ఉన్నదని చాల మంది చెప్పుకోవచ్చు. అందుకు తగ్గట్లుగా గొప్ప ప్రార్థన పరులుగా ఉండవచ్చు. కానీ యేసయ్య  బోధలు ఏమని చెపుతున్నాయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని కదా! చాల సార్లు మన సాటి వారు మనలను శోదించ వచ్చు లేదా సాతాను వారిని వాడుకొని, లేదా పరిస్థితులను వాడుకొని మన విశ్వాసమును దెబ్బ తీసే ప్రయత్నం చేయవచ్చు. వారు మనతో ప్రవర్తించే విధానమును బట్టి, మనలను తేలిక చేసే మాటలను బట్టి ఉక్రోషపడి వారి మీద కోపం పెంచుకుంటే మనం ఓర్పును కోల్పోతాము, ఆవిధముగా మన విశ్వాసములో వెనుక పడుతాము. 

అయితే దేవుడు అటువంటి శోధన పరిస్థితులను వాడుకొని మనలో దీర్ఘశాంతమును పెంచుతున్నాడు. ఆవిధముగా మనలో వారి పట్ల కోపం లేకుండా ప్రేమ కలుగుతుంది. తద్వారా మిగతా ఆత్మ ఫలములు కూడా మనలో పెరుగుతాయి. ఆత్మ ఫలములు అనేవి ఒకదానితో ఒకటి విడదీయ లేని సంబంధం కలిగి ఉన్నాయి. ప్రేమ కలిగి ఉన్న వారు మంచితనము కూడా కలిగి ఉంటారు, అలాగే దయాళుత్వము, దీర్ఘశాంతము మరియు సాత్వికము ఇలా చెప్పుకంటే అన్ని లక్షణాలు క్రైస్తవ విశ్వాసిలో అభివృద్ధి చెందుతాయి. అయన ప్రేమ కలిగిన వాడే కానీ కొంచెం కోపం ఎక్కువ అండి అంటే అదెలా సాధ్యం అవుతుంది. రెండింటికి ఎక్కడ కూడా పొంతన లేదు. మొదటిది ఉంటె రెండవది లేనట్టు రెండవది ఉంటె మొదటి లేనట్లు. 

ఇక్కడ బిడ్డల మీద తల్లి తండ్రి చూపించే కోపం గురించి మాట్లాడటం లేదు. క్రీస్తు విశ్వాసులుగా సాటి వారి పట్ల మన ప్రవర్తన గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే ఓర్పు కలిగి ఉండటం అనేది మనలో క్షమా గుణమును పెంపొందిస్తుంది. ఆవిధముగా తండ్రి అయినా దేవుడు మన తప్పులను మరింతగా క్షమించటానికి అర్హతను పొందుకుంటాము. ఆవిధముగా మన ఆత్మీయ జీవితము మెరుగుపడుతుంది. దేవుడు మనుష్యుల వలె సహనం కోల్పోతే అనగా ఓర్పును విడిచి లేదా దీర్ఘశాంతము మరచి పొతే మనం ఎవరమూ కూడా జీవించే అర్హతను పొందుకోలేము. ఏనాడో మనం నశియించి పోయి ఉండేవారము. 

యోనా 4: "2. యెహోవా, నేను నా దేశమం దుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందు వలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! ఇక్కడ యోనా ప్రవక్త నీనెవె పట్టణపు ప్రజల చెడ్డతనమును బట్టి వారి  పట్ల కోపం పెంచుకొని, ఓర్పును కోల్పోయి వారు నశించి పోవాలనుకున్నాడు. కానీ దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు కాబట్టి వారిని తప్పక క్షమిస్తాడని దేవుడు చెప్పిన సందేశం చెప్పకుండా దూరముగా పారిపోయాడు. దేవుని అంతులేని ప్రేమను అయన తప్పు పడుతున్నాడు. సాటి మనుష్యులు నశించి పోవాలని కోరుకుంటున్నాడు. ఇదంతా కూడా తనకు ఉన్నటు వంటి స్వనీతిని బట్టి కలుగుతోంది. మనం కూడా చాల సార్లు ఎదుటి వారు మన పట్ల చేసిన తప్పులను బట్టి, దేవుడు వారిని శిక్షించాలని కోరుకుంటాము. 

కానీ ఆలా కోరుకోవటం దేవుని ప్రేమను మనలో చూపించదు. నిత్యమూ మనము దీర్ఘశాంతము కలిగి క్షమిస్తూ ఉండాలి. వారిని ఎలా మార్చాలి, వారి అడ్డు మనకు ఎలా తొలగించాలి దేవుడు చూసుకుంటాడు. ఓర్పు వహించకుండా ఆనాడు  ఇశ్రాయేలు మొదటి రాజయిన సౌలు సమూయేలుకు బదులుగా బలులు అర్పించి దేవుని ఆగ్రహానికి గురయినాడు (1 సమూయేలు 13: 8-15). ఆవిధముగా దేవుని ప్రణాళికలు కోల్పోయాడు. నిత్యమూ ఓర్పుతో కూడిన విశ్వాసము కలిగి ఉందాము. తద్వారా మెరుగయిన ఆత్మ ఫలములు పొందుకొని దేవుణ్ణి సంతోష పెడుదాము. 

దేవుని చిత్తమయితే మరో వాక్య భాగముతో వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి