పేజీలు

14, ఏప్రిల్ 2022, గురువారం

గుడ్ ఫ్రైడే - ఆరవ మాట (యోహాను 19:30)

 

యేసు క్రీస్తుల వారు సిలువలో పలికిన ఆరవ మాట మనం యోహాను సువార్త 19:30 లో చూడవచ్చు. 

యోహాను 19: "30. యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను."

ఆనాడు ఏదెను వనములో అవ్వ, ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి చేసిన పాప దోషమును బట్టి దేవుడు మానవాళికి ఇచ్చిన వాగ్దానమును అనగా పాపం నుండి విమోచన కలుగజేయటానికి క్రీస్తు సిలువలో తన ప్రాణం పెడుతున్నాడని ఇదివరకు మనం ధ్యానించుకున్న మాటలలో కూడా  ప్రస్తావించుకున్నాము. ఆదాము, అవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించి, ఎలాగ పాపం చేశారో దానికి పూర్తీ విరుద్ధముగా క్రీస్తు, నిత్యము దేవుడు ఇచ్చిన ప్రతి ధర్మశాస్త్ర నియమమును అనగా దేవుని ఆజ్ఞను నెరవేర్చి పవిత్రంగా జీవించాడు.  

మనవలె శోధించబడే శరీరము పొందుకొని కూడా శోధనలు జయించి కళంకం లేని దేవుని గొఱ్ఱె పిల్లగా జీవించాడు. దేవుడు మోషే ద్వారా మానవాళికి పది ఆజ్ఞలను ఇచ్చి వారు తనకు ఇష్టమయిన వారుగా అనగా పాపం లేని వారిగా జీవించాలని కోరుకున్నాడు. అయితే పొరపాటున ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేసినట్లయితే, వారికి పాప క్షమాపణ కలుగు లాగున  దేవుడు తానూ పేర్కొన్న జంతువుల రక్త ప్రోక్షణను  మరియు దహన బలి, సమాధాన బలి, పాప పరిహర్ధ బలి, అపరాద పాప పరిహారార్ధ బలి మొదలగు వాటిని చేయుటకు నిబంధన పెట్టాడు.

ఈ నిబంధన ప్రకారం, దేవుడు లేవి గోత్రికులను తనకు యాజకుకులుగా నియమించుకున్నాడు. అందులో ప్రధాన యాజకులు, ఆయనకు సహాయకులు యాజకులు. ఈ ప్రధాన యాజకుడు దేవుని ఆలయంలో ఉంటూ ప్రజలు తెచ్చిన బలులను దేవునికి అర్పిస్తూ, ప్రజల మీద జంతువుల రక్తము ప్రోక్షిస్తూ, వారికి పాప క్షమాపణ కలిగించే వాడు. ఈ నిబంధన ప్రకారం ప్రధాన యాజకులు తప్ప ఇతరులు ఎవరు బలులు అర్పించటానికి లేదు, మరియు ఈ ప్రధాన యాజకులు కూడా ఎన్నో నియమ నిష్టలు పాటించాలి.

లేదంటే దేవుని ఆగ్రహానికి గురి అయ్యేవారు, బలుల అంగీకార సూచనగా దేవుని నుండి అగ్ని వచ్చి ఆ బలులను దహించేది. అయితే ఆపవిత్రమయిన అగ్నితో బలులను దహించాలని చూసిన అహరోను కుమారులను దేవుని అగ్ని దహించినట్లు కూడా మనం చూడవచ్చు (లేవీయ కాండము 10:1-2). ప్రతి యేడాది ప్రధాన యాజకుడు దేవుని మందిరములో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి తన పాపముల నిమిత్తము, మరియు ప్రజల పాపముల నిమిత్తము జంతువుల రక్తమును అర్పించే వాడు (లేవీయ కాండము 16:34)

అయితే ఈ నిబంధనను రద్దు చేసి కొత్త నిబంధనను మానవాళికి ఇవ్వటానికి యేసయ్య ఈ భూమి మీదికి రక్షకుడిగా వచ్చాడు. తన జీవితం అంత ధర్మ శాస్త్రమును నెరవేర్చి, పాపం లేని వాడిగా జీవించి, శ్రేష్ఠమయిన బలిగా తనను తానె అర్పించుకోవటం ద్వారా ప్రధాన యాజకుల కంటే గొప్ప ప్రధాన యాజకుడిగా పిలువ బడ్డాడు (హెబ్రీయులకు 4:14-15) .

యేసు క్రీస్తు దేవుని ఆజ్ఞలు నెరవేర్చటంతో పాటు, దేవుని మీద ఆధారపడి, ఆ స్థాయిని మించిన జీవితము జీవించి మనకు బోధించాడు. ఉదాహరణకు పాత నిబంధనలో నర హత్య చేయరాదు అని ఉంటె క్రీస్తు ఒకరి మీద ఆగ్రహం ఉండటమే హత్యగా బోధించాడు. మరియు వ్యభిచారం చేయరాదు అని ధర్మశాస్త్రం చెపితే మోహపు చూపు కలిగి ఉండటమే వ్యభిచారం అని మన విశ్వాసపు స్థాయిని పెంచాడు. తన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, పరిశుద్దాత్మను పొందుకుని తనవలె జీవించే పరిస్థితులను మనకు కలిగించాడు.

దేవుని హృదయాను సారుడు అను పిలువ బడే దావీదు ఆకలితో ఉన్నప్పుడు దేవుని ఆలయంలో ఉంచిన పవిత్రమయిన రొట్టెలు కూడా తిన్నాడు, కానీ యేసు క్రీస్తు నలుపది దినములు ఉపవాసం ఉండి కూడా, తనను సాతాను రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నప్పుడు "నరుడు కేవలం రొట్టె ద్వారా కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట ద్వారా" అని వాడిని గద్దించాడు. ఇక్కడ దావీదు తప్ప చేసాడని చెప్పటం ఉద్దేశ్యం కాదు, కానీ నూతన నిబంధనను దేవుని మీద ఆధారపడి యేసయ్య అప్పటినుండే జీవించాడు.

"నీ శిష్యులు ఎందుకు ఎప్పుడు ఉపవాసం ఉండరు" అని పరిసయ్యులు యేసును ప్రశ్నించినప్పుడు, అయన ఏమన్నాడు. "పెండ్లి కుమారుడు వారితో ఉండగా ఎవరు ఉపవాసం చేయారని, పెండ్లి కుమారుడు వెళ్లిపోయే రోజు దగ్గరలోనే ఉంది అప్పుడు వారు ఉపవాసం చేస్తారు" అని. మరియు "పాత వస్త్రము పై చిరుగుకు కొత్త వస్త్రం వేయ కూడదని, ఆలాగే పాత తోలు సంచులలో కొత్త ద్రాక్షరసం దాచరాదని" దీని అర్థం ఏమిటి, క్రీస్తు రాకడ నూతన నిబంధన ఏర్పాటు చేయటానికి.

అంటే ఇదివరకు ఉన్న రక్త ప్రోక్షణ, దహన  బలులు రద్దు చేయబడ్డాయి. ప్రధాన యాజకుడు అనే పాత్ర ముగిసి పోయింది, దేవుని ఆలయంలో పవిత్ర స్థలం వెళ్ళే అర్హత  అందరికి లభించింది. ఎలాగంటే మన దేహమే దేవుని ఆలయంగా, క్రీస్తు తన రక్తమిచ్చి కొనుట ద్వారా మనం అయన సొత్తుగా మారిపోయాము. క్రీస్తు ఇచ్చిన ఆదరణ కర్త రూపంలో దేవుడు మనలోనే నివసించటం మొదలు పెట్టాడు. 

నూతన నిబంధనను క్రీస్తు ద్వారా పొందుకున్న మనము నూతనమయిన జీవితము బ్రతుకుతున్నామా? పరిశుద్దాత్మ శక్తి ద్వారా మన శరీర క్రియలను ఉపవాసం ఉంచుతున్నామా? లేక ఈ ఒక్కసారి ఆకలి తీర్చుకుందాం అని సాతానుకు లొంగి పోతున్నామా?

సహోదరి, సహోదరుడా! యేసయ్య మన కోసం తన జీవితం అంత పవిత్రంగా బ్రతికాడు. ఆ సిలువలో తన ఆఖరి రక్తపు బిందువు వరకు మన కోసం కార్చాడు. మరి మన పాత జీవితానికి ముగింపు చెప్పేది ఎప్పుడు! ఆ పాత నిబంధన స్థాయి అనగా శారీరక ఆజ్ఞల నుండి నూతన నిబంధన స్థాయి అనగా మానసిక మార్పులొకి రావాలి. అది కేవలం క్రీస్తు మీద ఆధారపడి, పరిశుద్దాత్మ శక్తి ద్వారానే సాధించగలం. అనగా అయన ఆజ్ఞలు పాటించుట ద్వారా. 

అనాడు అహరోను కుమారులను దహించినట్లు దేవుడు మన పాపములను బట్టి ఈనాడు దహించక పోవచ్చు, కానీ క్రీస్తు పెండ్లి కుమారునిగా వధువు సంఘం కోసం త్వరలో రానున్నాడు. ఆనాడు మనం ఎవరో ఆయనకు  తెలియదంటే మన పరిస్థితి ఏమిటి?  దేవుడు  క్రీస్తు ద్వారా  మనలను ఎన్నుకొని రాజులయిన యాజకులుగా చేశాడు (1 పేతురు 2:9). కానీ మనం ఇంకా పాపనికి బానిసలుగా ఉంటే, క్రీస్తు సిలువలో మన కొరకు ప్రాణం పెడుతూ "సమాప్తమయినది" అని చెప్పిన మాట మనకు అర్థమయినట్లేనా? 

దేవుని చిత్తమయితే ఏడవ మాటను ధ్యానించుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి