పేజీలు

8, ఏప్రిల్ 2022, శుక్రవారం

గుడ్ ఫ్రైడే - మొదటి మాట (లూకా 23:34)

 

ప్రియమయిన సహోదరి సహోదరులారా, గుడ్ ఫ్రైడే చాల సమీపముగా ఉన్న సందర్భంగా,  దేవుని  ప్రేరణను బట్టి మన ప్రభువు, రక్షకుడయినా యేసు క్రీస్తుల వారు మన కోసం తన ప్రాణం పెడుతూ చివరగా అయన సిలువలో పలికిన ఏడు మాటలు ధ్యానిస్తూ, అయన ఆ మాటలు పలికిన ఉద్దేశ్యాలు, నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం చొప్పున మీతో పంచుకోవాలని ఈ గుడ్ ఫ్రైడే పరంపరను  ప్రారంభించాను. 

పాపంలో ఉన్న మానవాళికి క్షమాపణ కలిగించి, తన యందు విశ్వాసం ఉంచిన వారిని నీతి మంతులుగా చేయాలని, దేవుడు ఏర్పరచిన బలిదాన నియమం పూర్తీ చేయటానికి క్రీస్తు ఈ లోకం లోకి వచ్చాడు. అందువల్లనే అయన సిలువలో  తన ప్రాణం పెట్టాడు, మరణం గెలిచి మరల లేచాడు. ఇది అందరికి తెలిసిన ప్రాథమిక విషయం.  తన పరిచర్య మొదలు పెట్టినప్పటి నుండి ప్రభువు ఎన్నో విషయాలు మనకు బోధించాడు, కానీ అయన తుది ఘడియాలో ఉన్నప్పుడు పలికిన ఈ మాటలు ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. 

యేసు క్రీస్తు ప్రభువు సిలువలో పలికిన మొదటి మాట  లూకా సువార్తలో చూడవచ్చు . 

లూకా సువార్త 23: "34. యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి."

తనను హింసిస్తూ, హేళన చేస్తూ, ఘోరమయిన సిలువ శిక్షను అమలు చేస్తున్న ఆ సైనికులను బట్టి ప్రభువు ఈ మాటలు పలుకుతున్నాడు. వారు ఆయనను  సిలువ వేయటం దేవుని చిత్తమే అయినప్పటికి వారి హృదయం ఎలా ఉంది? ఆయనను వారు ఎలా గుర్తిస్తున్నారు అన్న విషయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. వారు ఆయనను కేవలం చేతకాని బోధకుడిగా, నేరస్తునిగా చూస్తున్నారు కనుకనే ఆయనను హేళన చేస్తున్నారు. అయన వస్త్రమును పంచుకోవటానికి చీట్లు వేసుకుంటున్నారు. కానీ వారు ఆయనను దైవ కుమారునిగా గుర్తించటం లేదు. కనుకనే యేసు క్రీస్తు ప్రభువు తండ్రిని, వారు ఏమి చేస్తున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించమని వేడుకుంటున్నాడు. 

క్రీస్తు లక్ష్యం ప్రతి ఒక్కరిని క్షమించటమే. ఎందుకంటే దేవుని ప్రేమను లోకానికి పరిచయం చేయటానికి దేవుడు పంపిన మన రక్షకుడు యేసు క్రీస్తు. అందుకే ఆయన నిత్యము మనలను ప్రేమిస్తూ, క్షమిస్తూనే ఉంటాడు. కానీ ఆ క్షమాపణ అందరు పొందుకొంటారా? ఇక్కడ యేసయ్య సైనికులను క్షమించమని తండ్రిని వేడుకున్నాడు కదా! అందరు క్షమించబడ్డారా? వారందరిలో నుండి ఒక్కరు మాత్రమే క్షమించబడ్డారు. 

మార్కు సువార్త 15: "39. ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను...."

ఈ వచనంలో ఒక శతాధిపతి క్రీస్తును దైవ కుమారునిగా గుర్తిస్తూన్నాడు. అదేవిధంగా ఆయనను  నీతిమంతునిగా గుర్తించి దేవుని మహిమ పరిచాడు అని లూకా సువార్తలో రాయబడింది. తన తప్పులు ఒప్పుకొని క్రీస్తు గొప్పతనం గుర్తించిన వానిగా ఈ శతాధిపతిని మనం చూడవచ్చు.  నశించిపోతున్న వారికి సిలువ సువార్త వెర్రితనంగా ఉందని, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి గా ఉన్నదని రాయబడినట్లుగా (కొరింథీయులకు 1:18)  ఈ సైనికులకు క్రీస్తు త్యాగం వెర్రితనంగా ఉంది. కనుక వారికి క్షమాపణ కలుగ లేదు, కానీ ఆ శతాధిపతి అయన త్యాగం దేవుని కార్యముగా గుర్తించాడు కనుకనే క్రీస్తు ద్వారా దేవుని  క్షమాపణ పొందుకున్నాడు. 

మన స్థితి ఎలా ఉంది? క్రీస్తు త్యాగం గుర్తించి మన పాప క్రియలకు స్వస్తి చెపుతున్నామా? ఇంకా అదే వెఱ్ఱితనపు స్థితిలో ఉన్నామా? క్రీస్తు నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయను గుర్తిస్తున్నావా? నీ రక్షకునిగా అంగీకరించి అటువైపు అడుగులు వేస్తున్నావా? నామమాత్రంగా వెంబడిస్తున్నావా? 

సిలువలో నరకయాతన పొందుతూ క్రీస్తు మనకు నేర్పుతున్న విషయం క్షమాపణ. యేసు ప్రభు తన ప్రసంగాలలో ఎన్నో మారులు క్షమాపణకు సంబందించిన విషయాలు వివరించారు. దేవుడు మనలను క్షమించునట్లుగా మనం ఇతరులను క్షమించాలని లేదంటే దేవుడు మనలను క్షమించాడని (మత్తయి 6:14-15) అయన బోధించాడు, కనుకనే ఆ సిలువలో మనకు  పాఠంగా పాటించాడు. 

మనలో క్షమా గుణం లేని నాడు దేవుడు క్షమించిన మన పాపములన్ని తిరిగి మన మీదికి వస్తాయి. మన విశ్వాసం ఎంత గొప్పదయినా, మనం రోజుకు ఎన్ని సార్లు ప్రార్థించిన, ఎంత సువార్త పరిచర్య చేసిన, ఎన్ని ఆత్మీయ వరములు మనకు ఉన్న, అన్ని కూడా క్షమా గుణం ముందు కొరగానివే. పేతురు యేసు క్రీస్తును "ప్రభువా సాటి సహోదరున్ని ఎన్ని సార్లు క్షమించాలి ఏడుసార్ల?" అని అడిగినప్పుడు ప్రభువు "ఏడు సార్లు కాదు డెభై, ఏడూ సార్లు (సెవెంటీ టైమ్స్ సెవెన్)" అని చెప్పాడు,  అది కూడా ఒక్క రోజులో (లూకా 17:4). అంటే మన  క్షమాపణకు హద్దు ఉండకూడదు అని కదా! 

యేసు క్రీస్తు మత్తయి సువార్తలో చెప్పిన ఒక ఉపమానము చూసినట్లయితే, క్షమా గుణం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందొ మనకు అవగతం అవుతుంది. దయచేసి మత్తయి సువార్త 18:23-35 వరకు చదవండి. ఇక్కడ యేసు ప్రభువు పరలోకంలో దేవుని తీర్పు ఎలా ఉంటుందో ఉపమాన రీతిగా వివరిస్తున్నాడు. ఒక దాసుడు రాజుకు పది వేయిల తలాంతులు అప్పుగా ఉన్నాడు. రాజు అతనిని అప్పు తీర్చుమని ఆజ్ఞాపించగా, అతను కష్టాలలో ఉన్నాను,  మరి కొంత గడువు ఇవ్వండి మీ అప్పు తప్పకుండా తీరుస్తాను అని మొఱ్ఱ పెట్టుకున్నాడు. 

రాజు అతని మీద జాలి పడి అతని అప్పును పూర్తిగా రద్దు చేసాడు. ఆ దాసుడు చాల సంతోషంగా రాజసభ నుండి బయటకు వచ్చాడు. తర్వాత తనకు వంద తలాంతులు అప్పుగా ఉన్న సాటి దాసుని, పట్టుకొని అప్పు తీర్చమని వేధించటం మొదలు పెట్టాడు. ఆ దాసుడు కష్టాలలో ఉన్నాను, మరి కొంత గడువు ఇస్తే తన అప్పు తీరుస్తానని ఎంత బ్రతిమాలిన వినిపించుకోకుండా అప్పు తీర్చేవరకు అతన్ని చెరసాలలో వేయించాడు. 

ఇది చూసిన కొంతమంది దాసులు బహుగా దుఃఖపడి, రాజు దగ్గరికి వెళ్ళి జరిగింది వివరించారు. రాజు ఆగ్రహం చెంది, ఆ మొదటి దాసుణ్ణి పిలిపించి, నేను నిన్ను కరుణించినట్లు, నీ సాటి వాడిని నువ్వు కరుణించలేదని చెప్పి, అప్పు తీర్చే వరకు అతణ్ణి  చెరసాలలో వేసి, హింసించే వారికి అప్పగించాడు. 

ప్రియా సహోదరి, సహోదరుడా! ఇకనయినా క్షమాగుణం అలవర్చుకోండి. ఎదుటి వారు మనపట్ల చేసిన తప్పులకు దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు కానీ మనం తీర్పు తీర్చే వారీగా ఉండి, క్షమాపణ పాటించక పొతే దేవుడు క్షమించిన మన పాపములన్నియు మరల మన మీదికి వస్తాయి. అప్పు రద్దయిన దాసుడు సాటి దాసుని పట్ల కఠినంగా ఉన్నందుకు ఏమి జరిగింది? రద్దయిన అప్పు మరల తన మీదికి వచ్చింది, అదనంగా జైలు శిక్ష, మరియు హింస పొందుకున్నాడు. అటువంటి స్థితిలో మనం నశించి పోరాదని,  యేసు క్రీస్తు సిలువలో హింసలు పొందుతూ, మనకు క్షమాగుణం యొక్క ప్రాముఖ్యతను నేర్పించాడు. 

దేవుని చిత్తమయితే రెండవ మాటను మనం ధ్యానించుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి