పేజీలు

23, మార్చి 2024, శనివారం

29 వ కీర్తన - అధ్యయనం

దావీదు ఈ కీర్తనలో దేవుని సార్వభౌమాధికారాన్ని, అయన స్వరము యొక్క బలమును, శక్తిని కవితాత్మకంగా వర్ణిస్తూ, దేవుణ్ణి స్తోత్రిస్తున్నాడు. ఈ కీర్తనలో మనం చివరగా దేవుడు ఇవ్వబోయే బలము, అనుగ్రహించబోయే సమాధానము, ఆశీర్వాదములను గూర్చి నిశ్చయత దావీదు కలిగియుండటం మనం చూడవచ్చు.

1. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. 2. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.

సర్వ జనములకు దేవుడయిన యెహోవాను స్తుతించాలని దావీదు గుర్తు చేస్తున్నాడు. మనం ఎంత గొప్పవారమయిన, లోకంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్న, దేవుని ఘనతను మాత్రం మరచి పోరాదని రాస్తున్నాడు. ఆయన ఎలా వేళల శక్తి వంతుడు,  ప్రభావము, గొప్పతనము  కలిగిన వాడు గనుక వాటిని ఆయనకు ఆరోపించాలని సూచిస్తున్నాడు. చాలామంది దేవుడు ఊరికే ఉన్నాడు, అయన మేలైన కీడైన చేయడు అని అనుకుంటారు (జెఫన్యా 1: 12), కానీ దేవుడు అన్నింటిని నియంత్రించగల సమర్థుడిగా ఉన్నాడు అని దావీదు గుర్తుచేస్తున్నాడు. ఆనాటి కాలములో ఉన్న అన్య దేవతలు దాగోను మరియు బయలు వంటి ప్రాణం లేని, మనుషులు చేసిన దేవుడు కాదు, అయన సజీవుడయినా  దేవుడు, కనుక అయన ఎదుట, సర్వ మానవాళి సక్రమముగా సాగిలపడి మొక్కాలని దావీదు ప్రోత్సహిస్తున్నాడు, దేవుని గొప్పతనమును చాటుతున్నాడు. 

3. యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు. 4. యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.

దేవుడు భూమ్యాకాశాలను చేసిన తర్వాత భూమి నిరాకరమయినప్పుడు దేవుని ఆత్మ జలముల అల్లాడుచున్నదని దేవుని వాక్యంలో రాయబడింది (ఆదికాండము 1:2), ఆతర్వాత దేవుని స్వరము వెలుగు కలుగు గాక అని చెప్పగానే వెలుగు కలిగింది, అలాగే సమస్త సృష్టి కూడా ఏర్పడింది. యోహాను సువార్తలో చెప్పబడినట్లుగా, ఆదియందు దేవుని వద్ద ఉన్న వాక్యము, ప్రభువయినా యేసు క్రీస్తు (యోహాను 1:1). కలిగినదంతము ఆయన ద్వారానే కలిగియున్నదని (యోహాను 1:2-3) దేవుని వాక్యం చెపుతోంది. ఇక్కడ దేవుడు  తన ఆత్మ అనగా పరిశుద్దాత్మ, మరియు తన స్వరము అనగా ప్రభువయినా క్రీస్తు ద్వారా పాడయినా భూమిని బాగు చేసాడు. అలాగే సర్వ సృష్టిని ఏర్పరచాడు. 

తర్వాత దేవుడయినా యెహోవా మహాజలముల మీద సంచరిస్తున్నాడని దావీదు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము దాటించినప్పుడు దేవుడు దానిని రెండుగా చీల్చిన సందర్భం గుర్తుచేసుకోవచ్చు. సముద్రములన్ని అయన మాటను వింటాయి, జలరాసులన్నీ అయన స్వర బలముకు లొంగిపోతాయి. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటు సందర్భంలో కూడా ఇటువంటి ప్రభావము, అద్భుతము దేవుని స్వరము ద్వారా వారికి సాధ్యపడింది. 

5. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. 6. దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును.

దేవుని స్వరము యొక్క శక్తిని కవితాత్మకముగా దావీదు వివరిస్తున్నాడు. ఎంతో ఎత్తయిన, బలమయిన దేవదారు వృక్షములను, సహజ వనరుల సంపద సమృద్ధిగా కలిగిన లెబానోనులో ఉండే అత్యంత బలమయిన దేవదారు వృక్షాలనూ సైతం అయన స్వరం ముక్కలుగా విరిచి వేస్తుందని దావీదు వర్ణిస్తున్నాడు. కేవలము వృక్షములను మాత్రమే కాదు, అయన స్వరము రెండు పర్వతములయిన లెబానోను మరియు షిర్యోను పర్వతములను కేవలము తన నోటి మాట ద్వారా కంపింప చేస్తాడు, అప్పుడు అవి మేకపోతు గంతులు వేస్తున్నట్లు కనిపిస్తాయని దావీదు దేవుని స్వరము యొక్క శక్తిని తెలియ పరుస్తున్నాడు. ఇటువంటి భావమునే దావీదు 114 వ కీర్తన 4:6 వచనములలో కూడా ప్రస్తావించాడు. తన ప్రజలయిన ఇశ్రాయేలు జనముకు సర్వ సృష్టిని అనుకూలముగా దేవుడు కేవలము తన నోటి మాట ద్వారా చేశాడు, అని దావీదు వివరిస్తున్నాడు. 

7. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది.

ఈ వచనంలో దేవుడు తన స్వరం ద్వారా అగ్ని జ్వాలలను సైతం పుట్టించగలడు, మరియు వాటిని నియంత్రించగలడని దావీదు గుర్తుచేస్తున్నాడు. మోషే ద్వారా ఐగుప్తు రాజయినా ఫరోను దేవుడు  ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి తొలగించి, పంపివేయాలని అడిగినప్పుడు, ఫరో తన హృదయము కఠినము చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఐగుప్తులో పది తెగుళ్ళను సంభవింప చేశాడు. అందులో ఏడవ తెగులునందు దేవుడు వడగండ్లు, పిడుగులతో పాటు అగ్నిని కురిపించాడు (నిర్గమకాండము 9:24) అని దేవుని వాక్యములో తెలుపబడింది.  ఇదే మాటను దావీదు 105 వ కీర్తన 34 వ వచనములో కూడా రాశాడు. నీరు ఉన్న చోట సహజముగా నిప్పు ఉండదు, కానీ దేవుని స్వర ప్రభావము చేత ఐగుప్తులో వడగండ్లతో పాటు నిప్పులు కూడా కురిసాయి, అని దేవుని శక్తిని దావీదు గుర్తుచేస్తున్నాడు. 

8. యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును 9. యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభా వము అనుచున్నవి.

ఇక్కడ దావీదు దేవుని స్వరము చేత అరణ్యములు కూడా కదిలించబడుతాయి అని రాస్తున్నాడు. అంతే కాకుండా దేవుని స్వరము చేత కాదేషు అరణ్యము కూడా కదిలించబడుతుందని గుర్తుచేస్తున్నాడు. ఈ కాదేషు ప్రాంతము దేవుని వాక్యమునందు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడే అబ్రాహాము అమాలేకీయులను ఓడించాడు. అదే స్థలములో ఇశ్రాయేలీయులు కనాను వారిని ఓడించలేమని భయపడి విశ్వాసములో వెనుకపడి పోయారు (సంఖ్యాకాండము 13:32-33). అలాగే వారు నీరు దొరకటం ఆలస్యం అయిందని, దేవుని మీద సణుగుకున్నది  కూడా ఇదే స్థలము (సంఖ్యాకాండము 20:1-5). ఆ విధముగా ఈ రెండు సంఘటనలు కాదేషు ప్రాంతమును అవిశ్వాసమునకు, సణుగుకొవటానికి మరియు అవిధేయతకు స్వారూప్యముగా సూచిస్తున్నాయి.  కాబట్టి దేవుని స్వరము అవిశ్వాసులను కదిలిస్తుందని, విశ్వాసులను స్థిరపరుస్తుందని మనం అర్థం చేసుకోవాలి. 

అలాగే అయన స్వరము లేళ్ళకు సంతానము కలుగ జేస్తుంది, మరియు ఆకులను రాలుస్తుంది. అనగా సర్వ సృష్టిలో జరిగే పెద్ద క్రియల నుండి, చిన్న క్రియల వరకు దేవుని స్వరము నియంత్రిస్తుందని దావీదు గుర్తిస్తున్నాడు. దేవుడయినా యెహోవా ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాయి అని కూడా రాస్తున్నాడు దావీదు. అనగా యెషయా దేవుని ఆలయంలో అయన దూతలు "ప్రభువైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అయన మహిమ భూలోకమంతా నిండిపోయింది" అని ఘనంగా స్తుతించారు అని తానూ చూసిన దర్శనం గురించి రాశాడు (యెషయా 6:1-4). కనుక విశ్వాసులుగా ఉంటూ, ప్రతి పెద్ద, చిన్న అవసరముకు అయన మీద ఆధారపడి, నిత్యమూ ఆయనకు స్తుతులు అర్పించాలని మనం అర్థం చేసుకోవాలి.  

10. యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.

దావీదు నోవహు కాలములో దేవుడు అనుమతించిన జల ప్రళయమును గుర్తుచేస్తున్నాడు (ఆదికాండము 9:11-12). దేవుడు ప్రళయ జలముల మీద ఆసీనుడిగా ఉన్నాడు, అయన నిత్యమూ రాజుగా ఆసీనుడై ఉన్నాడు. జల ప్రళయము దేవుని తీర్పును బట్టి వచ్చింది. తీర్పును తీర్చేది రాజు మాత్రమే. కాబట్టి యెహోవా రాజుగా తన తీర్పును తీర్చటానికి జల ప్రళయములను కూడా ఉపయోగించు కుంటాడు అని దావీదు మనకు గుర్తు చేస్తున్నాడు.  నోవహు కాలం మాదిరిగానే చెడ్డవారిని, పాపాత్ములను దేవుడు శిక్షిస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు.  

11. యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.

దేవుడయినా యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. ఈ లోకములో ఉన్న ప్రతి శ్రమను జయించటానికి వారికి శక్తిని అనుగ్రహిస్తాడు అని దావీదు రాస్తున్నాడు. అంతే కాకుండా ప్రతి శ్రమలో వారికి సమాధానము కలుగజేసి, ఆశీర్వదిస్తాడు. ప్రభువయినా యేసయ్య "నేను మీకు నా శాంతిని అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. కనుక మీ హృదయములను కలవరపడనియ్యకుడి, వెరవ నియ్యకుడి" అని బోధించాడు (యోహాను 14:27).  ఇక్కడ లోకం ఇచ్చేది అశాశ్వత మయినది. కానీ దేవుడు ఇచ్చేది నిత్యమూ ఉండేది. కనుక దావీదు దేవుడు తనను నమ్ముకున్న ప్రజలకు బలమును, సమాధానము ఇచ్చి, తగిన సమయమునందు వారిని ఆశీర్వదిస్తాడు అని గుర్తు చేస్తున్నాడు. ఆ సమాధానము విశ్వాసులయిన మన మీద  నిత్యమూ ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి