పేజీలు

13, ఏప్రిల్ 2022, బుధవారం

గుడ్ ఫ్రైడే - అయిదవ మాట (యోహాను 19:28)

 

"నశించి పోతున్న దాన్ని వెతికి  రక్షించటానికి నేను తండ్రి నుండి వచ్చాను" మరియు "నా  ద్వారానే తప్ప, ఎవడు కూడా మరో విధంగా తండ్రిని చేరలేడు" అని యేసయ్య పలుమార్లు తన భోధలలో ప్రస్తావించాడు. కనుకనే తండ్రి యొద్ద కొలువు తిరి ఉండటం భాగ్యమని ఎంచక, మనలను తండ్రి వద్దకు చేర్చటానికి, మనకు పాప క్షమాపణ ఇవ్వటానికి సిలువలో వ్రేలాడుతూ బలియాగం చేస్తున్నాడు. సిలువ త్యాగానికి ముందు, యేసయ్య ఎన్నో మార్లు తానూ ఎక్కడ నుండి వచ్చింది, తనను ఎందుకు విశ్వసించాలి అని తన భోధలలో వివరించాడు. కానీ ప్రజల గ్రుడ్డితనమును బట్టి ఆయనను గుర్తించక వెంబడించ లేక పోయారు, ఇప్పటికి చాల మంది అదే స్థితిలో ఉన్నారు. 

యేసయ్య తండ్రి తనకు అనుగ్రహించిన అన్ని ఆత్మలను రక్షించాలని నిత్యమూ ఆరాట పడ్డాడు. తన స్వస్థతల ద్వారా, తన బోధనల ద్వారా దేవుని ప్రేమను తెలియ చేసాడు, మరియు తండ్రికి ఇష్టమయిన వారిగా ఎలా జీవించాలో నేర్పించాడు. అయితే ఈ చివరి ఘడియాలలో కూడా ఆ సిలువలో పలికిన అయిదవ మాట ద్వారా తనకు ఉన్న ఆత్మల రక్షణను బట్టి దప్పిగొన్నాడని చెప్పవచ్చు.  

యోహాను 19: "28. అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొను చున్నాననెను."

ఈ వచనమును మనం పరిశీలిస్తే, సమస్తము సమాప్తమైనదని ఎరిగి అని ఉంది. ఏమి సమాప్తము అయింది? మానవాళిని రక్షించటానికి తండ్రి తన మీద పెట్టిన భారము పూర్తీ అయింది అని యేసు క్రీస్తు గ్రహించాడు. అంతకు ముందు నాలుగవ మాటలో మనం చెప్పుకున్నట్లు, దేవుడు క్రీస్తు మీద మన  పాప భారం మోపి, క్రీస్తుకు, తనకు ఎడబాటు కలిగించాడు. తద్వారా క్రీస్తు మనకై చెల్లించ వలసిన క్రయధనము అనగా పాపమూ ద్వారా మనకు కలిగే జీతము మరణమును పొందుకోబోతున్నాడు. ఇకపై మిగిలిన కార్యము, మానవాళి తన యందు విశ్వాసము ఉంచి, తన ద్వారా నీతిని పొందుకొని తండ్రిని చేరుకోవటమే. ఈ సువార్తను చాటించి ఆత్మలను రక్షించు లాగున, ఆత్మల భారంతో  దాహము పొందుకున్నాడు. 

దయచేసి యోహాను సువార్త 4 అధ్యాయం పూర్తిగా చదవండి. యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి ఏమని వెళ్ళాడు? తనకు దాహంగా ఉన్నది, కొంచెం నీళ్ళు ఇమ్మని కదా! నీళ్ళు ఇవ్వ జూచిన ఆమెతో, ఈ నీరు తాగితే మరల దాహం కలుగుతుంది, కానీ నేను ఇచ్చే నీరు తాగితే ఎన్నటికీ దాహం కలుగదు అని చెప్పి, తానే వారు ఎదురు చూస్తున్న మెస్సియ్య నని ఆమెకు తెలియ జేశాడు. అప్పటి వరకు పాపంలో  ఉండి, సిగ్గు పడుతూ, ఎవరు చూడకుండా  మధ్యాహ్నం మంచి నీటికై వచ్చిన ఆ స్త్రీ, యేసయ్య మెస్సియ్య అని తెలుకోగానే, ఎవరు ఏమి అనుకుంటారోనని పట్టించుకోకుండా, ఊరిలోకి వెళ్ళి అందరిని క్రీస్తు దగ్గరికి చేర్చింది ! 

యేసయ్య అదే సందర్భంలో కోత కాలం గురించి శిష్యుల వద్ద ప్రస్తావించి, ఆత్మల రక్షణను తెలియ చేసాడు. మరియు తన తండ్రి కార్యము నెరవేర్చటమే తనకు ఆహారముగా ఉన్నదని కూడా చెప్పినట్లు మనం చూడవచ్చు. యేసయ్య ఆ సమరయ స్త్రీ వద్దకు వచ్చింది, సహజంగా కలిగే దాహము తీర్చుకోవటానికి కాదు కానీ ఆత్మలను తన దగ్గరకు చేర్చుకోవాలని. ఆ స్త్రీ ద్వారా ఉరి వారంత రక్షణ పొందుకున్నారు, యేసయ్యను వారితో పాటు రెండు రోజులు ఉండమని బ్రతిమాలుకున్నారు. మనలో ఎంత మంది క్రీస్తు దాహం తీర్చే దిశగా అడుగులు వేస్తున్నాము? మన ద్వారా ఎంతమంది క్రీస్తు తమతో ఉండాలని కోరుకుంటున్నారు? 

ఉరి వారందరి చేత ఛీత్కరింపబడుతూ, ఎవరి ముందుకు రాలేక, సిగ్గుపడుతూ బ్రతుకుతున్న సమరయ స్త్రీ కంటే హీనమయిన స్థితిలో మనం లేము కదా? మరి సువార్త చెప్పటానికి ఎందుకు సిగ్గు? మనం అపొస్తలుల వలె ప్రాణాలు పెట్టాలని దేవుడు చెప్పలేదు,  ఒకవేళ అటువంటి స్థితి వస్తే దేవుడు మనకు తగిన కృపను ఇస్తాడు. కానీ కనీసం మన జీవితం ద్వారా, క్రీస్తు ప్రేమను చూపించే వారీగా ఉన్నామా? తద్వారా సువార్తను చాటిస్తున్నామా? క్రైస్తవులంటే ఇంత కనికరం, క్షమా గుణం కలిగి ఉంటారా? అని అన్యులు అనుకునేలా బ్రతికే ప్రయత్నం చేస్తున్నామా?

యేసయ్య నిత్యమూ ప్రజలకు తన గురించి చెప్పి, తనయందు విశ్వాసం కలిగించి వారిని రక్షించాలని చూశాడు. ఎవరయినా దప్పికగొంటే తన యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలని పిలుపు నిచ్చాడు. తన యందు విశ్వాసము ఉంచిన వారిలో నుండి జీవజలములు ప్రవహిస్తాయని లేఖనములు గుర్తు చేశాడు (యోహాను 7:34)మరి క్రీస్తు విశ్వాసులుగా చెప్పుకొనే మనము, లేఖనాలలో రాసి ఉన్నట్లుగా మన జీవితంలో జరగటానికి, క్రీస్తు బోధలు పాటిస్తున్నామా?  లేఖనముల నెరవేర్పుకై క్రీస్తు ఎన్నో మార్లు తన సొంత చిత్తమును, ఘనతను వదిలి పెట్టాడు. ఇప్పుడు దప్పిక గొనటానికి మరొక కారణం లేఖనముల నెరవేర్పుగా కూడా మనం చూడవచ్చు. 

లూకా 24: "44. అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను"

క్రీస్తును గురించిన ప్రవచనాలు, లేఖనాలలో ఎన్నో మార్లు రాయబడి ఉన్నాయి. కీర్తనలు 69:21 లో చూసినట్లయితే దావీదు పరిశుద్దాత్మ ప్రేరేపితుడయి "నాకు చేదు ఆహారము పెట్టిరి, నేను దాహము గొన్నప్పుడు వారు  చిరకను తాగ నిచ్చిరి" అని రాసాడు. ఈ మాట క్రీస్తును గురించినది కాబట్టి, యేసయ్య సిలువలో ఆ ప్రవచనం నెరవేర్చులాగా  దాహం పొందుకున్నాడు. తర్వాత సైనికులు ఆయనకు చేదు ద్రాక్షారసములో చిరకను ముంచి అందించారు. 

సహోదరి, సహోదరుడా! ఆత్మల రక్షణకై చేదు అనుభవాలు ఎదుర్కోవటానికి, కష్టాలు భరించటానికి సిద్దపడి ఉన్నామా? మనలను బట్టి అయన ఇంకా దాహంగానే ఉన్నాడు అని గుర్తిస్తున్నామా!  ఆ సమరయ స్త్రీ జీవితంలో యేసయ్య ద్వారా లోకపరమయిన అద్భుతాలు ఏమి జరుగలేదు, కేవలం రక్షకుడు అయినా యేసయ్యను తెలుసుకుంది. పాపము చేత సిగ్గుతో నిండుకున్న ఆమె జీవితం ఇప్పుడు ధైర్యంతో, సంతోషంతో నిండి పోయింది. తనకు దొరికిన ఆ సంతోషం, ఆ రక్షణ ఉరి వారందరికి పంచి పెట్టింది.  అటువంటి సువార్త పరిచారం మనం చేస్తే, మన కొరకు, మనలాంటి వారి కొరకు సిలువలో నలిగినా యేసయ్య దాహం తీర్చిన వారిగా ఉంటాము.

దేవుని చిత్తమయితే ఆరవ మాటను ధ్యానించుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి