పేజీలు

11, ఏప్రిల్ 2022, సోమవారం

గుడ్ ఫ్రైడే - మూడవ మాట (యోహాను 19:26-27)

 

ఆనాడు ఏదెను వనములో దేవుడు ఏర్పాటు చేసిన మానవ సంబంధాలు , మరియు కుటుంబ వ్యవస్థ ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో క్రీస్తు మనకు తన చివరి ఘడియలో సిలువలో పలికిన మూడవ మాట ద్వారా నేర్పిస్తున్నాడు. అంతే కాకుండా దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలలో తండ్రిని, తల్లిని సన్మానించుమనటం కూడా ఒక్క ఆజ్ఞ. కనుకనే క్రీస్తు తన తర్వాత  తన తల్లి బాధ్యతను ప్రియా శిష్యుడయినా యోహాను గారికి అప్పగిస్తున్నాడు. క్రీస్తు పలికిన ఆ మూడవ మాట యోహాను సువార్తలో మనం చూడవచ్చు. 

యోహాను 19: "26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, 27. తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను."

సిలువకు ఆయనను వ్రేలాడ దీయక ముందు యేసును ఎన్నో రకాల శారీరక హింసలు పెట్టారు సైనికులు. తర్వాత సిలువ మోసుకుంటూ కొండ ఎక్కించారు, తర్వాత కాళ్ళకు, చేతులకు మేకులు కొట్టి సిలువకు వ్రేలాడ దీశారు. కోన ఊపిరితో కొట్టుకుంటున్నాడు, ఆ సమయంలో ఇతరుల గురించి ఎవరు ఆలోచిస్తారు. కానీ క్రీస్తు ఆ సమయంలో కూడా మనకు మన బాధ్యతలు నేర్పిస్తున్నాడు, తల్లిని గౌరవించటం చూపిస్తున్నాడు. 

ముసలి వారయినా తల్లి, తండ్రిని ఎప్పుడు చస్తారా అని ఎదురు చూసే సంతానం ఉన్న రోజులలో బ్రతుకుతున్నాము. తల్లికి, తండ్రికి ఒక్క ముద్ద పెడితే ఆస్తులు కరిగి పోతాయా? ఎదో జబ్బు చేసి మందో మాకొ  ఇప్పిస్తే భవిష్యత్తు భగ్నం అయిపోతుందా? నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని చింతిస్తున్నావా? దేవుని వాక్యం నమ్మితే, నీ దిగులు వ్యర్థమయినదిగా అర్థమవుతుంది. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు కానీ వాటికి కొదువ ఉంటుందా? అని క్రీస్తు ప్రసంగించ లేదా? నా జీవితం అంత చూశాను, నీతి మంతుడు పడిపోవటం కానీ, అతని పిల్లలు యాచించటం కానీ నేను చూడలేదు అని దావీదు కీర్తనలో రాయలేదా? 

ఎఫెసీయులకు 6: "1. పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధే యులైయుండుడి; ఇది ధర్మమే. 2. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, 3. అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.

ఈ వచనములో పౌలు గారు పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా చెపుతున్న మాట ఏమిటి? తల్లిని తండ్రిని సన్మానించటం ధర్మము, మరియు ఆలా చేయు వారు ఆశీర్వదించబడుతారు అని కాదా? కానీ తల్లిని, తండ్రిని విస్మరించి మనం ఏవో ఆస్తులు కూడబెట్టాలని చూడటం, మనం కూర్చున్న కొమ్మను మనం నరుకుంటూ పైకి ఎక్కాలనుకోవటం లాంటిదే! కన్న వారిని విస్మరించటం ద్వారా దేవుని ఆజ్ఞను ధిక్కరించి అయన ఆగ్రహమును మన మీదికి తెచ్చుకోవటమే అవుతుంది (మార్కు 7:10). 

చాల మంది కుటుంబమును, మానవ సంబంధాలను నిర్లక్యం చేస్తూ దేవుని పరిచర్య చేస్తున్నాము కదా అని చెప్పటం కూడా దేవుని వాక్యం ఖండించింది. దేవుడు కుటుంబమును, మానవ సంబంధాలను ఎంతో ఉన్నతమయిన ఉద్దేశ్యాలతో ఏర్పరిచాడు. మన వలె సాటి వారిని ప్రేమించటం, దేవుని ప్రేమను తెలపటం మానవ సంబంధాలలో భాగమే. అదే విధంగా, మన సంతానమును, కుటుంబమును దేవుని వైపు నడిపించటం దేవుడు మనకు ఇచ్చిన బాధ్యత. 

మన బాధ్యతను సక్రమంగా నెరవేర్చకుండా, మనం ఎంత గొప్ప పరిచర్య చేసిన వ్యర్థమేనని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే క్రీస్తు ఆ సిలువలో వ్రేలాడు కూడా తన భాధ్యతను  నెరవేర్చాడు, మనకు పాఠంగా మన ముందుంచాడు. మన పరిచర్య మొదలు కావాల్సింది మన ఇంటి నుండి, మన కుటుంబమునే దేవుడి వైపు నడుపలేని మనం ఇతరులను ఎలా దేవుని వైపు నడపగలం? (1 తిమోతి 3:5) 

నీ శిష్యులు మతాచారములు ఎందుకు పాటించటం లేదని ప్రశ్నించిన పరిసయ్యులను యేసయ్య ఏమని గద్దించాడు? మత్తయి సువార్త 15:4-5 వచనములలో చదవండి. వారు వాక్యమును ఎలా వక్రీకరించి, తల్లితండ్రికి ఒకడు చేయవలసిన మేలును ఎలా తప్పిస్తారో చెప్పాడు. నా వాళ్ళ నీకు కలిగే మేలు నేను దేవునికి ఇచ్చేసాను అని చెప్పించి వారిని బాధ్యత నుండి తప్పుకునేలా చేస్తున్నారు అంటూ  పరిసయ్యుల  వేషధారి తనమును దుయ్యబట్టాడు. దేవుడు మనకు ఇచ్చిన కుటుంబ బాధ్యతను, తల్లి తండ్రుల బాధ్యతను రక రకాల కారణాలు చెప్పి తప్పించుకోవటం వేషధారి తనమే అవుతుంది.

పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 వచనంలో ఏమంటున్నాడు? ఎవరయినా తన సొంత వారిని, ముఖ్యంగా ఇంటి వారిని సంరక్షించక  పోయినట్లయితే, అలాంటి వాడు రక్షణ లేని అవిశ్వాసి కన్న చెడ్డవాడుగ  పరిగణింపబడుతాడని. కనుక సహోదరి, సహోదరుడా మన వారిని మనం నిర్లక్యం చేస్తూ, మనం ఎంత ప్రార్థన పరులం అయినా ప్రయోజనం లేదు,  మనకు రక్షణ రాదు. 

ఎన్నో సార్లు మనం కష్టాల గుండా వెళుతున్నప్పుడు, దేవుడు నా కష్టాలు చూస్తున్నాడా? అసలు నేను ఉన్నాను అన్న సంగతి దేవునికి తెలుసా అని ఆలోచిస్తాము. కానీ దేవుడు ఎప్పుడు మనలను చూస్తూనే ఉంటాడు. ఏనాడు మనలను విస్మరించాడు, మన పట్ల తన ప్రణాళికను నెరవేర్చకుండా ఉండడు. ఆయనకు దగ్గరగా ఉండటమే మనం చేయవలసింది. ఇక్కడ మరియమ్మ, యోహాను యేసయ్య దగ్గరే ఉన్నారు, కనుకనే యేసు వారిని చూసాడు, మరియమ్మ బాధ్యతను యోహానుకు అప్పగించాడు. మనం కూడా  అంతే దగ్గరగా  ఉంటే దేవుడు మన బాధ్యత తీసుకోలేడా? మన సమస్యను తీర్చలేడా? 

మరియమ్మ తల్లి కాబట్టి కొడుకు మీద ప్రేమతో ఆయనకు దగ్గరగా ఉండవచ్చు, కానీ సైనికుల చేత హింసలు పొంది, నిస్సయహంగా వ్రేలాడుతున్న యేసయ్యను చూసి కూడా, అయనతో ఉంటే తనను ఏమయినా చేస్తారేమోనని భయపడకుండా,  ఆయనకు దగ్గరగా ఉన్న యోహాను విశ్వాసం ఎంత గొప్పది? యేసయ్య తన తల్లి బాధ్యత ఇవ్వగానే, తన ఇంట్లో చేర్చుకున్నాడు కదా. మరి దేవుడు ఇచ్చిన మన బాధ్యతలను అంతే విశ్వాసంతో నెరవేరుస్తూ, క్రీస్తుకు మరింత దగ్గరగా ఎదుగుదామా? 

దేవుని చిత్తమయితే నాలుగవ మాటను ధ్యానించుకుందాము, అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి