పేజీలు

16, ఏప్రిల్ 2022, శనివారం

ఈస్టర్ సందేశము

 

ప్రియమయిన సహోదరి, సహోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు. మన ప్రభువు,  రక్షకుడయినా యేసు క్రీస్తు మనలను పాపం నుండి వచ్చే జీతము, మరణము నుండి రక్షించి అనగా నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవితము అనగా తండ్రి, కుమారునితో పరలోకమందు నివసించటానికి, సిలువలో ప్రాణం పెట్టి తిరిగి మూడవ దినమున మరణం నుండి పునరుత్థానుడిగా  లేచాడు అని మనలో అందరికి తెలిసిన విషయమే కదా!

మత్తయి 28: "10యేసు భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను."

క్రీస్తు మరణం గెలిచి సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత తనను వెతుకుతున్న మగ్దలేనే మరియకు కనబడి చెప్పిన ఈ మాటను మనం కాస్త లోతుగా ధ్యానించుకుందాము. ఇక్కడ అయన తన  శిష్యులను "నా సహోదరులు" అని సంభోదించాడు. అంతకుముందు అయన వారిని ప్రేమించాడు కానీ, ఇటువంటి సంబోధన చేసినట్లు మనం చూడము. దీన్ని బట్టి యేసయ్య, మనం అయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం తనతో పాటు తండ్రి దగ్గర ఉండబోతున్నాము అని  నిశ్చయతను ఇస్తున్నాడు. ఈ వచనమును మరి కాస్త లోతుగా ఆలోచిస్తే అయన శిష్యులను గలిలయలో కలుసుకోవాలనుకున్నాడు. దానికి గల  కారణం  మనం లేఖనముల బట్టి అర్థం చేసుకుందాము. 

దయచేసి మత్తయి 4:14-16 చదివినట్లయితే యేసు క్రీస్తు, యెషయా ప్రవక్త తన ప్రవచనములో చెప్పినట్లు  అంధకారంలో ఉన్న ఆ ప్రాంతం అనగా గలిలయ ప్రాంతం, వెలుగు పొందుకోను లాగా తన  పరిచర్యను అక్కడ నుండే మొదలు పెట్టాడు అని చూడవచ్చు.  అలాగే యోహాను సువార్త 7:40-52  చూసినట్లయితే,  యేసును క్రీస్తు అని కొందరు, ప్రవక్త అని కొందరు వాదించుకున్నారు. అయితే పరిసయ్యులు మాత్రం "అధికారులు, పరిసయ్యులలో (మత నాయకులు) ఎవరయినా అతణ్ణి విశ్వసించరా? అసలు గలిలయ ప్రాంతం నుండి ఎవరయినా ప్రవక్త వస్తాడా? విశ్వాసించే ఈ ప్రజలు ధర్మ శాస్త్రం తెలియని శాపగ్రస్తులు" అంటున్నారు. 

క్రీస్తు ఒకరి లేఖనముల జ్ఞానం చూసి రక్షణ ఇవ్వడు. కేవలం తన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే తానూ సాధించిన రక్షణను పంచబోతున్నాడు. లేఖనముల గర్వంతో క్రీస్తును గుర్తించలేని జ్ఞానులయిన వారిని సిగ్గుపరచులాగా, ఆ ప్రాంతం నుండి జాలరులయిన వారిని తన శిష్యులుగా చేసుకొని విశ్వాసంలో వారిని నడిపించాడు. మరల ఇప్పుడు సర్వ లోకానికి సువార్త పరిచర్యను శిష్యులకు అప్పగించటానికి వారిని అక్కడ కలుసుకో బోతున్నాడు అని అవగతమవుతుంది. 

క్రీస్తు మరియతో అన్న మరొక మాట భయకుడి. ఈ మాటను యేసయ్య తన బోధనలలో పలు మార్లు చెప్పినట్లు మనం చూడవచ్చు. ఆ మాటను ఇప్పుడు చెపుతుంది, మరణం నుండి లేచినా తనను చూసి భయపకుడి అని చెపుతున్నాడా?  లేదా నేను లేచాను గనుక ఇక భయపడకుడి అని చెపుతున్నాడా? మానవులకు అత్యంత భయంకరమయిన విషయము మరణము. దానిని వారికి  తప్పించటానికి,  సృష్టికి కారకుడయినా యేసును సిలువ మరణానికి అప్పగించి, మృత్యుంజయుడిగా చేసాడు తండ్రి అయినా దేవుడు. 

క్రీస్తు తాను పరిశుద్ధ పరచిన, మరియు పరిశుద్ధపరచ బోయే అందరిని సోదరులుగా పిలవటానికి సిగ్గుపడలేదు. వాక్కుగా ఉన్న అయన మనకోసం శరీరం ధరించి, మనవలె రక్త మాంసములు పొందుకొని, మన శరీరంలో మరణానికి అధిపతి అయినా సాతానును జయించి మన రక్త మాంసములలో  పాలిభాగస్తుడయ్యాడు (హెబ్రీయులకు 2:11-15).  తనయందు విశ్వాసం ఉంచిన మానవులకు మరణ భయమును దూరం చేయగల సమర్ధుడిగా లేచాడు, అందును బట్టి తానూ మరణం గెలిచి లేచిన వెంటనే భయపడకుడి అని చెపుతున్నాడు. 

మరి ఆయనకు నిజమయిన  సహోదరీ, సహోదరులుగా మనం అర్హత సంపాదిస్తున్నామా? యేసయ్య భూమిమీద బ్రతికినప్పుడు, తన సొంత తల్లి, సహోదరులు తనను  చూడవచ్చారని చెప్పినప్పుడు ఏమన్నాడు? (లూకా 8:21)  దేవుని వాక్యము విని దాని ప్రకారము చేయువారు మాత్రమే నా తల్లి, నా సహోదరులు అని చెప్పాడు కదా! దేవుని వాక్యము అన్నింటికన్నా ఎక్కువ దేనిని ఖండిస్తుంది, అవిశ్వాసమును. ఎందుకంటే పాపి అయినా వాడిని రక్షించటానికే క్రీస్తు భూమి మీదికి వచ్చాడు కానీ అవిశ్వాసి అయినా వాడు ఎన్నడూ కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది (హెబ్రీయులకు 11:6)

అయితే సహోదరులు అని సంభోదించిన క్రీస్తు శిష్యులు మాత్రం విశ్వాసం చూపించలేక పోయారు. కనుక అయన వారిని "అవివేకులారా, క్రీస్తు గురించి ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా" అని  గద్దించి  మోషే, మరియు సమస్త ప్రవక్తలు తన గురించి చెప్పిన మాటలకూ అర్థం వివరించాడు. అయినప్పటికి వారి కనులు తెరువబడలేదు. ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చెప్పి  విరిచి  ఇచ్చిన తరువాత ఆయనను గుర్తుపట్టారు. అయన అదృశ్యం అయినా తరువాత ఒకరితో ఒకరు "అయన లేఖనముల అర్థం చెపుతుంటే హృదయంలో మండింది కదా!" అని చెప్పుకున్నారు (లూకా 24:25-32). దీనిని బట్టి మనకు అర్థం అవుతున్న సంగతి ఏమిటి? దేవుని వాక్యం వారిలో క్రియ చేసింది కానీ, వారి అవిశ్వాసం, హృదయ కఠినత్వం క్రీస్తును వారు గుర్తించని స్థితిలో ఉంచింది.  

ఆనాడు వారికి బైబిల్ అందుబాటులో లేదు, మరియు క్రీస్తు ఇచ్చిన ఆదరణ కర్త అనగా పరిశుద్దాత్మ ఇంకా రాలేదు. కనుక క్రీస్తు వారిని గద్దించి తిరిగి విశ్వాసం నేర్పించాడు. ఎక్కడ పడితే అక్కడ రక రకాల రూపంలో దేవుని వాక్యం అందుబాటులో ఉంది, అర్థం చెప్పటానికి పరిశుద్దాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఎంతవరకు వాక్యం చదువుతూ పాటిస్తున్నాం? అసలు రోజుకు ఒక్కసారి చదువుతున్నామా?

కీర్తనలు 104: "34. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక నేను యెహోవాయందు సంతోషించెదను."

ఇక్కడ కీర్తన కారుడు "దేవుని గురించిన ధ్యానము ఆయనకు ఇంపుగా ఉంటుంది కాబట్టి, అందును బట్టి నేను సంతోషిస్తాను" అంటున్నాడు. దేవుని గురించి ధ్యానము ఎలా చేస్తాము, అయన వాక్యము చదవటం ద్వారానే కదా? అందును బట్టి దేవుడు మనలను తనకు ఇంపైన వారిగా ఎన్నుకుంటాడు.  అందులోనే మన సంతోషం దాగి ఉంది. తద్వారా మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. 

ప్రియా సహోదరి, సహోదరుడా! మనం  క్రీస్తు విశ్వాసులం అని చెపుతూ  అని పాటలు పాడుతూ, సంఘానికి వెళితే సరిపోదు. ప్రభువు చెప్పిన సువార్త పరిచర్య భారం కలిగి ఉండాలి, ప్రభువే మార్గాలు తెరుస్తాడు. దేవుని వాక్యము నిత్యమూ చదువుతూ అయన స్వరమును వినాలి. విన్నది ఆచరించాలి, వాక్యం ఒకటి చెపుతుంటే, ఎవరో ఎదో చెప్పారని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించి దేవునితో ఉన్న సోదర సంబంధమును పోగొట్టు కోవద్దు, ప్రభువు మన కొరకు సిలువలో వేధన పడి, మరణాన్ని గెలిచి తెచ్చిన రక్షణ కోల్పోవద్దు. 

దేవుని చిత్తమయితే మరో వాక్య భాగం ధ్యానించుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి