పేజీలు

9, ఏప్రిల్ 2022, శనివారం

గుడ్ ఫ్రైడే - రెండవ మాట (లూకా 23:43)

 

క్రీస్తును సిలువ వేసిన సమయంలో ఆయన తో పాటు మరో ఇద్దరు దొంగలు, హంతకులు అయినా వారికి కూడా సిలువ శిక్షను అమలు పరిచారు. యేసు క్రీస్తు కు చెరొక వైపున వారిని సిలువలో వ్రేలాడ దిశారు. అక్కడ ఉన్న సైనికులు యేసు క్రీస్తును "రక్షకుడివయితే నిన్ను నీవు రక్షించుకో" అని ఎంతగానో హేళన చేస్తున్నారు. చాల మంది అవిశ్వాసులు క్రీస్తును చేతకాని వానిగా, తనను తానూ కాపాడుకోలేని వాడిగా చూస్తూ ఉంటారు. కానీ సముద్రమును సైతం గద్దించిన దైవ కుమారునికి అది అసాధ్యమా? చనిపోయిన వారిని లేపిన జీవదాతకు తనను తానూ కాపాడుకోవటం చేతకాదా? 

ఇటువంటి స్థితిలోనే ఆ ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు. సైనికులతో పాటు ఆయనను హేళన చేయసాగారు. క్రీస్తు చూపుతున్న క్షమా గుణం చూసిన తర్వాత వారిలో ఒక దొంగ, తన స్థితిని గుర్తు పట్టాడు. తన జీవితంలో చేసిన పాపములు అన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఈ శిక్ష తమకు సరయినదేనని మొదటి దొంగతో చెప్పి,  క్రీస్తు నిర్దోషిగా ఉండి ఇటువంటి ఘోర శిక్షను అనుభవిస్తున్నాడు అని పలికాడు. ఆయనలో ఆ రెండవ దొంగ రక్షకుణ్ణి చూసాడు, అందుకే "నీ రాజ్యములో నన్ను గుర్తు చేసుకో" అని యేసును వేడుకున్నాడు. 

అందుకు బదులుగా క్రీస్తు సిలువలో పలికిన రెండవ మాట లూకా 23:43 లో చూడవచ్చు. 

లూకా సువార్త 23: "43. అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను."

ఇక్కడ ఇద్దరు దొంగలు ఒకే మార్గంలో పయనం మొదలు పెట్టారు, ఇద్దరు ఒకేరకమయిన పాపపు జీవితం గడిపారు, కనుకనే సిలువ శిక్షను అనుభవిస్తున్నారు. సైనికులు క్రీస్తును ఎగతాళి చేయటం చూసి, ఆయనను రెచ్చగొడితే తమను రక్షిస్తాడేమోనని అందులో ఒక దొంగ "నిన్ను నువ్వు రక్షించుకొని మమల్ని కూడా రక్షించు" అంటున్నాడు. అతను రక్షణ కోరుతున్నాడు కానీ, తన తప్పులు గుర్తించలేని వానిగా ఉన్నాడు. తానేదో నీతిమంతుడయితే అన్యాయంగా ఈ శిక్షను అనుభవిస్తునట్లుగా భావిస్తున్నాడు. మరియు దేవుని యెడల భయం లేని వానిగా ఉన్నాడు. క్రీస్తు వారితో పాటు సిలువలో వ్రేలాడుతున్నాడు కదా అని, అయన దైవత్వమును, క్షమా గుణమును గుర్తించలేని వానిగా ఉన్నాడు. 

అయన సిలువలో వ్రేలాడుతున్నది, మరొక ఉన్నతమయిన ఉద్దేశ్యము కోసమని రెండవ దొంగ గుర్తించాడు. అందుకే "దేవునికి భయపడవా" అని మొదటి దొంగను గద్దిస్తున్నాడు.  మనం చేసిన పాపాలకు ఈ శిక్ష మనకు సరయినదే, కానీ ఈయనలో ఏ తప్పు లేదంటున్నాడు. ఈ లోక పరమయిన మరణం నుండి కాకుండా, నిత్య నరకం నుండి తప్పించు రక్షకునిగా క్రీస్తును గుర్తించాడు కనుకనే, ఈ లోక మరణం తర్వాత రక్షణకై  యేసు ప్రభువును బ్రతిమాలుతున్నాడు. మనలో ఎంత మంది ఇటువంటి రక్షణకై క్రీస్తును విశ్వసిస్తున్నాము? 

మొదటి దొంగ అప్పటికప్పుడు, ఆ సిలువ శిక్ష నుండి విడుదల కోసం చూస్తున్నాడు, తద్వారా క్రీస్తు  నుండి అద్భుతాలను ఆశిస్తున్నాడు! యేసు క్రీస్తుకు అద్భుతాలు చేయటం కొత్తకాదు, అలాగే మన జీవితంలో కూడా అయన అద్భుతాలు చేయగలడు. ఆయనను మనం నమ్ముకోవలసింది శాశ్వతమయిన రక్షణ కొరకు, మన పాపముల నుండి విడుదల కొరకు. చాల సంఘాలలో దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు అని చెపుతూ లోక పరమయిన ఆశీర్వాదాలకై విశ్వాసులను ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ ఆత్మీయ అభివృద్ధిని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ  ఆ రెండవ దొంగ లోక పరమయిన విషయాలకు కాకుండా శాశ్వత రక్షణకై క్రీస్తును విశ్వసిస్తున్నాడు. 

విశ్వాసం చూపినంతనే ఆ రెండవ దొంగకు రక్షణ  దొరికిందా? మొదటి దొంగ ఏ విధంగా రక్షణ పొందుకోలేక పోయాడు? మొదటి దొంగ తాను చేసిన పాపాలను ఒప్పుకోవటం, లేదా కనీసం తన తప్పులను గుర్తించటం చేయలేదు. అందుకే పశ్చాత్తాప పడలేక పోయాడు. కానీ వేధన పడుతూ దేవుణ్ణి దూషిస్తున్నాడు. అలాగే రక్షించినప్పుడు విశ్వాసిద్దంలే  అని నిర్లక్ష్యం కనపరిచాడు. మనం కూడా అంతే కదా! జరిగినప్పుడు చూద్దాంలే, మనకు ఇంకా చాల సమయం ఉంది, అనుకుంటూ ఉచితమయిన రక్షణను నిర్లక్ష్యం చేస్తుంటాము. కానీ సమయానికి సాధ్యపడక దేవునికి దూరంగా నశించి పోతాము. 

కానీ రెండవ దొంగ అటువంటి నిర్లక్యం చేయలేదు. తన పాపములు ఒప్పుకున్నాడు, ఈ శిక్ష తనకు సరయినదే అనటంలో తాను ఎంతగా పశ్చాత్తాప పడుతున్నాడో యేసయ్య చూశాడు. తనతో పాటు, తనకన్నా ఘోరమయిన స్థితిలో ఉన్న క్రీస్తును చూసి, ఆయనను రక్షకుడిగా విశ్వసించాడు. అతనిలో అద్భుతాల పట్ల ఆసక్తి లేదు, కేవలం క్రీస్తు తనను రక్షిస్తాడన్న విశ్వాసం మాత్రమే ఉన్నాయి. 

ప్రియా సహోదరి, సహోదరుడా! దేవుడు ఇప్పుడు నీ జీవితంలో మౌనంగా ఉండవచ్చు! ఏ కార్యం నీవితంలో జరుగటం లేదేమో! కానీ ఈ స్తబ్దత కొంత కాలమే. శాశ్వత మయిన రక్షణ మనకై వేచి ఉంది. నిత్యం నీ తప్పులు ఒప్పుకో, ఆయనే వాటి మీద విజయం ఇస్తాడు. ఆ సిలువలో అయన చేసింది, వాటిని జయించటమే! మొదటి దొంగ మాదిరి వేధన చూపకుండా,  పశ్చాతాపం, విశ్వాసం చూపించు. ఆయన మన కోసం పరదైసు లో ఎదురు చూస్తున్నాడు. 

దేవుని చిత్తమయితే మూడవ  మాటను మనం ధ్యానించుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి